విశాఖలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్కు : మేకపాటి

విశాఖలో డిఫెన్స్ ఎంఎస్ఎంఈ పార్కు : మేకపాటి

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని భీమిలి నియోజకవర్గంలో డిఫెన్స్‌ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఐటీ, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి మేక పాటి గౌతమ్‌ రెడ్డి తెలిపారు. రుషికొండ సమీపంలోని రాడిసన్స్‌ బ్లూ హోటల్‌లో నిర్వహించిన దేశీ 2021 ఆంధ్రప్రదేశ్‌ వర్క్‌ షాప్‌నకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి  శ్రీనివాస్‌రావుతో కలిసి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఇన్నోవేషన్స్‌ సొసైటీ (ఏపీఐఎస్‌) ఆరోత్యన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,  ఏపీఈఐటీఏ` నేషనల్‌ రీసెర్చ్‌ డిజైన్‌ కార్పొరేషన్ల మద్య మంత్రుల సమక్షంలో అవగాహన ఒప్పందాలు జరిగాయి. ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, వర్చువల్‌గా డీఆర్డీవో చైర్మన్‌ సతీష్‌రెడ్డి, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ కేంద్రంగా డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ రంగంలో మంచి అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ జీడీపీలో రాష్ట్రం వాటా 5 శాతంగా ఉందని అన్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు చేపట్టి సమర్థవంతమైన పాలన అందిస్తోందన్నారు.

ఈ`గవర్నెన్స్‌, ఇంటర్నెట్‌ వంటి అంశాల్లో భవిష్యత్‌లో దేశంలోనే ఏపీ బెస్ట్‌ అనిపించుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.  పరిశ్రమలకు కావాల్సిన సదుపాయాలన్ని ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. 2 వేల పైబడి ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు కస్టమ్స్‌ సహా పలు రాయితీలు ఇస్తామని హామీ ఇచ్చారు. కొత్త పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ఎటువంటి అవాంతరాలు ఉండకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెట్టుబడిదారుల అనుకూల విధానాలతో రాష్ట్రం ముందంజలో ఉందన్నారు.

 

Tags :