ASBL NSL Infratech

స్మార్ట్ విలేజ్...ఎన్నారైలకు మంచి అవకాశం

స్మార్ట్ విలేజ్...ఎన్నారైలకు మంచి అవకాశం

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంతోమంది అమెరికాకు వెళ్ళి అక్కడే ఉద్యోగ, వ్యాపారాలు నిర్వహిస్తూ స్థిరనివాసం ఏర్పరచుకున్నవారందరినీ నవ్యాంధ్ర నిర్మాణంలో పాలుపంచుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నారు. స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ను రూపొందించాలంటే ప్రతి ఒక్కరూ తాము పుట్టిన ఊరిని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చినప్పుడే స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమని ఆయన అంటూ ప్రతి ఒక్కరూ స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమంలో భాగస్వాములై తమ ఊరిని, తమ ప్రాంతాన్ని అభివృద్ధిపరుచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమంలో ఎంతోమంది ఎన్నారైలు ఉత్సాహంతో ఉన్నారని, వారిలో మరింత స్ఫూర్తిని కలిగించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, స్మార్ట్‌ కార్యక్రమాలపై మంచి అవగాహన కలిగిన యువ నాయకుడు నారా లోకేష్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. మే 3వ తేదీ నుంచి ఆయన పర్యటన ప్రారంభమవుతోంది. న్యూజెర్సి, బే ఏరియా ఇతర చోట్ల ఆయన ఎన్నారైలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆయన పర్యటనకోసం ఇప్పటికే ఎన్నారై టిడిపి ప్రముఖులు ఏర్పాట్లను చేశారు. 

స్టోరీ:

నవ్యాంధ్ర నిర్మాణంలో భాగంగా అన్నీ గ్రామాల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమం ఇప్పుడు ఎన్నారైలను ఆకర్షిస్తోంది. 2029  నాటికి దేశంలలోనే నెంబర్‌ 1 రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగా పాలనలో సమూల మార్పులను చేస్తూనే, కొత్త ప్రణాళికలతో గ్రామస్థాయి నుంచి అభివృద్ధి జరగాలని అందుకు అనుగుణంగా స్మార్ట్‌ వార్డ్‌, స్మార్ట్‌ డివిజన్‌, స్మార్ట్‌ విలేజ్‌ చివరిగా స్మార్ట్‌ ఆంధ్రప్రదేశ్‌ రూపొందాలని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ఆయన చర్యలను చేపట్టారు.

స్మార్ట్‌ కార్యక్రమంలో భాగంగా అత్యుత్తమ విధానాలను అమలు చేయాలని, ప్రతి ఒక్కరినీ ఇందులో భాగస్వాములు చేయాలని యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలను ఆచరణలో పెడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాలతోపాటు దీర్ఘకాలిక అభివృద్ధి పనులు కొనసాగించదలిచారు. 20 అంశాలతో స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమానికి ఆయన రూపకల్పన చేశారు. పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన, ఆనందదాయకమైన ఆర్థిక అసమనాతలు లేని సమాజాన్ని నిర్మించడమే స్మార్ట్‌ విలేజ్‌ పథకం ముఖ్య ఉద్దేశ్యం.

ప్రతి కుటుంబానికి ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు కల్పించడం, బడిఈడు పిల్లలందరూ బడిలో ఉండేట్లు చూడటం, పిల్లలకు పౌష్టికాహారం, మరుగుదొడ్డి, తాగునీటి సౌకర్యం, మాతాశిశు మరణాల తగ్గింపు, వందశాతం అక్షరాస్యత సాధించడం వంటి అంశాలు ఇందులో ఉన్నాయి. ప్రతి గ్రామం వార్డును ఆకర్షణీయం (స్మార్ట్‌)గా రూపొందించడం ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ను స్మార్ట్‌గా చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలలోని మొత్తం 12,918 గ్రామాను, 3,465 వార్డులను ఐదేళ్ళలో స్మార్ట్‌గా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.

స్మార్ట్‌ విలేజ్‌ లక్ష్యసాధనలో ఎంతోమంది ప్రముఖులు...

స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమం కింద విశాఖ జిల్లాలోని అరకు గ్రామాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా దత్తత తీసుకున్నారు. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ స్వగ్రామం నిమ్మకూరును లోకేష్‌ దత్తత తీసుకున్నారు. ఎన్టీఆర్‌ సతీమణి స్వగ్రామమైన కొమరోలు (కృష్ణాజిల్లా)ను బాబు సతీమణి నారా భువనేశ్వరి దత్తత తీసుకున్నారు. బాబు స్వగ్రామం నారావారి పల్లిని బ్రాహ్మణి దత్తత తీసుకున్నారు. అన్నవరం గ్రామాన్ని మంత్రి యనమల రామకృష్ణుడు, గుంటూరు జిల్లా గొట్టిపాడు గ్రామాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మంత్రి పల్లె రఘునాథ రెడ్డి తన స్వగ్రామాన్ని, పశ్చిమ గోదావరి జిల్లాలోని సీతారాంపురంను ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, విజయవాడలో మొగల్‌ రాజపురం వార్డును ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ప్రముఖ క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ కూడా నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారి కండ్రిగను దత్తత తీసుకుని అభివృద్ధిపరిచారు. ఇలా ఎంతోమంది స్మార్ట్‌ విలేజ్‌ పథకంలో భాగస్వాములయ్యారు.

కృష్ణా జిల్లా పామర్రు మండలంలోని కొరిమెర్ల గ్రామాన్ని కెనడాకు చెందిన ఎన్నారై నవీన్‌ చౌదరి, విజయవాడలోని 27వ వార్డును న్యూజెర్సి ఎన్నారై జయనారాయణ కురేటి వంటి ఎన్నారైలు కూడా స్మార్ట్‌ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు ముందుకు వచ్చారు.

స్మార్ట్‌ విలేజ్‌లో ఎన్నారైల భాగస్వామ్యం... లోకేష్‌ పర్యటన లక్ష్యం

సామాజిక బాధ్యత కింద ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ఇతరులు గ్రామాలను దత్తత తీసుకోవాలని చంద్రబాబు పిలు ఇచ్చారు. ఇప్పుడు ఈ కార్యాచరణలో తెలుగు ఎన్నారైలను పెద్దసంఖ్యలో పాల్గొనేలా చేయాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్‌ అమెరికా పర్యటన చేస్తున్నారు.

బే ఏరియా, న్యూజెర్సి ఇతర చోట్ల ఆయన ఎన్నారైలతో ముఖాముఖీ సమావేశమవుతారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూపొందించిన స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమాన్ని వారికి వివరిస్తారు. ఎక్కువమందిని స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమంలో పాల్గొనేలా చేయడమే నారా లోకేష్‌ పర్యటన ముఖ్య ఉద్దేశ్యం. అదే సమయంలో రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికోసం పెట్టుబడులు పెట్టాల్సిందిగా కూడా ఆయన వ్యాపార, వాణిజ్యరంగ ప్రముఖులను, ఐటీ అధినేతలను ఆహ్వానించనున్నారు.

ఖరారవుతున్న కార్యక్రమాలు...

*  లాస్‌ ఏంజెలిస్‌లోని షెరెటాన్‌ సెరిటోస్‌ హోటల్‌లో మే 3వ తేదీ సాయంత్రం 6 గంటలకు నారా లోకేష్‌తో సమావేశాన్ని ఆ ఏరియా టీడిపి అభిమానులు ఏర్పాటు చేశారు.
*  బే ఏరియాలో మే 8వ తేదీన మిల్‌పిటాస్‌లోని ఐసీసిలో నారాలోకేష్‌తో సమావేశాన్ని బే ఏరియా ఎన్నారై టీడిపి నాయకులు ఏర్పాటు చేశారు.
*  న్యూజెర్సిలో మే 9వ తేదీన ఎడిసన్‌ హోటల్‌లో ముఖాముఖీ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఆ ఏరియా ఎన్నారై టిడిపి అభిమానులు తెలిపారు.

స్మార్ట్‌ విలేజ్‌ పథకం లక్ష్యాలు

*  ప్రతి కుటుంబానికి జీవనభృతికి అవసరమైన పని ఉండాలి. లేకుంటే చిన్న చిన్న వ్యాపారాలు చేసే అవకాశాలను కల్పించాలి.
*  అందరికీ ఇళ్ళు, సురక్షిత నీరు, విద్యుత్‌ ఉండాలి.
*  ప్రతి ఇంటికి మరుగుదొడ్డి ఉండాలి. బహిరంగ మలవిసర్జన చేయకుండా చూడాలి.
*  ప్రసవాలు అన్నీ ఆసుపత్రుల్లోనే జరగాలి.
*  శిశుమరణాలు లేకుండా చూడాలి.
*  ఐదేళ్ళలోపు పిల్లలందరికీ పౌష్టికాహారం అందించాలి.
*  పాఠశాలలకు వెళ్తున్న బాలబాలికలు మధ్యలో చదువు మానేయకుండా చూడాలి.
*  అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, గ్రామపంచాయతీ భవనాల్లో వాడుకలో ఉండేలా మరుగుదొడ్డి, తాగునీరు, విద్యుత్‌ ఉండాలి.
*  ఏడాదిలో నాలుగుసార్లు గ్రామ, వార్డు సభలు జరగాలి. ఆ గ్రామం, వార్డుల్లో ఉన్న మూడిరట రెండొంతులమంది హాజరు కావాలి.
*  ప్రతి కుటుంబానికి బ్యాంక్‌ ఖాతా ఉండాలి.
*  ప్రతి పొలానికి భూసరపరీక్ష కార్డు ఉండాలి. పశుపోషణ, వైవిధ్యమైన మొక్కల పెంపకం చేపట్టాలి.
*  ప్రజలందరి భాగస్వామ్యంతో తయారు చేసిన అభివృద్ధి ప్రణాళిక ఉండాలి.
*  గ్రామం, వార్డు సరిహద్దుల మొత్తం పచ్చని మొక్కలు పెంచాలి.
*  నీటిసంరక్షణ, నీటి నిల్వ నిర్మాణాలు ఉండేలా చేయాలి.
*  వివాదాలు, సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారానికి ఒక పద్ధతి ఉండాలి.
*  గ్రామ సమాచార కేంద్రం, కంప్యూటర్‌ ల్యాబ్‌, మీ సేవ కేంద్రం ఉండాలి.
*  ఇంటర్నెట్‌ అనుసంధానత ఉండాలి.
*  ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ వ్యవస్థ ఉండాలి.

 

Tags :