ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

తానా రాజకీయ చర్చ

తానా రాజకీయ చర్చ

వాషింగ్టన్‌ డీసీలో జరుగుతున్న తానా మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన వైకాపా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌తో ఏర్పాటు చేసిన ఓ సమావేశం రాజకీయ వేడిని రగిల్చింది. రాజకీయ వేదికలో ఆయన మాట్లాడుతున్నప్పుడు పలువురు ఎన్నారైలు ఆయన తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోలవరం పూర్తి చేస్తారా? చేయరా? అంటూ ఎన్నారైలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా నినాదాలిస్తూ,  వైకాపాకు, జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారి ప్రశ్నకు వసంత కృష్ణ ప్రసాద్‌ ధీటుగానే సమాధానం ఇచ్చారు.

టంగుటూరి అంజయ్య హయాంలో శంకుస్థాపన చేసిన పోలవరాన్ని ఇన్ని రోజులు పూర్తి చేయకుండా ఉంచడం సిగ్గుచేటు అని, అసలు దాన్ని పూర్తి చేస్తారా? చేయరా? అంటూ సత్తిరాజు సోమేశ్వరరావు అనే ఎన్నారై వసంతను నిలదీశారు. దీనికి బదులు చెప్పే క్రమంలో వసంత మాట్లాడుతూ మైలవరం మాజీ ఎమ్మెల్యే, మాజీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా ప్రతి సోమవారం సమీక్షలని, రైతులకు ఉచిత విహారాలని పోలవరానికి ప్రభుత్వ సొమ్ములతో బస్సులు పెట్టి మరీ ప్రభుత్వాదాయాన్ని దుర్వినియోగం చేసి పోలవరం కాలయాపనకు కారకులయ్యారని తెలిపారు. దీనికి నిరసనగా వేడుకల్లో పాల్గొన్న ప్రవాసులు జై తెదేపా అంటూ నినాదాలు అందుకున్నారు. వసంత ఎక్కడా కూడా తన ప్రసంగాన్ని ఆపకుండా 2022 కల్లా పోలవరాన్ని పూర్తి చేసి తీరుతామని అన్నారు. 

అనంతరం కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరును పెడతానని జగన్‌ తన పాదయాత్రలో వాగ్ధానం చేశారని, అదెందుకు పూర్తి చేయలేదని ఎన్నారైలు మరో ప్రశ్న సంధించగా, తాము అధికారంలోకి వచ్చి 40రోజులు కూడా కాలేదని ఆగష్టులో జిల్లాల పునర్విభజనలో ఏపీలోని 13జిల్లాలు 25 అవుతాయని, ఆ సందర్భంలో కృష్ణా జిల్లా పేరు మార్చి తీరుతామని తెలిపారు. 

అనంతరం తానా అధ్యక్షుడు వేమన సతీష్‌ మాట్లాడుతూ, 2009 తానాలో ''తానాలో తన్నులాట'' శీర్షికన అప్పటి రాజకీయ వేదికపై వార్తలు వచ్చాయని, నేటి చర్చావేదిక కూడా దానికి తగ్గట్టుగానే ఉందంటూ ఇంతటితో ఆపండని సర్దిచెప్పి సభను ముగించారు. ఈ చర్చావేదికలో మల్లు భట్టి విక్రమార్క, రసమయి బాలకిషన్‌, గన్నికృష్ణ, జయరాం కోమటి, నాదెళ్ల గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :