ASBL NSL Infratech

భీమవరం ఎన్నికల ప్రచార సభలో వైయస్‌ జగన్‌

భీమవరం ఎన్నికల ప్రచార సభలో  వైయస్‌ జగన్‌

వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారం చేపడితే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగాలపై ఏటా ఏటా జనవరి 1న క్యాలెండర్‌ విడుదల చేస్తామని, ప్రతి గ్రామంలో 10 మందితో సచివాలయంతో పాటు, ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమించి ప్రభుత్వ సేవలన్నీ డోర్‌ డెలివరీ చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ప్రకటించారు. ఇంకా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత మెరుగుపడేలా పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఒక చట్టం చేస్తామని, ఆదాయం వచ్చే ప్రభుత్వ కాంట్రాక్ట్‌లు, ఆర్టీసీ నడిపే ప్రైవేటు బస్సులు, ప్రభుత్వ శాఖల్లో అద్దె వాహనాల్లో యువతకే అవకాశం కల్పిస్తామని, వారు వాహనాలు కొనుక్కుంటే సబ్సిడీ ఇస్తామని, వాటన్నింటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం కేటాయిస్తామని ఆయన వెల్లడించారు. 

దీంతో పాటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తద్వారా ఉద్యోగ, ఉపాధి కల్పనలో విప్లవం సాధించి ప్రతి జిల్లాను ఒక హైదరాబాద్‌లా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జననేత వివరించారు. 

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ కేంద్రంలో సోమవారం సాయంత్రం శ్రీ  వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. సభకు అసాధారణ సంఖ్యలో ప్రజలు తరలి రావడంతో పట్టణం జనసంద్రమైంది.

పేదల ఫ్లాట్లలో మోసం

తన సుదీర్ఘ 3648 కి.మీ పాదయాత్ర భీమవరం నుంచి కూడా సాగిందని, నాడు స్థానికులు చెప్పిన కష్టాలు, బాధలు అన్నీ గుర్తున్నాయని శ్రీ వైయస్‌ జగన్‌ తెలిపారు.

పట్టణంలో పేదల ఇళ్ల కోసం నాడు మహానేత వైయస్సార్‌ 2008లో  22 ఎకరాలు సేకరించి పట్టాలు ఇవ్వగా, ఆ భూమి లాక్కున్న చంద్రబాబు, అక్కడ పేదలకు ఫ్లాట్లు కట్టిస్తామంటూ మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణానికి అడుగుకు రూ.1000 కూడా కాని ఆ 300 అడుగుల ఒక్కో ఫ్లాట్‌ను రూ.6 లక్షలకు పేదలకు అమ్ముతున్నారని తెలిపారు. అందులో కేంద్రం, రాష్ట్రం చెరి రూ.1.50 లక్షల చొప్పున భరిస్తే, మిగిలిన రూ.3 లక్షల అప్పును ఆ పేదలు నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు కట్టాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన చెందారు. 

మాఫీ చేస్తాం

అందుకే రేపు తమ ప్రభుత్వం ఏర్పడితే.. ‘జగన్‌ అనే నేను మీ అందరికీ చెబుతున్నాను. ఎన్నికలు వచ్చాయి కాబట్టి, చంద్రబాబు ఆ ఫ్లాట్లు ఇస్తే తీసుకోండి. రేపు మన ప్రభుత్వం ఏర్పడితే ఆ రూ.3 లక్షల అప్పు మాఫీ చేస్తాము’ అని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రకటించారు.

భీమవరం–మహానేత

ఇదే భీమవరం నియోజకవర్గంలో తాగు నీటి కోసం నాడు 126 ఎకరాలు సేకరించిన మహానేత వైయస్సార్, మంచినీటి చెరువు నిర్మించి నీరు సరఫరా చేశారని గుర్తు చేశారు. వీరవాసరం మండలంలో ఇప్పటికీ తాగు నీటి సమస్య ఉందని, కానీ ఈ 5 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని ఆక్షేపించారు. 

భీమవరం–చంద్రబాబు

ఇదే నియోజకవర్గంలో చెత్త డంపింగ్‌ కేంద్రం లేకపోవడంతో, పట్టణం మధ్యలోనే చెత్త వేస్తున్నారని, ఫలితంగా ప్రజలు రోగాల బారిన పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే, రాజకీయ లబ్ధి కోసం ఇక్కడే యనమదుర్రు డ్రెయిన్‌లో మురుగునీటి పారిశుద్ద్య కేంద్రం (ఎస్‌పీటీ) ఏర్పాటు చేస్తానన్న చంద్రబాబు, ఆ మాట కూడా నిలుపుకోలేదని చెప్పారు. 

భీమవరంలో ట్రాఫిక్‌ సమస్య ఉండడంతో, మహానేత వైయస్సార్‌ నాడు స్థానిక మార్కెట్‌ యార్డు వరకు బైపాస్‌ రోడ్‌ వేయించగా, ఆ తర్వాత అది ముందుకు సాగలేదని తెలిపారు. 

గిట్టుబాటు ధర

చంద్రబాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర రాలేదని గుర్తు చేసిన జననేత, ధాన్యం కనీస మద్దతు ధర రూ.1750 కాగా, రైతులకు రూ.1300 కూడా రావడం లేదని.. ఆక్వా రైతులదీ అదే పరిస్థితి అని చెప్పారు. 100 కౌంట్‌ రొయ్యలకు రూ.270 వస్తే గిట్టుబాటు అవుతుందని, కానీ ఆ రైతులకు రూ.200 కూడా రావడం లేదని తెలిపారు. ప్రతి చోటా దళారులదే రాజ్యం అని, అందుకే  పంట చేతికొచ్చే సరికి రేట్లు తగ్గుతున్నాయని గుర్తు చేశారు. 

తుందుర్రు–లోకల్‌ హీరో

తుందుర్రులో ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్‌ వల్ల కాలుష్యం వస్తోందని, దాన్ని సముద్రతీర ప్రాంతానికి తరలించాలని రైతులు, స్థానికులు ఆందోళన చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇంత జరుగుతున్నా ‘మీకు నేనూ తోడున్నాను అంటూ ఒక్కసారైనా ఈ యాక్టర్, చంద్రబాబు పార్టనర్‌ వచ్చారా’? అని జననేత ప్రశ్నించారు. 

కానీ ఇక్కడే ప్రతి అడుగులోనూ, ప్రతి సమస్యలోనూ మన లోకల్‌ హీరో ఒకరున్నారని, ఆయనే మన శీనన్న (గ్రంథి శ్రీనివాస్‌) అని చెప్పారు. కాబట్టి ఒక లోకల్‌ హీరోకు, సినిమాల్లో యాక్ట్‌ చేసే హీరోకు మధ్య ఉన్న పోలిక గుర్తించాలని కోరారు. 

5 ఏళ్లలో ఏం చూశాం? 

ఈ 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో మోసం తప్ప మరేదీ చూడలేదని, ఎన్నికల ముందు ఎన్నెన్నో చెప్పిన చంద్రబాబు, ఏ పనీ చేయలేదని గుర్తు చేశారు. 

ధనిక సీఎం–పేద రైతు

దేశంలోనే అత్యంత ధనిక సీఎం ఎవరు అంటే చంద్రబాబు అన్న పేరు వినిపిస్తోందని, రెండు ఎకరాల నుంచి మొదలుపెట్టిన చంద్రబాబు, ఇవాళ దేశంలోనే అత్యంత ధనవంతుడైన సీఎంగా ఉన్నారంటే, రాష్ట్రాన్ని ఏ స్థాయిలో దోచేశారన్నది అర్ధమవుతోందని శ్రీ వైయస్‌ జగన్‌ అన్నారు.

చంద్రబాబు పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు నాబార్డు నివేదిక ప్రకారం దేశంలోనే అత్యంత పేద రైతులు మన రైతులని తేలిందని వెల్లడించారు.

ఇక పొదపు సంఘాల మహిళల రుణాలు కూడా మాఫీ కాక రూ.14,200 కోట్ల నుంచి రూ.26 వేల కోట్లకు పెరిగాయని, ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్సెల్బీసీ) సమావేశంలోనే అధికారులు చెప్పారని వివరించారు. 

ఎవరు బాగుంటే?

ఈ 5 ఏళ్లలో నిరుద్యోగుల సంఖ్య కూడా దాదాపు రెట్టింపైందని, ఎక్కడ చూసినా వారే కనిపిస్తున్నారని చెప్పారు. కాబట్టి ఈ తరుణంలో.. ‘బాబు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా? లేక ప్రజలు బాగుంటే రాష్ట్రం బాగున్నట్లా?’ అని ఆలోచించాలని కోరారు. జాబు రావాలంటే బాబు రావాలని అప్పట్లో చంద్రబాబు ప్రచారం చేశారని, కానీ ఇవాళ పరిస్థితి మారిందని, జాబు రావాలంటే బాబు పోవాలన్నట్లుగా అయిందని చెప్పారు.  ఒక్కసారి మీ చుట్టుపక్కల ఉన్న అన్నాదమ్ముళ్లు, అక్కా చెల్లెమ్మలను చూడాలని, చదువులు అయిపోయాక వారు ఇక్కడే ఉంటున్నారా? లేక ఉపాధి వెతుక్కుంటూ వలస పోతున్నారా? చూడాలని విజ్ఞప్తి చేశారు. 

నిరుద్యోగ భృతి

ప్రతి ఇంటికో ఉద్యోగం లేదా ఉపాధి కల్పించకపోతే నెలకు రూ.2 వేల భృతి ఇస్తానన్నాడని, కానీ అలా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ ఇంటింటికీ రూ.1.20 లక్షలు బాకీ పడ్డారని చెప్పారు. 

ఒక్కరికే ఉద్యోగం!

‘రాష్ట్రంలో ఉద్యోగం కేవలం చంద్రబాబు కొడుక్కు మాత్రమే వచ్చింది. తొలుత ఎమ్మెల్సీ పదవి. ఆ తర్వాత మంత్రి పదవి వచ్చింది’ అని జననేత అన్నారు.

మరోవైపు చంద్రబాబు పాలనలో చాలా మంది ఉద్యోగాలు పోయాయంటూ, వాటన్నింటినీ ప్రస్తావించారు.

గోవిందా గోవిందా:

– 30 వేల మంది ఆదర్శౖ రెతుల ఉద్యోగాలు.
– గృహ నిర్మాణ శాఖలో 3500 మంది వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, కంప్యూటర్‌ ఆపరేటర్ల ఉద్యోగాలు. 
– 1000 గోపాలమిత్రల ఉద్యోగాలు.
– ఆయుష్‌ విభాగంలో 800 మంది ఉద్యోగాలు.
– సాక్షరభారత్‌లో 30 వేల మంది ఉద్యోగాలు.
– మధ్యాహన భోజన పథకంలో 14 ఏళ్ల నుంచి పని చేస్తున్న 85 వేల మంది కార్మికుల ఉద్యోగాలు.

అని వివరించిన శ్రీ వైయస్‌ జగన్, మరోవైపు ఉన్న ఉద్యోగుల్లో చాలా మందికి జీతాలివ్వడం లేదని, ఆ గణాంకాలు ప్రస్తావించారు.

బాబు వచ్చాడు:

– ప్రభుత్వంలో 1.25 లక్షల ఉద్యోగులకు ఫిబ్రవరి జీతాలు ఇంకా ఇవ్వలేదు.
– వేల మంది కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు బంద్‌.
– ఉద్యోగులు తమ భవిష్య నిధి (జీపీఎఫ్‌) నిధులు తీసుకోకుండా ఆంక్షలు.
– హోం గార్డులు, అగ్నిమాపక సిబ్బంది, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంస్థలు,  గురుకులాలు, సర్వశిక్షా అభియాన్, మోడల్‌ స్కూళ్లలో పని చేస్తున్న వారికి 4 నెలలుగా జీతాలు లేవు.
– రాష్ట్ర వ్యాప్తంగా ఎయిడెడ్‌ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు బంద్‌.
– ఫీజు రీయింబర్స్‌మెంట కింద రూ.1800 కోట్లు బకాయిలు.
– మధ్యాహ్న భోజన పథకంలో సరుకుల కోసం నిధులివ్వక, పిల్లల కడుపు మాడుస్తున్నారు.
– కాంట్రిబ్యూటరీ పింఛను పథకం (సీపీఎస్‌) నిధులు సంబంధిత విభాగంలో జమ చేయకుండా ఇతర అవసరాలకు వాడేశారు. 
– పోలీసులకు టీఏలు, డీఏలు బంద్‌.

ఇవన్నీ స్పష్టంగా వివరించిన శ్రీ వైయస్‌ జగన్, ఇలాంటి వ్యక్తికి తిరిగి అధికారం కట్టబెడితే, రేపు మనకు కనీసం రేషన్‌ అయినా ఇస్తాడా? ఆలోచించాలని కోరారు. 

చివరి 3 నెలలు..

‘అయిదేళ్ల కోసం ప్రజలు అధికారం ఇస్తారు. ఆ 60 నెలల్లో 57 నెలలు ప్రజలకు అన్యాయం చేసి, చివరి మూడు నెలలకు రాష్ట్రంలో 1.70 కోట్ల ఇళ్లుంటే, కేవలం 3 లక్షల మందికి, నెలకు రూ.2 వేల బదులు రూ.1000 మాత్రమే, అది కూడా కేవలం 3 నెలలకు మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తున్నారు’ అని వివరించిన శ్రీ వైయస్‌ జగన్, ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో తన 3648 కి.మీ పాదయాత్ర సాగిందని చెప్పారు.

ప్రతిచోటా నిరుద్యోగుల బాధలు చూశానని, అందుకే హామీ ఇస్తున్నానని.. అదే ‘నేను ఉన్నాను’ అని భరోసా ఇచ్చారు.

వైయస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగులు, యువత కోసం ఏమేం చేస్తామన్నది శ్రీ వైయస్‌ జగన్‌ వివరించారు.

ప్రభుత్వం ఏర్పడితే–నవరత్నాలు:

– ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న 2.30 ఉద్యోగాలు వెంటనే భర్తీ.
– ఏటా జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగాలపై క్యాలెండర్‌ విడుదల.
– ప్రతి గ్రామంలోనూ చదువుకున్న 10 మందితో సచివాలయం ఏర్పాటు. 

కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ప్రజలకు కావాల్సిన అన్నింటినీ నిష్పాక్షికంగా ఆ సచివాలయాలు అందిస్తాయి. అర్జీ పెట్టుకున్న 72 గంటల్లోనే వాటిని పరిష్కరిస్తాయి. నవరత్నాలులో ఏది కావాలన్నా గ్రామ సచివాలయాలే చేసి పెడతాయి. 

– ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ నియామకం.

చదువుకున్న, సేవా దృక్పథం ఉన్నవారిని వాలంటీర్లుగా నియమిస్తాం. వారికి నెలకు రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తాము. గ్రామ సచివాలయానికి అనుసంధానంగా వాలంటీర్లు పని చేస్తారు. ఆ 50 ఇళ్లకు సంబంధించి ఏం కావాలన్నా, ఆ వాలంటీర్లు చేసి పెడతారు. లంచాలు, సిఫార్సులు ఉండవు. కులం, మతం ఏదీ చూడరు.

– ప్రభుత్వంలో కాంట్రాక్ట్‌లు.. ఆర్టీసీ నడిపే నిర్వహించే ప్రైవేటు బస్సులు, ప్రభుత్వ శాఖల్లో అద్దె వాహనాలు కార్లలో యువతకు ప్రాధాన్యం. ప్రభుత్వం ద్వారా ఆదాయం వచ్చే ప్రతి కాంట్రాక్ట్‌ నిరుద్యోగ యువతకే.

– వారు వాహనాలు కొనుక్కుంటే సబ్సిడీ.
– వాటన్నింటిలో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయింపు.
– పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా అసెంబ్లీ తొలి సమావేశాల్లోనే ఒక చట్టం.
– అదే విధంగా పరిశ్రమలకు కూడా చేయూతనిచ్చే విధంగా జిల్లా కేంద్రం యూనిట్‌గా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు.

ఆ జిల్లాలో ఉన్న పరిశ్రమలు, వాటి అవసరాలకు అనుగుణంగా యువతకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ.

– ప్రత్యేక హోదా సాధన.

హోదా వస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అయితే అందుకు మీ అందరి సహకారం కావాలి.

కాబట్టి 25 మంది ఎంపీలను గెలిపిస్తే, వారికి తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు తోడైతే.. రాష్ట్రానికి హోదా వచ్చి తీరుతుంది. ఎందుకంటే ఇవాళ కేంద్రంలో ఏ ఒక్క పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. అందుకే మన మద్దతు అవసరం ఉంటుంది. ఆ తరుణంలో హోదాకు సంతకం పెడితేనే మద్దతు ఇస్తాం. 

ఆ విధంగా ప్రత్యేక హోదా సాధిద్దాము. ఒకసారి హోదా వస్తే పెట్టుబడులు వస్తాయి. పరిశ్రమలు, హోటళ్లు, ఆస్పత్రులు వస్తే ఉద్యోగాల విప్లవం వస్తుంది. దాంతో ప్రతి జిల్లా ఒక హైదరాబాద్‌ అవుతుంది. 

నవరత్నాలు

నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబంలో మేలు చేస్తాయని చెప్పాలని, వాటిని ప్రతి ఇంటికి తీసుకుపోవాలని సూచించారు. ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి అవ్వ, ప్రతి తాతకు వాటి గురించి వివరించాలని కోరారు. 

ఇవీ వివరించండి

అలా ఆ పథకాలను అందరి దగ్గరకు తీసుకుపోయి. అక్కా చంద్రబాబు ఇచ్చే రూ.3 వేలకు మోసపోవద్దు. 20 రోజులు ఓపిక పట్టి అన్నను ముఖ్యమంత్రిని చేసుకుందాం. ఆ తరవాత మన పిల్లలను కేవలం బడికి పంపిస్తే చాలు అన్న ప్రతి ఏటా రూ.15 వేలు చేతిలో పెడతాడని చెప్పండి. 

అలా నవరత్నాలు ద్వారా జరిగే మేలును ప్రతి అక్క, ప్రతి చెల్లి, ప్రతి అవ్వ, తాతకు వివరించండి.

వ్యవస్థ మారాలి

ఈ చెడిపోయిన రాజకీయ వ్యవస్థ మారాలని, ఒక నాయకుడు ఏదైనా చేస్తానని చెప్పి, ఆ అంశాన్ని ప్రణాళికలో పెట్టి, ఆ తర్వాత దాన్ని అమలు చేయకపోతే, ఆ పదవిని వీడి ఇంటికి పోవాలని, అప్పుడే ఈ రాజకీయాలలో నిజాయితీ, విశ్వసనీయత వస్తాయని స్పష్టం చేశారు. అందుకు అందరి సహకారం కావాలని కోరారు.

పార్టీ అభ్యర్థుల పరిచయం

భీమవరం నియోజకవర్గం నుంచి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గ్రంథి శ్రీనివాస్‌తో పాటు, పార్టీ నరసాపురం ఎంపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజును సభకు పరిచయం చేసిన శ్రీ వైయస్‌ జగన్, ఇద్దరినీ మంచి మెజారిటీతో గెలిపించాలని కోరారు. వైయస్సార్‌సీపీ గుర్తు ఫ్యాన్‌ను కూడా సభకు చూపిన ఆయన, గుర్తుంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 

Tags :