ASBL NSL Infratech

తుగ్లక్ నాణెం

తుగ్లక్ నాణెం

మన ఓరుగల్లు కొన్ని వందల ఏళ్ల క్రితం, అంటే మహ్మద్‌ బీన్‌ తుగ్లక్‌ హయాంలో కొంతకాలం పాటు సుల్తానాబాద్‌గా పేరు మార్చుకుంది. అంతేనా ముల్క్‌- ఎ-తెలంగాణ పేరిట ఓ నాణేన్ని విడుదల చేశాడు తుగ్లక్‌. దక్షిణాదిలో లభించిన తుగ్లక్‌ నాణెం ఇదొక్కటే ఈ నాణేం డిసెంబర్‌ 15 నుంచి ఐదు రోజుల పాటు హైరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా జరగనున్న ప్రపంచ తెలుగు మహాసభల ప్రధాన వేదికైన ఎల్‌బీ స్టేడియంలో ఆహూతులకు కనువిందు చేయనుంది. ఇలాంటి మరెన్నో విశేషాలతో ప్రపంచ తెలుగు మహాసభలు తెలుగు భాషా వైభవాన్నే గాక తెలంగాణ ఘన చరిత్రనూ ప్రపంచానికి చాటనున్నాయి. అరుదైన, పురాతన, నాణేలు, శాసనాలు, కాలగర్భంలో కలిసిపోయిన ప్రాచీన ఆలయాల నమూనాలు, చరిత్రను తెలియజెప్పే పుస్తకాలు తదితరాలు మహాసభల వేదికపై కొలువుదీరనున్నాయి.

దాదాపు 140 అరుదైన నాణేలను ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక వద్ద వీక్షకుల కోసం ప్రదర్శనకు ఉంచుతున్నారు. ప్రాచీన కాలంనాటి ముద్రల నాణేలు (పంచ్‌ మార్క్‌డ్‌) మొదలుకొని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, కాకతీయులు, బహమనీలు, కుతుబ్‌షాహీలు, విజయనగర రాజులు, నిజాంల దాకా తెలంగాణలో చలామణి అయిన పలు నాణేలు కొలువుదీరనున్నాయి.

వెయ్యేళ్ల తెలుగుగా మన భాషకు ప్రాచీన హోదా దక్కేందుకు ఆధారభూతమైన కుడిత్యాల శాసనం చూడాలనుకుంటే తెలుగు మహాసభలకు రావాల్సిందే. ప్రస్తుత  కరీనగర్‌ జిల్లాలో తవ్వకాల్లో వెలుగు చూసిన ఈ శాసనంపై తెలుగు లిపి కనిపించింది. ఇది క్రీ.శ. 945 నాటి శాసనమని నిరూపితమైంది. సంస్కృతం, కన్నడంతో పాటు తెలుగులో కందపద్యం రాసి ఉన్న ఈ శాసనం కూడా మహాసభల్లో కొలువుదీరనుంది. దీనితోపాటు మరో నాలుగైదు పురాతన శాసనాల నకళ్లను కూడా ప్రదర్శనకు ఉంచుతున్నారు.

 

Tags :