ASBL NSL Infratech

1000 గ్రామాల దత్తత - న్యూజెర్సిలో లోకేష్ మీటింగ్ కు అనూహ్య స్పందన

1000 గ్రామాల దత్తత - న్యూజెర్సిలో లోకేష్ మీటింగ్ కు అనూహ్య స్పందన

దేశంలోనే టాప్‌3లో ఆంధ్రప్రదేశ్‌ ఉండాలన్న అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాల్లో ఒకటైన స్మార్ట్‌ విలేజ్‌ - స్మార్ట్‌ వార్డ్‌ కార్యక్రమంపై అమెరికాలోని ఎన్నారైల నుంచి మద్దతును సేకరించాలన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌ మే 3వ తేదీ నుంచి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మే 9వ తేదీ శనివారం సాయంత్రం ఎడిసన్‌ నగరంలోని ఎడిసన్‌ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో నారా లోకేష్‌ పాల్గొన్నారు. న్యూజెర్సి నగరంలోని టిడిపి అభిమానులతోపాటు, కనెక్టికట్‌, డెలావేర్‌, న్యూయార్క్‌, మసాచుసెట్స్‌, పెన్సిల్వేనియా తదితర రాష్ట్రాల నుంచి ఎంతోమంది తెలుగువాళ్ళు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా), నార్త్‌ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్‌) నాయకులు ఈ సమావేశానికి వచ్చారు.

ఈ సమావేశంలో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఇతర చోట్లకన్నా ఇక్కడ ఉన్న ఎన్నారైలు దాదాపు 780 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు అప్పటికప్పుడే ప్రకటించడం, మరో 220 గ్రామాలను కూడా దత్తత తీసుకునేందుకు చాలామంది రెడీగా ఉన్నారని మొత్తం మీద ఈ ప్రాంతం నుంచి 1000 గ్రామాలను దత్తత తీసుకుంటామని నిర్వాహకులు ప్రకటించారు.

తొలుత జే తాళ్ళూరి స్వాగతోపన్యాసం చేస్తూ ఎన్టీఆర్‌ మనవడిగా, చంద్రబాబు నాయుడు కుమారుడిగా, నందమూరి బాలకృష్ణ అల్లుడిగా వారి వ్యక్తిత్వ లక్షణాలను పుణికి పుచ్చుకుని మంచి నాయకత్వలక్షణాలు కలిగిన వ్యక్తిగా ఇప్పటికే నారా లోకేష్‌ ప్రతిభను నిరూపించుకున్నారని ప్రశంసించారు. దాదాపు 50 లక్షల మంది తెలుగు దేశం పార్టీ సభ్యులకు పార్టీపరంగా అండగా నిలిచేలా వారికి ప్రమాదబీమా కల్పించి దేశంలోనే ఇలాంటి అవకాశం కల్పించిన నాయకునిగా లోకేష్‌బాబు నిలిచిపోయారన్నారు. పార్టీ కార్యకర్తల సంక్షేమానికి నారా లోకేష్‌ ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారన్నారు.

బ్రహ్మాజీ వలివేటి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడుపై అభిమానంతో అప్పుట్లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా తెనాలిలోని చినరావూరు గ్రామాన్ని 14 ఏళ్ళ క్రితమే తాను దత్తత తీసుకున్నానని చెబుతూ, తాను చిన్నప్పుడు బడికి వెళ్ళాలంటే బురదలో నడుచుకుంటూ వెళ్ళేవాడినని, ఇప్పుడు తాను ఆ గ్రామాన్ని దత్తత తీసుకున్న తరువాత అభివృద్ధి పనులు జరిగి నేడు రోడ్లు, డ్రైనేజి, మంచినీటి సౌకర్యాలతో ఆ గ్రామం సస్యశ్యామలంగా కనిపిస్తోందన్నారు. అభివృద్ధిజరిగిన ప్రాంతం కాబట్టి భూముల రేట్లు కూడా బాగా పెరిగిందని చెప్పారు. నారా లోకేష్‌ గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమానికి ఆయన బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నారై భవన్‌ను నిర్మించాలని, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీనికి సహకరించాలని కోరుతూ, ఈ భవన్‌ నిర్మాణానికి తనవంతుగా 60 లక్షల రూపాయలను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.

మోహన్‌ కృష్ణ మన్నవ మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి కృషి చేస్తున్న నారా లోకేష్‌, తండ్రి ఆశయ సాధనలో భాగంగా అమెరికా వచ్చి గ్రామాభివృద్ధికోసం విరివిగా ప్రచారం చేస్తున్నారని, గ్రామాభివృద్ధితో ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతిపథంలో తీసుకువచ్చేందుకు తనవంతుగా లోకేష్‌ కృషి చేస్తున్నారని కొనియాడారు.

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్షుడు మోహన్‌ నన్నపనేని మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం తానా ఫౌండేషన్‌ ఇప్పటికే 300 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధిపనులను చేపట్టిందని చెప్పారు. తానా ద్వారా 100 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధిపరచనున్నట్లు ప్రకటించారు. నాట్స్‌ చైర్మన్‌ మధు కొర్రపాటి మాట్లాడుతూ, తాము కూడా 100 గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

నారా లోకేష్‌ మాట్లాడుతూ, ఎన్నారైలు చంద్రబాబునాయుడు చేపట్టిన కార్యక్రమాలపై ఆసక్తిని చూపించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలను అమెరికా శాసిస్తుంటే, అమెరికాను ఇక్కడ ఉన్న తెలుగువాళ్ళు శాసిస్తున్నారని, ఇక్కడ ఉన్న టాప్‌ టెన్‌ కంపెనీల్లో టాప్‌ 10 పోస్టుల్లో తెలుగువాళ్ళు ఉన్నారని, ఇది చాలా సంతోషకరమైన విషయమని చెప్పారు. ఆనాడు చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఇంజనీరింగ్‌ కళాశాలలను పెద్ద సంఖ్యలో స్థాపించి ఎంతోమందికి చదువు చెప్పించారని, వారంతా ఇప్పుడు అమెరికాలో ఉన్నతోద్యోగంలో ఉన్నారని లోకేష్‌ అన్నారు.

మలేషియా నుంచి సింగపూర్‌ విడిపోయినప్పుడు సింగపూర్‌ అభివృద్ధి చెందుతుందా లేదా అన్న సందేహం చాలామందిలో కలిగిందని కాని సింగపూర్‌ అనతికాలంలోనే తన వనరులను సద్వినియోగం చేసుకుని నేడు అభివృద్ధి సాధించిన దేశంగా మారిందన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కూడా త్వరలోనే అభివృద్ధిని సాధించి దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా మారడం ఖాయమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు నేడు స్మార్ట్‌విలేజ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు కూడా తమవంతుగా జన్మభూమికి సేవ చేయాలని, గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధిపరచాలని కోరారు.

ఎన్నారైలను స్పందింపజేసేవిధంగా లోకేష్‌ ప్రసంగం, సమాధానాలు ఉండటంతో అప్పటికప్పుడే చాలామంది ఎన్నారైలు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. దాదాపు 780 గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమ నిర్వాహకుల్లో ఒకరైన బ్రహ్మాజీ వలివేటి మాట్లాడుతూ, తాను, మోహన్‌కృష్ణ మన్నవ, కలపటపు బుచ్చిరాంప్రసాద్‌ వ్యక్తిగతంగా స్మార్ట్‌విలేజ్‌పై అందరికీ అవగాహన కల్పించామని చెప్పారు. తాము చేసిన ప్రచారానికి మంచి స్పందన రావడం సంతోషంగా ఉందన్నారు. ఇంకో 220 గ్రామాలను కూడా దత్తత తీసుకునేలా చేస్తామని ఇక్కడ నుంచి 1000 గ్రామాలను దత్తత తీసుకోవడం ఖాయమని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తానా, నాట్స్‌ నాయకులతోపాటు స్థానిక తెలుగు సంఘాలైన టిఫాస్‌, టిఎల్‌సిఎతోపాటు ఇతర కమ్యూనిటీ సంఘాలవారు కూడా పాల్గొన్నారు.

అంతకుముందు నారా లోకేష్‌ రాకను పురస్కరించుకుని స్థానిక తెలుగుదేశం అభిమానులు కార్లర్యాలీ నిర్వహించారు.


Click here for PhotoGallery

 

Tags :