ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఆప్ భవిష్యత్ ఏంటి..? కేజ్రివాల్ బయటికొస్తారా..?

ఆప్ భవిష్యత్ ఏంటి..? కేజ్రివాల్ బయటికొస్తారా..?

ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టుకే ఒక సంచలనం అనుకుంటే అనతికాలంలోనే అది జాతీయ స్థాయికి ఎదగడం మరింత సెన్సేషన్. అవినీతికి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అది. అన్నాహజారేతో కలిసి లోక్ పాల్ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన అరవింద్ కేజ్రివాల్ రాజకీయాల ద్వారానే మార్పు సాధ్యమని భావించి ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టారు. ఢిల్లీలో తిరుగులేని విజయం సాధించారు. వరుసగా రెండు సార్లు ఢిల్లీ ప్రజలు ఆ పార్టీకి ఊహించని విజయాన్ని కట్టబెట్టారు. అంతటితో ఆగలేదు. పక్కనే ఉన్న పంజాబ్ లోనూ పాగా వేసింది. ఉత్తర భారత రాష్ట్రాల్లో శరవేగంగా చొచ్చుకుపోతూ ఉంది. ఎప్పటికైనా ఢిల్లీ పీఠమే లక్ష్యంగా అరవింద్ కేజ్రివాల్ అడుగులేస్తూ వెళ్తున్నారు..

కానీ అన్నీ అనుకున్నట్టు జరగవు కదా..! అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించిన అరవింద్ కేజ్రివాల్ ఇప్పుడు అందులోనే చిక్కుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రివాల్ అరెస్ట్ అయి జైలుకెళ్లారు. దీంతో ఇప్పుడు ఆ పార్టీ భవిష్యత్ ఏంటనేది అంతుచిక్కడం లేదు. ఇన్నాళ్లూ ఆ పార్టీని కేజ్రివాల్ ఏకతాటిపైన నడిపిస్తూ వస్తున్నారు. బీజేపీ నుంచి ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదురొడ్డి పోరాడుతున్నారు. దేశంలో పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో పెట్టుకున్నా ఆ తర్వాత మెత్తబడి లొంగిపోతూ వచ్చాయి. కానీ కేజ్రివాల్ మాత్రం బీజేపీ విషయంలో ఎక్కడా వెనక్కు తగ్గట్లేదు. అరవింద్ కేజ్రివాల్ బీజేపీకి పక్కలో బల్లెంలా తయారయ్యారు.

రాజధాని ఢిల్లీ ఆప్ చేతిలో ఉండడం బీజేపీకి అస్సలు నచ్చట్లేదని అర్థమవుతోంది. కేజ్రివాల్ ను ముప్పుతిప్పలు పెడుతోంది. అయినా కేజ్రివాల్ కు ప్రజల మద్దతు బలంగా ఉంది. ఇప్పటికే వరుసగా రెండు సార్లు ఆ పార్టీని గెలిపించారు ఢిల్లీ ప్రజలు. కానీ పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం కమలానికి జైకొడుతున్నారు. ఈ విషయాలను పక్కన పెడితే ఉత్తరాది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రాభవం తగ్గుతూ వస్తోంది. కానీ ఆప్ మాత్రం వేగంగా చొచ్చుకెళ్తోంది. ఎప్పటికైనా ఆప్ తమకు మొగుడిలా తయారవుతుందనేది బీజేపీ భావన. అందుకే ఆ పార్టీ విషయంలో బీజేపీ తగ్గట్లేదు.. కేజ్రివాల్ కూడా వెన్ను చూపట్లేదు.

కేజ్రివాల్ కు మనీష్ సిసోడియా కుడిభుజంలా ఉండేవారు. కానీ ఆయన కూడా ఇదే కేసులో జైలులో ఉన్నారు. ఇప్పుడు కేజ్రివాల్ కూడా జైలుబాట పట్టడంతో ఆ పార్టీ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. జైలు నుంచే పరిపాలిస్తానని కేజ్రివాల్ చెప్తున్నా అది అంత సులువు కాదు. పైగా ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో కేజ్రివాల్ జైలులో ఉండాల్సి రావడం ఆ పార్టీ శ్రేణులను నైతికంగా దెబ్బకొట్టినట్టే. మరోవైపు వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. దీంతో నాయకుడు లేకుండా ఆ పార్టీ మనుగడ సాధించడం అంత సులువు కాదు. ఆప్ లోని బలమైన నేతలకు బీజేపీ వల వేసి లాగడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే ఆప్ దుకాణం బంద్ కాక తప్పదు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :