ASBL NSL Infratech

నంద్యాల సభలో వైయస్ జగన్

నంద్యాల సభలో వైయస్ జగన్

19 నెలల తర్వాత చూస్తే, ఆరోజు మొదలుపెట్టిన 80 అడుగుల రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారిలో ఒక్కరికి కూడా ఇప్పటికీ  పరిహారం ఇవ్వలేదని, 60 అడుగుల రోడ్డు విస్తరణలో ఆస్తులు కోల్పోయిన వారిలో 50 శాతం బాధితులకు ఇంకా పరిహారం రాలేదని జననేత వెల్లడించారు. ఓట్లు వేస్తే ఇళ్లు ఇస్తామన్నారు, కానీ ఇళ్ల విషయంలో కూడా పేదలను లూటీ చేశారని ఆక్షేపించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ దోపిడికి నంద్యాల ఒక ఉదాహరణ అని చెప్పారు.

పేదల ఫ్లాట్లు–మోసం 

‘పేదలకు ఫ్లాట్ల పేరుతో అవినీతి చేస్తున్నారు. నిర్మాణానికి అడుగుకు రూ.1000 కాకున్నా, అడుగుకు రూ.2 వేల చొప్పున 300 అడుగుల ఫ్లాటును రూ.6 లక్షలకు అమ్ముతున్నారు. ఆ విధంగా స్కామ్‌ చేస్తున్నారు. పేదలకు ఇచ్చే ఫ్లాట్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షలు భరిస్తే, మిగిలిన రూ.3 లక్షల అప్పును పేదలు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలట. అంటే లంచాలు తీసుకునేది చంద్రబాబు. దాన్ని పేదలు 20 ఏళ్లు కట్టాలట’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

మాఫీ చేస్తాం

ఇప్పుడు ఆ ఫ్లాట్లు ఇస్తే వద్దనకుండా తీసుకోవాలని, రేపు తమ ప్రభుత్వం ఏర్పడితే, ఆ రూ.3 లక్షల అప్పును పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.

అగ్రిగోల్డ్‌ బాధితులు

ఇక్కడ అగ్రిగోల్డ్‌ బాధితులు ఎక్కువే అయినా, 5 ఏళ్లలో వారికి చంద్రబాబు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, వారిని ఏ విధంగానూ ఆదుకోలేదని, కానీ ఆ సంస్థ ఆస్తులను చంద్రబాబు, ఆయన బినామీలు అత్తగారి సొత్తు అయినట్లు కాజేస్తున్నారని ఆరోపించారు. అందుకే భరోసా ఇస్తున్నానంటూ ‘నేను ఉన్నాను’ అని జననేత ప్రకటించారు.

కేశవరెడ్డి బాధితులు

కేశవరెడ్డి బాధితులు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారని, చంద్రబాబు మంత్రివర్గంలో కేశవరెడ్డి వియ్యంకుడు కూడా ఉన్నాడని శ్రీ వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. పిల్లల తల్లితండ్రుల నుంచి లక్షల డిపాజిట్లు సేకరించిన కేశవరెడ్డి, వారికి తిరిగి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, వారికి కూడా చంద్రబాబు పాలనలో న్యాయం జరగలేదని చెప్పారు. 

అందుకే రేపు తమ ప్రభుత్వం ఏర్పడితే ఆ బాధితులను ఆదుకుంటామని జననేత భరోసా ఇచ్చారు. కేశవరెడ్డి ఆస్తులు స్వాధీనం చేసుకుని, వాటిని అమ్మి బాధితులకు న్యాయం చేస్తామని వెల్లడించారు. 

నంద్యాల–బాబు హామీలు

ఆటోనగర్‌లో ప్లాట్లు ఉన్నవారికి పట్టాలు ఇస్తామన్నారని గుర్తు చేసిన శ్రీ వైయస్‌ జగన్, అవి ఇచ్చారా? అని ఆరా తీశారు.

ఇంకా నంద్యాల ఉప ఎన్నికల రోజున చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చారని.. ముఖ్యంగా ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులను తీసుకువచ్చి ప్రచారం చేయించారని, వాళ్ల ఫీజులు కడతామని చెప్పారని, కానీ మాట నిలుపుకోలేదని, దీంతో ఆ పిల్లలు చంద్రబాబు చుట్టూ తిరుగుతూనే ఉన్నారని తెలిపారు. 

మార్పు రావాలి

మోసం, అన్యాయం తప్ప మరేదీ చంద్రబాబు పాలనలో చూడలేదన్న జననేత, కాబట్టి మార్పు రావాలని, ఈ పాలన పోవాలని ఆకాంక్షించారు. అసలు గత 5 ఏళ్లలో చంద్రబాబు పాలనలో ఏమేం జరిగాయంటూ ఆయన పలు అంశాలు ప్రస్తావించారు.

బాబు పాలనలో ఇవీ జరిగాయి:

– రైతుల రుణమాఫీ కాలేదు. వారికి సున్నా వడ్డీ రుణాలు అందలేదు. చివరకు పంటలకు గిట్టుబాటు ధరలు కూడా రాలేదు.
– ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ కాలేదు.
– మరోవైపు పెంచిన ఛార్జీలతో పరిశ్రమలు మూతబడ్డాయి. ఫలితంగా ఉద్యోగాలు పోయాయి. దీంతో నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది.
– బాబు వస్తే జాబు పోయింది అన్నట్లుగా మారింది.
– నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ప్రతి నిరుద్యోగికి రూ.1.20 లక్షలు ఎగ్గొట్టారు.
– పొదుపు సంఘాలు బలహీనపడ్డాయి. అక్కా చెల్లెమ్మల రుణభారం రెట్టింపైంది. సున్నా వడ్డీ పథకం రదై్దంది.
– మహిళలకు భద్రత కరువైంది. 5 నిమిషాల్లో పోలీసుల రాక ఎండమావి అయింది.
– ఒక మహిళా ఎమ్మార్వో ఇసుక దోపిడి అడ్డుకుంటే, స్థానిక ఎమ్మెల్యే ఆ ఎమ్మార్వో జుట్టు పట్టుకు ఈడ్చినా కేసు పెట్టలేదు. 
– విజయవాడలో టీడీపీ నాయకులు కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ నడిపారు. అది నడిపిన ఎమ్మెల్యేను కానీ, నాయకులను కాని శిక్షించలేదు. 
– 10 ఏళ్ల క్రితం కంటే సాగు విస్తీర్ణం, దిగుబడి రెండూ తగ్గాయి.
– బీసీల పిల్లలు చదువుల కోసం ఆస్తులు అమ్ముకుంటున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని దాదాపు పాతర వేశారు. 
– ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చేది తగ్గింది. కానీ వారి భూములు లాక్కుంటున్నారు.
– 6 వేల ప్రభుత్వ పాఠశాలలు మూతబడ్డాయి.
– మద్యం షాపులు, మద్యం అమ్మకాలు పెరిగాయి.
– కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అటకెక్కింది. ప్రభుత్వ స్కూళ్లు నిర్వీర్యం చేశారు.టీచర్‌ పోస్టుల భర్తీలేదు. ఊరూరా నారాయణ స్కూళ్లు ఏర్పడ్డాయి.
– 108 సర్వీసులు గ్రామాల్లో తిరగడం లేదు.
– ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యం పాలైంది. దీంతో కొందరు రోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
– పోలీస్‌ స్టేషన్లు పెరగలేదు. కానీ గ్రామాల్లో జన్మభూమి కమిటీల మాఫియాలు పెరిగాయి.
– మంత్రి యనమలకు పంటినొప్పి వస్తే సింగపూర్‌ పంపారు. కానీ పేదలు గుండెనొప్పి వచ్చి పొరుగు రాష్ట్రంలో చికిత్స చేయించుకుంటే ఆరోగ్యశ్రీ పథకం వర్తింపచేయడం లేదు.
– ఆర్టీసీ ఛార్జీలు, కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు, కుళాయిల బిల్లులు బాదుడే బాదుడు.
– గత ఎన్నికల్లో 650 హామీలు ఇచ్చారు. కానీ అమలు చేయలేదు. అందుకే పార్టీ వెబ్‌సైట్‌ నుంచి మేనిఫెస్టో తొలగించారు.
– ఇచ్చిన 650 హామీలలో కనీసం 5 శాతం కూడా అమలు చేయలేదు.

వీటన్నింటినీ వివరించిన శ్రీ వైయస్‌ జగన్, చంద్రబాబు పాలన గురించి ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించాలని కోరారు.  

వ్యవస్థ మారాలి

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.

కుట్రలు–కుతంత్రాలు

ఇప్పుడు ఎన్నికలు రావడంతో చంద్రబాబు చేస్తున్న కుట్రలు, కుతంత్రాలు చూస్తున్నామన్న జననేత, ఇవాళ తమ యుద్ధం ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాకుండా, ఆయనకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో పాటు, ఇంకా ఆయనకు అమ్ముడుపోయిన మీడియాతో కూడా అని చెప్పారు. 

అప్రమత్తంగా ఉండండి

వారం రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎందుకంటే అబద్ధం చెబుతారని, ఆ తర్వాత మీడియా ఉంది కాబట్టి అదే నిజమని నమ్మిస్తారని చెప్పారు.  

గ్రామాలకు మూటల డబ్బులు

ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చే సరికి కుట్రలు మరింత తీవ్రమవుతాయని,  ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా అందరినీ కొనే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని  గుర్తు చేయండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకుండా, వారం రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు చెప్పండి’. 

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కలవండి. చెప్పండి. అక్కా చంద్రబాబుకు 5 ఏళ్ల సమయం ఇచ్చాం. మన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. మరి చేశాడా? అని అడగండి. అదే విధంగా గతంలో మాదిరిగా సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని, ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశాడని  గుర్తు చేయండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’. 

‘అక్కా వారం రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నేరుగా నాలుగు దఫాల్లో మన చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని చెప్పండి’.

‘పేదరికంలో ఉండి అవస్థలు పడుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు చెప్పండి. 45ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్న ఆ ప్రతి అక్కను కలవండి. చెప్పండి.. అక్కా, చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపిక పట్టక్కా.. అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత వైయస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగు దఫాల్లో రూ.75 వేలు నేరుగా ప్రతి అక్క చేతిలో పెడతాడని చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని మరీ మరీ చెప్పండి’.

‘గ్రామాల్లో ప్రతి రైతన్న దగ్గరకు వెళ్లండి. 5 ఏళ్లు చంద్రబాబుకు సమయం ఇచ్చాం. కానీ రుణమాఫీ చేయలేదు. రుణ మాఫీ కోసం చంద్రబాబు ఇచ్చిన మొత్తం కనీసం వడ్డీలకు కూడా సరిపోలేదని చెప్పండి. అలాగే గతంలో మాదిరిగా సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని, ఆ పథకాన్ని పూర్తిగా రద్దు చేశారని గుర్తు చేయండి. అలాగే 5 ఏళ్లలో ఏ ఒక్క సంవత్సరమైనా, ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? అని అడగండి’.

‘అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపిక పడదాం. ఆ తర్వాత అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత ప్రతి రైతుకు పెట్టుబడిగా ఏటా మే మాసంలో రూ.12,500 చేతిలో పెడతాడని,  అలా నాలుగేళ్లలో మొత్తం రూ.50 వేలు మీ చేతిలో పెడతాడని చెప్పండి. అదే విధంగా రాజన్న రాజ్యం వస్తుందని, మళ్లీ సున్నా వడ్డీ రుణాలు వస్తాయని, అది జగనన్నతోనే సాధ్యమని చెప్పండి. ఇంకా ప్రతి పంటకు కచ్చితంగా గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు. అన్న గిట్టుబాటు ధరలకు గ్యారెంటీ కూడా ఇస్తాడని చెప్పండి’.

‘గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్‌ గురించి ఆరా తీయండి. ఇవాళ అంటే ఎన్నికలు వచ్చాయి. కానీ మీకు రెండు నెలల క్రితం వరకు పెన్షన్‌ ఎంత  వచ్చేదని అడగండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది పెన్షన్‌ రావడం లేదని, లేదా వెయ్యి రూపాయలు వస్తున్నాయని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ప్రతి అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఈ చంద్రబాబు రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చేవాడా?’ అని ఆ అవ్వను అడగండి.

‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని, వారం రోజులు ఓపికపడితే, మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్‌ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాడని చెప్పండి’.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు.

నవరత్నాలతో ప్రతి నిరుపేద జీవితం బాగుపడుతుందని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నానని.. అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటికి చేరుస్తామని హామీ ఇచ్చారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

నంద్యాల నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్రారెడ్డితో పాటు, పార్టీ నంద్యాల ఎంపీ అభ్యర్థి పి.బ్రహ్మానందరెడ్డిని సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

మాజీ ఎమ్మెల్యే చేరిక

కాగా, నంద్యాల బహిరంగ సభలోనే పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి జననేత సమక్షంలో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

 

 

Tags :