ASBL NSL Infratech

ఏలూరు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌

ఏలూరు ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌

‘అదే కధ. అదే మోసం. కధ స్టార్ట్‌. ఇదే చంద్రబాబు ఎన్నిక ప్రణాళిక. 2014లో ఇచ్చిన హామీల్లో ఏవీ అమలు చేయలేదు. మళ్లీ 2019 ఎన్నికల్లోనూ పలు హామీలు ఇస్తున్నారు. ఆ మేరకు మేనిఫెస్టో విడుదల చేశారు’ అని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ వ్యవస్థ మారాలని, ఎవరైనా నాయకుడు మైకు పుచ్చుకుని మాట ఇస్తే, ఎన్నికల్లో గెల్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోతే ఆ నాయకుడు పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో మార్పు వస్తుందని, రాజకీయాల్లో విశ్వసనీయత వస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాబట్టి అందరూ ఆలోచించాలని, ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూశారు కాబట్టి, పాలనలో మార్పు తీసుకురావాలని జననేత విజ్ఞప్తి చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నియోజకవర్గ కేంద్రంలో సోమవారం మధ్యాహ్నం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. మండే ఎండను సైతం లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో అభిమానులు తరలి రావడంతో నగరం జనసంద్రంగా మారింది.

ఏలూరు–మహానేత

తన సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్ర ఏలూరు నుంచి కూడా సాగిందని, ఆరోజు ఇక్కడి వారు చెప్పిన ప్రతి అంశం గుర్తుందని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు. ఏలూరు వన్‌ టౌన్‌లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం మహానేత వైయస్సార్‌ నాడు తన హయాంలో రూ.17 కోట్లు కేటాయించి, పనులు మొదలు పెట్టారని, కానీ ఆయన చనిపోయిన తర్వాత అవి ముందుకు సాగలేదని, ఈ 5 ఏళ్లలో కూడా చంద్రబాబు పట్టించుకోలేదని చెప్పారు. ఇంకా ఇక్కడే తంబలేరు వల్ల లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతున్నాయని, దాని నివారణకు రూ.30 కోట్లు కేటాయించిన మహానేత వైయస్సార్‌ రీటెయిన్‌ వాల్‌ నిర్మాణం చేపట్టి, దాదాపు సగం పూర్తి చేశారని గుర్తు చేశారు. కానీ ఈ 5 ఏళ్లలో చంద్రబాబు ఆ పనులు కూడా పట్టించుకోలేదని ఆక్షేపించారు. 

ఇదే నియోజకవర్గంలో మహానేత వైయస్సార్‌ 12 వేల ఇళ్లు కట్టించారన్న జననేత, చంద్రబాబుకు అసలు ఆ ఆలోచనే లేదని అన్నారు. పైగా ఇప్పుడు పేదలకు ఫ్లాట్లు పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. 

పేదల ఫ్లాట్లు–అవినీతి

‘పేదలకు కట్టే ఫ్లాట్ల భూమి ఉచితం. ఇసుక ఫ్రీ. సిమెంటు సబ్సిడీపై వస్తుంది. ఇంకా వాటిలో గ్రానైట్‌ ఉండదు. లిఫ్ట్‌ కూడా ఉండదు. కాబట్టి నిర్మాణానికి అడుగుకు రూ.1000 కూడా కాదు. కానీ ప్రభుత్వం మాత్రం అడుగుకు రూ.2 వేల చొప్పున, 300 అడుగుల ఫ్లాట్‌ను మొత్తం రూ.6 లక్షలకు అమ్ముతోంది. అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.1.50 లక్షల చొప్పున భరిస్తే, మిగిలిన రూ.3 లక్షల అప్పును ఆ పేదలు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు కట్టాలట. అంటే లంచం తీసుకునేది చంద్రబాబు అయితే, దాన్ని ఆ పేదలు 20 ఏళ్లు కట్టాలన్న మాట. ఇలా మీరంతా ఇప్పుడు జరుగుతున్న అవినీతిని చూస్తున్నారు’ అని శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

అప్పు మాఫీ చేస్తాం

ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి, ఆ ఫ్లాట్లు ఇస్తే వద్దనకుండా తీసుకోవాలని జననేత కోరారు. అందరి ఆశీస్సులతో అధికారం చేపడితే ఫ్లాట్ల పేరుతో పేదలపై వేసిన ఆ రూ.3 లక్షల అప్పును పూర్తిగా మాఫీ చేస్తామని ప్రకటించారు.

ఆలోచించండి

చంద్రబాబు నాయుడు ఈ 5 ఏళ్ల పాలన ఒక్కసారి చూడాలని, మేలు జరిగిందా? లేక కీడు జరిగిందా? అని ఆలోచించాలని.. అదే విధంగా చంద్రబాబు పాలనలో ఎవరికి మేలు జరిగింది? అన్నది కూడా ఆలోచించాలని కోరారు. ఎన్నికలప్పుడు మాత్రం చంద్రబాబు పేదలు, బీసీలపై ప్రేమ అంటారని,  కానీ ఓట్లు వేయించుకున్న తర్వాత ఏమీ ఉండదని చెప్పారు. ఇవాళ పేదలు, తమ పిల్లలను అప్పులపాలు కాకుండా ఉన్నత చదువులు చదివించే పరిస్థితి ఉందా? అని ప్రశ్నించిన శ్రీ వైయస్‌ జగన్, చంద్రబాబు పాలనలో మనం మోసం తప్ప మరేదీ చూడలేదని అన్నారు. 

గత ఎన్నికల్లో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోలో కొన్ని అంశాలను ఈ సందర్భంగా ప్రస్తావించిన శ్రీ వైయస్‌ జగన్, అవి ఏమేర అమలయ్యాయన్నది అడిగారు. 

2014–చంద్రబాబు వాగ్ధానాలు:

– వ్యవసాయ రుణాలు మాఫీ. మరి చేశారా?
– రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి. ఏర్పాటు చేశారా?
– డ్వాక్రా రుణాల మాఫీ. చేశారా?
– బెల్టు షాపుల రద్దు. మద్యం విక్రయాల నియంత్రణ. అమలైందా?
– మహిళల భద్రతకు ప్రత్యే పోలీసు వ్యవస్థ. ఫోన్‌ చేసిన 5 నిముషాల్లోనే పోలీసులు చేరుకునేలా భద్రతా వ్యవస్థ ఏర్పాటు.

కానీ ఇదే జిల్లాలో ఇసుక రవాణాను అడ్డుకున్న మహిళా ఎమ్మార్వోను ఎమ్మెల్యే జుట్టు పట్టుకుని ఈడ్చాడు. ఇదీ వాస్తవ పరిస్థితి.

– యువతకు ఉద్యోగం లేదా ఉపాధి. ఇంటికో ఉద్యోగం. లేకపోతే నెలకు రూ.2 వేల భృతి. మరి ఇచ్చాడా?
– గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌. మరి గుడిసెలన్నవి లేనే లేవా?
– పేదలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. అమలవుతోందా?
– ఎన్టీఆర్‌ సుజల స్రవంతి. గ్రామాల్లో రూ.2కే 20 లీటర్ల మినరల్‌ వాటర్‌. మరి సరఫరా చేస్తున్నారా?
– అవినీతికి తావు లేని సుపరిపాలన. మరి అలాంటి పాలన చూశామా?

అని ప్రశ్నిస్తూ ఇవన్నీ వివరించిన శ్రీ వైయస్‌ జగన్, ఇప్పుడు మళ్లీ అదే కధ స్టార్ట్‌ అని, చంద్రబాబు మళ్లీ ఎన్నికల ప్రణాళిక పేరుతో మోసం చేస్తున్నారని అన్నారు. కాబట్టి ఈ వ్యవస్థ మారాలని అన్నారు.

వ్యవస్థ మారాలి

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ప్రజలను ఓటు అడిగి, ఓటు వేయించుకుని గెల్చిన తర్వాత, దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు.

కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించాలని, ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలన చూశాక, పరిపాలనలో మార్పు తీసుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

కుట్రలు–కుతంత్రాలు

గత 20 రోజులుగా రాజకీయాలు ఎంతగా దిగజారాయో అందరూ చూస్తున్నారని.. ఇవాళ తమ యుద్ధం కేవలం చంద్రబాబుతో మాత్రమే కాకుండా, ఆయనకు కొమ్ము కాస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ9తో పాటు, ఆయనకు అమ్ముడుపోయిన మొత్తం మీడియాతో, ఛానళ్లతో యుద్ధం చేస్తున్నామని చెప్పారు. ధర్మం–అధర్మం మధ్య ఈ యుద్ధం జరుగుతోంది అని ఆయన స్పష్టం చేశారు. 

ఆ విధంగా వారంతా ఏకమై కుట్ర చేస్తున్నారని జననేత అన్నారు. అది ఎలాగన్నది కూడా ఆయన వివరించారు.

దృష్టి మళ్లిస్తున్నారు 

‘చంద్రబాబు పాలన మీద చర్చ జరిగితే, ప్రజలు ఆలోచించడం మొదలు పెడితే డిపాజిట్లు కూడా రావని చంద్రబాబునాయుడు గారికి తెలుసు. అందుకే చంద్రబాబునాయుడు గారు, తనకు సంబంధించిన ఎల్లో మీడియా.. ప్రతిరోజూ ఒక కట్టుకథ, పుకారు లేపుతారు. దానిపైనే చర్చ పెడతారు. ఆ విధంగా పూర్తిగా చంద్రబాబు వైఫల్యాలు, ఈ 5 ఏళ్లలో జరిగిన మోసాల నుంచి ప్రజలను మభ్య పెడుతున్నారు. అందుకని ఒక్కసారి ఆలోచించాలని కోరుతున్నాను’ అని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు. 

గ్రామాలకు మూటల డబ్బులు

ఎన్నికలు ఇంకా దగ్గరకు వచ్చే సరికి కుట్రలు మరింత తీవ్రమవుతాయని,  ఎన్నికలు రావడంతో ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు మూటలకొద్దీ డబ్బు పంపిస్తారని, ప్రతి ఒక్కరి చేతిలో రూ.3 వేలు పెడతారని, ఆ విధంగా మళ్లీ మోసం చేసే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు.

ఈ కుట్రను జయించాలని, అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్లాలని, ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి రైతును కలిసి, చంద్రబాబు చేస్తున్న మోసాలు వివరించాలని కోరారు.

వారికి ఇవన్నీ వివరించండి

‘అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. నాలుగు రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. అంతే కాకుండా మన పిల్లలను ఇంజనీర్లు, డాక్టర్లు, కలెక్టర్‌ వంటి చదువులు చదివించే పరిస్థితి లేదని, పిల్లల చదువు కోసం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని గుర్తు చేయండి. ఇవాళ ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ఫీజులు లక్ష రూపాయలు దాటినా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నీరు గారుస్తూ కేవలం రూ.35 వేల వరకే ఇస్తున్నారని కూడా చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోకుండా, నాలుగు రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని, ఆ తర్వాత మన పిల్లలు ఇంజనీరింగ్, డాక్టర్, కలెక్టర్‌ వంటి ఏ చదువు చదవాలన్నా అన్న చదివిస్తాడని, ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి’. 

‘పొదుపు సంఘాలలో ఉన్న ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను కలవండి. చంద్రబాబు చేసే మోసాలకు బలి కావద్దని చెప్పండి. అక్కా చంద్రబాబుకు 5 ఏళ్ల సమయం ఇచ్చాం. మన రుణాలు మాఫీ చేస్తానన్నాడు. కనీసం ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా? అని అడగండి. అదే విధంగా సున్నా వడ్డీ రుణాలు కూడా రావడం లేదని గుర్తు చేయండి. ఆ పథకాన్ని రద్దు చేశాడని కూడా చెప్పండి. అందుకే చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దని ప్రతి అక్కకు చెప్పండి’.

‘అక్కా నాలుగు రోజులు ఓపిక పట్టి, అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తర్వాత ఎన్నికల నాటికి పొదుపు సంఘాల మహిళలకు ఉన్న మొత్తం రుణాన్ని నాలుగు దఫాల్లో నేరుగా అక్కా చెల్లెమ్మల చేతుల్లోను పెడతాడని ప్రతి అక్కకు చెప్పండి. అంతే కాకుండా మళ్లీ రాజన్న రాజ్యం వస్తుందని, సున్నా వడ్డీ రుణాలు అందుతాయని, అది ఆయన కొడుకు జగనన్నతోనే సా««ధ్యమని చెప్పండి’. 

‘పేదరికంలో ఉన్న ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అక్కల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్లలోపు ఉన్న వారిని కలవండి. నాలుగు రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. అన్న ముఖ్యమంత్రి అయ్యాక వైయస్సార్‌ చేయూత పథకం తీసుకొస్తారని, ప్రతి అక్కకు నాలుగు దఫాల్లో రూ.75 వేలు చేతిలో పెడతాడని చెప్పండి’.

‘గ్రామంలో ప్రతి అవ్వ, ప్రతి తాతను కలవండి. చంద్రబాబు మోసాలు వివరించండి. అదే విధంగా వారికి వస్తున్న పెన్షన్‌ గురించి ఆరా తీయండి. ఇవాళ అంటే ఎన్నికలు వచ్చాయి. కానీ మీకు రెండు నెలల క్రితం వరకు ఎంత పెన్షన్‌ వచ్చేదని అడగండి. అప్పుడు ఆ అవ్వ అంటుంది అసలు పెన్షన్‌ వచ్చేది కాదని, లేదా వెయ్యి రూపాయలు వచ్చేవని చెబుతుంది. అవ్వ ఆ సమాధానం చెప్పాక ఆ అవ్వను అడగండి. అవ్వా ఇప్పుడు ఎన్నికలు రాకపోయి ఉంటే, జగనన్నే రూ.2 వేలు ఇస్తానని చెప్పకపోయి ఉంటే, ఈ చంద్రబాబు రూ.2 వేలు ఇచ్చేవాడా?’ అని అడగండి.

‘అందుకే ప్రతి అవ్వకు చెప్పండి. ప్రతి తాతకు చెప్పండి. చంద్రబాబు చేసే మోసాలకు మోసపోవద్దని, నాలుగు రోజులు ఓపిక పడితే, మీ మనవడు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పండి. అలా మీ మనవడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అవ్వా తాతలకు ఇచ్చే పెన్షన్‌ రూ.3 వేలకు పెంచుకుంటూ పోతాడని ప్రతి అవ్వకూ చెప్పండి’.

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు.

నవరత్నాలతో ప్రతి నిరుపేదల జీవితాలె బాగుపడతాయని, ప్రతి రైతు, మహిళ ముఖంలో చిరునవ్వులు చూడవచ్చని నమ్ముతున్నానని, అందుకే ఆ పథకాలను కచ్చితంగా ప్రతి ఇంటి గడపకు తీసుకొస్తానని హామీ ఇచ్చారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

ఏలూరు నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆళ్ల కాళికృష్ణ శ్రీనివాస్‌ (నాని)తో పాటు, పార్టీ ఏలూరు ఎంపీ అభ్యర్థి కోటగిరి శ్రీధర్‌ను సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :