ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నాగరిక పైత్యంలో తెలుగును తొక్కేస్తున్నారు...యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

నాగరిక పైత్యంలో తెలుగును తొక్కేస్తున్నారు...యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

తెలుగు భాష అపారమైన నిర్లక్ష్యానికి, అనంతమైన నిరాదరణకు గురవుతోందని రాజ్యసభ మాజీ సభ్యులు, సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. 6వ అమెరికా తెలుగు సంబరాల పేరిట అమెరికాలోని టెక్సాస్ రాష్ట్ర ఇర్వింగ్ నగరంలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ(నాట్స్) ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా సాహిత్యవేదిక సదస్సులో ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. మమ్మీ డాడీ రెండు పదాలు ప్రత్యేకంగా కేవలం అమ్మా నాన్నకు ఉద్దేశించబడినందువలన వాటితో ప్రమాదం లేదని, కానీ అంకుల్-ఆంటీ అనే రెండు పదాలతో మొత్తం సనాతన భారతీయ కుటుంబ సంప్రదాయాన్ని తుంగలో తొక్కుతున్నారని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. మావయ్య, బాబాయి, పెదనాన్న అన్నింటికీ అంకుల్, అత్త, పిన్ని, పెద్దమ్మ అన్నింటికీ ఆంటీ అంటూ ఒకే మాటతో తెలుగు నుడికారానికి ఉరి పెనవేశారని యార్లగడ్డ పేర్కొన్నారు. అటు ప్రభుత్వాలు తమ ఆంగ్ల పిచ్చిలో, ఇటు ప్రజలు తమ నాగరిక పైత్యంలో తెలుగును తొక్కేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. మోహం మంచిదే గానీ వ్యామోహం చెడ్డదని, ఆంగ్ల మోహం ఉండి తీరాల్సిందే గాని తెలుగును తన్నేసేటంత వ్యామోహం పనికిరాదన్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో పాఠశాలలు, గ్రామాలతో పాటు తెలుగు పండితులను కూడా దత్తత తీసుకోవాలని తద్వారా తెలుగు భాష భావితరాలకు అందించిన ఘనత మనకు దక్కుతుందని" ఆయన పేర్కొన్నారు. 

 అనంతరం యార్లగడ్డను సాహిత్యవేదిక సమన్వయకర్త అనంత్ మల్లవరపు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. మీగడ రామలింగస్వామి సంగీత నవ అవధానం అలరించింది. దీనికి పూర్వం ఉదయం స్థానిక ప్రవాస యువతీయువకులు చేసిన స్వాగతనృత్యాలు అలరించాయి. సాయంకాల వేడుకల్లో డా.వాడ్రేవు కామరాజు, డా.పగిడిపల్లి దేవయ్యలకు జీవిత సాఫల్య పురస్కారాలు అందించారు. మనో సంగీత విభావరి ఉర్రూతలూగించింది. సినీనటులు తమన్నా, సాయికుమార్, గీత, సాయిధరంతేజ, శివారెడ్డి, భానుశ్రీ తదితరుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజయనగర ఇంజినీరింగ్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో 25మంది గురువులను 800మంది పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు.

 

Tags :