ASBL NSL Infratech

రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో గరుడ పతాక ఆవిష్కరణ..

రామానుజ సహస్రాబ్ది వేడుకల్లో గరుడ పతాక ఆవిష్కరణ..

హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా గురువారంనాడు విష్వక్సేనుడి పూజ, ధ్వజారోహణం కన్నుల పండువగా సాగింది. ధ్వజారోహణ కార్యక్రమంలో భాగంగా గరుడ పతాకాన్ని అవిష్కరించారు. గరుడుడి ద్వారా యాగశాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ఆ తర్వాత అగ్నిమథన కార్యక్రమంతో లక్ష్మీనారాయణ మహాయాగం ప్రారంభమైంది. సహజ పద్ధతిలో (శమీ దండం, రావి దండం కర్రలతో మథించి) అగ్నిని పుట్టించిన అనంతరం.. ఆ అగ్నిని యాగశాలలకు వితరణ చేసి కుండాలలో నిక్షిప్తం చేసిన రుత్వికులు అత్యంత వైభవంగా యాగాన్ని ప్రారంభించారు. పన్నెండు రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.

సమతాస్ఫూర్తి కేంద్రంలోని ప్రవచన మండపంలో చిన జీయర్‌ స్వామి ఆధ్వర్యంలో మధ్యాహ్నం 12 గంటల సమయంలో దీప ప్రజ్వలనతో ఆరాధన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దాదాపు 2 వేల మంది భక్తులు క్యూలైన్లలో ఆసీనులయ్యారు. ఆచార్య స్మరణ అనంతరం చిన జీయర్‌స్వామితో పాటు మైహోం సంస్థల అధినేత జె.రామేశ్వరరావు భక్తుల చెంతకు వచ్చి భగవంతుడి ప్రతిమతో కూడిన డాలర్లను పంపిణీ చేశారు. అనంతరం భక్తులు వెంట తెచ్చుకున్న పూజా ద్రవ్యాలతో ఆరాధన కార్యక్రమాన్ని కొనసాగించారు. ఈ సమయంలో చిన జీయర్‌ స్వామి భక్తులకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ముందుకు నడిపించారు. ఈ సందర్భంగా పెద్ద జీయర్‌ స్వామి వారి అష్టోత్తర శతనామావళిని అందరూ పఠించారు. అదే సమయంలో చిన్న జీయర్‌ స్వామి సన్యాసాశ్రమ స్వీకార విశేషాలను, స్వామివారి ఔన్నత్యాన్ని గురించి మహామహోపాధ్యాయ డాక్టర్‌ సముద్రాల రంగరామానుజులవారు వివరించారు. ఈ కార్యక్రమంలో నేపాల్‌ నుంచి విచ్చేసిన శ్రీమాన్‌ కృష్ణమాచార్యులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

Tags :