ASBL NSL Infratech

‘తానా’ ఎన్నికల్లో నరేన్‌ కొడాలికి మద్దతు ఇచ్చిన గోగినేని

‘తానా’ ఎన్నికల్లో నరేన్‌ కొడాలికి మద్దతు ఇచ్చిన గోగినేని

ప్రస్తుతం జరుగుతున్న తానా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గా పోటీ చేస్తున్న నరేన్‌ కొడాలికి మద్దతు ఇస్తూ, తాను ఈ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు శ్రీనివాస గోగినేని  ప్రకటించారు. గత వారాంతం మిచిగాన్‌ లోని తన స్వగృహంలో కలిసిన నరేన్‌ కొడాలితో జరిగిన చర్చల సమయంలో నరేన్‌ కొడాలి తానా భవిష్యత్తుపై మంచి విజన్‌తో ఉన్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా నిలిచి ఆ అశయాల సాధనకు తనవంతుగా తోడ్పాటును అందించనున్నట్లు శ్రీనివాస గోగినేని తెలిపారు. అందుకోసమే తాను ఈ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. తానాకు మేలు చేయాలన్న నా లక్ష్యానికి నరేన్‌ కొడాలి మద్దతు ఇవ్వడంతోపాటు ఆయన విజన్‌ కూడా తన లక్ష్యానికి అనుగుణంగా ఉండటం వల్ల ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు శ్రీనివాస గోగినేని తెలిపారు.  

‘తానా’ సమగ్రతకై ప్రస్తుత వర్గ పోరాటాల్లో ఎవరో ఒకరు పూర్తి ఆధిపత్యం తాత్కాలికంగానైనా అత్యవసరమని భావించడం, కొన్ని ముఖ్య కార్యక్రమాల కోసం సుమారు 250,000 డాలర్స్‌  ‘నరేన్‌’  సొంతంగా సమకూర్చుతూ మరో 500,000 డాలర్స్‌ సమీకరణకు వ్యక్తిగత హామీ ఇవ్వడం తన నిర్ణయానికి ముఖ్య కారణమని ‘తానా’ సభ్యులందరూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నానని తెలిపారు. ఆ విషయంగా  తనకు చేతనైనంత వరకు ‘నరేన్‌’ విజయానికి కృషి చేస్తానని కూడా ‘గోగినేని’ తెలిపారు. మరి ఇప్పటికే దూకుడు మీద ఉన్న ‘నరేన్‌ కొడాలి’ వర్గానికి ‘గోగినేని’ మద్దతుతో మరింత దన్ను సమకూరి ఎన్నికల విజయం నల్లేరు మీద నడక అవ్వవచ్చునని అదే సమయంలో ఈ విషయం ప్రతర్ది వర్గానికి తీరని నష్టమని పలువురు భావిస్తున్నారు. నరేన్‌ కొడాలి బోర్డు చైర్మన్‌ గా ఉన్నప్పుడు, శ్రీనివాస గోగినేని ఫౌండేషన్‌ చైర్మన్‌ గా ఉన్నారు. వారు కలిసి పనిచేసి అప్పుట్లో పలువురి మన్ననలు అందుకున్నారు.

 

 

Tags :