ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

లండన్‌లో ఘనంగా తాల్ ఉగాది వేడుకలు

లండన్‌లో ఘనంగా తాల్ ఉగాది వేడుకలు

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్)  ఉగాది 2022 ని లండన్‌లోని నవనాథ్ సెంటర్‌లో 30 ఏప్రిల్ 2022న లండన్ మరియు పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న వందలాది తెలుగు కుటుంబాలతో కలిసి ఘనముగా నిర్వహించింది. 

కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులందరికీ నివాళులర్పించేందుకు ఒక నిమిషం మౌనం పాటించారు. తాల్ కల్చర్ సెంటర్ (TCC) విద్యార్థులచే గణపతి పాట, భరతనాట్యం, కర్ణాటక సంగీత గానం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శనతో, వేడుకలు ప్రారంభమయ్యాయి. సంప్రదాయ, సినీ సంగీత, నృత్యాలతో, విబిన్న కార్యక్రమలతో వేదిక హోరెత్తింది. హాజరైన వారికి సంప్రదాయ ఉగాది మిఠాయిలు, రుచికరమైన వంటకాలు అందించారు.  

తాల్ చైర్‌పర్సన్ భారతి కందుకూరి, వైస్-చైర్మన్ & కోశాధికారి రాజేష్ తోలేటి, ఇతర ట్రస్టీలు గిరిధర్ పుట్లూరు, అనిత నోముల, అనిల్ అనంతుల, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, నవీన్ గాదంసేతి, కస్తూరి కిషోర్ పాల్గొన్నారు. కన్వీనర్ రవి సబ్బా సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. 

ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ళ భరణి తన జీవిత విశేషాలను మరియు అనుభవాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. UK లో తెలుగు సంస్కృతిని పరిరక్షించడంలో మరియు ప్రోత్సహించడంలో తాల్ చేస్తున్న కృషిని కొనియాడారు. ప్రముఖ తెలుగు గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి తాల్ నివాళులర్పించింది. శ్రీ భరణి గారు తన ప్రసంగంలో సిరివెన్నెల కవితా ప్రయాణం సాహితీ ప్రపంచంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది అని కొనియాడారు. TAL వార్షిక పత్రిక “మా తెలుగు” సావనీర్‌ను ముఖ్య అతిథి శ్రీ భరణి ఆవిష్కరించారు.

నల్గొండ గద్దర్‌గా ప్రసిద్ధి చెందిన ప్రముఖ జానపద గాయకుడు కాసాల నర్సన్న, తాల్ కోసం ప్రత్యేక గేయాన్ని పాడారు. అలాగే RRR చిత్రంలోని "కొముర భీముడో" పాట తనదైన శైలిలో పాడి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

జబర్దస్త్ ఆర్టిస్టులు ఆటో రామ్ ప్రసాద్, రౌడీ రోహిణి, బుల్లెట్ భాస్కర్ యాంకరింగ్ చేస్తూనే తమ హాస్యంతో ప్రేక్షకులను అలరించారు. నేపథ్య గాయకులు ధనుంజయ్ మరియు దామిని తమ ప్రసిద్ధ తెలుగు పాటలతో, వారి గానంతో మైమరిపించారు.

నరేంద్ర మధురాంతకం, తెలుగు నవలా రచయిత మరియు చిన్న కథా రచయిత, UK లో సంస్కృతి మరియు సాహిత్య కృషిని పరిరక్షించడంలో తాల్ చేస్తున్న కృషిని కొనియాడారు. భారత హైకమిషన్ రెండవ కార్యదర్శి సంజయ్ కుమార్ నరేంద్రను సత్కరించారు. 

ప్రత్యేక అతిధులు, పార్లమెంటు సభ్యులు సీమా మల్హోత్రా మరియు వీరేంద్ర శర్మ సమాజానికి తాల్ యొక్క నిరంతర సహకారాన్ని, తెలుగు భాష మరియు సంస్కృతిని యువ తరానికి అందించడాన్ని ప్రశంసించారు. 

ఈవెంట్ యొక్క లీడ్ స్పాన్సర్‌లు, శుభోదయం గ్రూప్, LEO గ్లోబల్ సర్వీసెస్, మార్ట్‌గేజ్ అవెన్యూ, శక్తి క్యాష్ & క్యారీతో పాటు ఇతర స్థానిక వ్యాపార సంస్థలు ఈ ఈవెంట్‌ను స్పాన్సర్ చేశాయి. 

తాల్ చైర్‌పర్సన్ భారతి కందుకూరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన ప్రేక్షకులకు, నిర్వాహక కమిటీకి, కళాకారులకు, వాలంటీర్లకు, తోటి సంస్థలు మరియు స్పాన్సర్‌లందరికీ ధన్యవాదాలు తెలిపారు. 

 

Click here for Event Gallery

 

Tags :