166 అక్రమ కట్టడాలపై హైడ్రా ఖడ్గం..
రాజధానిలో చెరువులు, పార్కు స్థలాలు ఆక్రమించి 18 చోట్ల చేపట్టిన 166 నిర్మాణాలను కూల్చివేసినట్లు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్స్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ(హైడ్రా) ప్రభుత్వానికి నివేదించింది. ఈ మేరకు చెరువుల పూర్తిస్థాయి నీటిమట్టం(ఎఫ్టీఎల్), బఫర్‌జోన్‌లో నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటివరకు చేపట్టిన చర్యలపై సర్కారుకు నివేదిక సమర్పించింది. సినీ నటుడు అక్కినేని నాగార్జున, ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, మంథని నియోజకవర్గంలో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్‌రెడ్డి, చింతల్ బీఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, ప్రొకబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమకు చెందిన కట్టడాలను కూల్చివేసినట్లు తెలిపింది.
చెరువులు, నాలాలు, పార్కులను ఆక్రమించి 43.94 ఎకరాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేసినట్లు పేర్కొంది హైడ్రా. బంజారాహిల్స్ లోటస్ పాండ్ మొదలు, మన్సూరాబాద్, బీఆర్కేనగర్, గాజులరామారం, అమీర్‌పేట, మాదాపూర్, గండిపేటలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసినట్లు వెల్లడించింది. ఆక్రమణలకు మద్దతిస్తున్న వారిపైనా చర్యలకు ఉపక్రమించినట్లు తెలిపింది. నందగిరిహిల్స్ పార్క్ ప్రహరీ కూల్చివేసి ఆక్రమణలకు పాల్పడిన స్థానికులకు మద్దతుగా నిలిచిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై కేసు పెట్టినట్లు పేర్కొంది.
కూల్చివేతలు జరిగిన క్రమంపై హైడ్రా వివరణ
జులై14.. ఫిల్మ్‌నగర్ బీజేఆర్‌నగర్‌లో 5 ఎకరాల విస్తీర్ణంలో నాలా ఆక్రమించి స్లాబ్ వేయడంతో తొలగించారు. ఆగస్టు 8.. గాజులరామారం చింతల్ చెరువులో 3.5 ఎకరాలను బీఆర్ఎస్ స్థానిక నేత రత్నాకరం సాయిరాజు ఆక్రమించి, 54 రేకుల నిర్మాణాలు చేపట్టారు. వీటిని నేలమట్టం చేశారు. ఆగస్టు 9.. జూబ్లీహిల్స్ నందగిరిహిల్స్‌లో 0.18 ఎకరాల్లో వేసిన 16 షెడ్లను తొలగించారు.ఆక్రమణదారులకు ఎమ్మెల్యే దానం వత్తాసు పలికారని హైడ్రా నివేదికలో పేర్కొంది.
ఆగస్టు 10.. రాజేంద్రనగర్ బమ్రుద్దీన్దౌలా చెరువులో 12 ఎకరాల విస్తీర్ణంలోని అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. బహదూర్‌పుర ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్ ఆక్రమించి జీ+5 అంతస్తులు కట్టారు. ఎంఐఎం ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ జీ+2 అంతస్తుల భవనం కట్టారు. వీరిద్దరి నిర్మాణాలతోపాటు మరో భవనాన్ని నేలమట్టం చేసింది. ప్రహరీ చుట్టూ ఆక్రమణలను తొలగించింది. ఇక్కడ ఒక్కచోటే 45 నిర్మాణాలను తొలగించారు. అడ్డుకోబోయిన ఎమ్మెల్యేను అరెస్టు చేశారు.
ఆగస్టు 14.. ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులో 0.29 ఎకరాలు ఆక్రమించి కట్టిన మూడు 5 అంతస్తుల భవనాలను కూల్చేశారు. ఆగస్టు 18.. ఖానాపూర్‌లో 8.75 ఎకరాల మేర గండిపేట చెరువును కబ్జా చేసిన చేపట్టిన 14 నిర్మాణాలను నేలమట్టం చేశారు. చిలుకూరులో ఉస్మాన్‌సాగర్‌లో 6.5 ఎకరాల్లో కట్టిన 10 నిర్మాణాలు కూల్చివేశారు. గండిపేట చెరువును ఆక్రమించి కాంగ్రెస్ నాయకుడు పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్(ఓఆర్వో స్పోర్ట్స్), కావేరీ సీడ్స్ యజమాని జి.వి.భాస్కరరావు, మంథని నుంచి బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సునీల్‌రెడ్డి, ప్రొకబడ్డీ జట్టు యజమాని శ్రీనివాస్ భార్య అనుపమ నిర్మాణాలు చేపట్టారు. వీటిని బుల్డోజర్తో నేలమట్టం చేశారు. ఆగస్టు 24.. మాదాపూర్ తమ్మిడికుంటలో 4.9 ఎకరాలు ఆక్రమించి సినీనటుడు నాగార్జున నిర్మించిన ఎన్-కన్వెన్షన్ సెంటర్‌ను హైడ్రా కూల్చివేసింది.
ఫిర్యాదుల వెల్లువ
హైడ్రా రంగంలోకి దిగినప్పటి నుంచి నగరవ్యాప్తంగా చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై ప్రజలు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రజాప్రతినిధుల అక్రమ నిర్మాణాలకు సంబంధించి డ్రోన్ చిత్రాలను ‘ఎక్స్’లో పోస్ట్ చేసి వాటిని సైతం కూల్చాలని హైడ్రాను కోరుతున్నారు. ఇందులో అన్ని రాజకీయ పార్టీ నేతల నివాసాలున్నాయి.






