ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

బే ఏరియా ఎన్నారైలను ఆకట్టుకున్న నారా లోకేష్

బే ఏరియా ఎన్నారైలను ఆకట్టుకున్న నారా లోకేష్

(సుబ్బారావు చెన్నూరి) 

అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్‌ శాన్‌ఫ్రాన్సిస్కో వచ్చినప్పుడు ఆయనకు బే ఏరియా ఎన్నారైలు ఘనస్వాగతం పలికారు.

మిల్‌పిటాస్‌లోని ఇండియా కమ్యూనిటీ సెంటర్‌ (ఐసిసి)లో జనవరి 28వ తేదీన ఎన్నారై టీడిపి, ఎపిజన్మభూమి, ఎపిఎన్‌ఆర్‌టీ ఏర్పాటు చేసిన కమ్యూనిటీ రిసెప్షన్‌లో లోకేష్‌ పాల్గొన్నారు. వేదిక వద్దకు వచ్చిన లోకేష్‌కు తొలుత పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. పెద్దసంఖ్యలో ఉన్న అభిమానులకు లోకేష్‌ అభివందనములు తెలిపారు. కార్యక్రమంలో మొదటగా మా తెలుగుతల్లికి మల్లెపూదండ పాటను పాడారు.

ఎపిఎన్‌ఆర్‌టి చైర్మన్‌ రవి వేమూరి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి ఎన్నారై కూడా ఒక ఎంట్రప్రెన్యూర్‌ కావాలని ఆశిస్తున్నారని, అదే సమయంలో ప్రతి ఎన్నారై కూడా మాతృరాష్ట్రంతో సంబంధాలను కలిగి ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎపిఎన్‌ఆర్‌టీ ఎన్నారైలకు సాయం చేస్తుందని, రాష్ట్రానికి వారికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని చెప్పారు.

ఎన్నారై టీడిపి తరపున వెంకట్‌ కోగంటి మాట్లాడుతూ, ఎన్నారై టీడిపి తరపున తాము చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను, అభివృద్ధిని ఎప్పటికప్పుడు విదేశాంధ్రులకు తెలియజేస్తున్నామని చెప్పారు.

అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్న జయరామ్‌ కోమటి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్ర అభివృద్ధి కోసం ఎంతో శ్రమిస్తున్నారని, ఆ శ్రమలో ఎన్నారైలు కూడా జన్మభూమి కార్యక్రమాల ద్వారా పాలుపంచుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీనే గెలవాలని, ఇందుకు ఎన్నారై టీడిపి ఇప్పటి నుంచే ముందుంటుందని చెప్పారు.

నారా లోకేష్‌ మాట్లాడుతూ, రాజధాని కోసం రైతులు దాదాపు 31000 ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పారు. ప్రపంచంలోనే ఇంత పెద్ద ఎత్తున ల్యాండ్‌ పూలింగ్‌ జరగలేదు. కేవలం చంద్ర బాబు నాయకత్వం వల్లనే ఇది సాధ్యమైంది. ఒక రోడ్‌ వేయటానికి 2 ఏళ్ళు పడుతుంది...అలాంటిది ఒక రాజధాని కట్టటానికి చాలా టైం  పడుతుంది...కొన్ని తరాల వరకు చెప్పుకునేలా, రాష్ట్ర విభజన అన్యాయంగా చేసిన నాయకులు అసూయ పడేలా రాజధాని నిర్మాణం జరుగుతుంది. అలాంటి రాజధాని కోసం చంద్రబాబు గారు శ్రమిస్తున్నారని లోకేష్‌ వివరించారు.

రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉండాలి అని... కష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేస్తూ రాష్ట్రం అంతా నీరు అన్ని వేళలా ఉండేలా అనేక చర్యలను ప్రభుత్వం చేపట్టిందని,  పట్టిసీమ ప్రాజెక్ట్‌ నుంచి పోలవరం ప్రాజెక్ట్‌ దాకా అన్నీ పనులన్నీ శరవేగంతో జరుగుతున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి వారం లో ఒకరోజు ఈ పనుల మీద రివ్యూ మీటింగులు పెట్టి, అధికారులతో చర్చించి పనులు సకాలంలో అయ్యేలా చూస్తున్నారని తెలిపారు. రాష్ట్రం అన్నీరంగాల్లో అభివృద్ధి చెందాలని చేపట్టిన ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే కియా మోటార్స్‌, అపోలో టైర్స్‌, సీయట్‌ టైర్స్‌, పెప్సీ లాంటి పెద్ద కంపెనీలు తమ కంపెనీలను రాష్ట్రంలో ప్రారంభించాయని తెలిపారు.

ఐటీరంగం విశిష్టత ని  భారతదేశంలోనే మొదటగా గుర్తించి అభివృద్ధి చేసిన నాయకుడు చంద్రబాబు అని అంటూ, ఆయన ఇప్పుడు నవ్యాంధ్ర లో కూడా ఐటీరంగ అభివృద్ధికి అనేక కొత్త పాలసీలు తీసుకువచ్చారని, ఐటీ సంస్థలను ఒప్పించి రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నారని చెప్పారు. హెచ్‌సిఎల్‌ లాంటి పెద్ద సంస్థ అమరావతి లో దాదాపు 750 కోట్ల తో తమ ఆఫీస్‌ నిర్మాణం చేస్తోందని, ఇలా ఎన్నో పెద్ద కంపెనీలు రాష్ట్రానికి రావడం ప్రారంభించాయని తెలిపారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌ మంత్రిగా గ్రామాలలో రోడ్లు, ఇతర సదుపాయాల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు నారా లోకేష్‌ వివరించారు. ఐటీశాఖ మంత్రి గా రాబోయే సంవత్సరం లో లక్ష ఉద్యోగాలను కల్పించాలని ప్రయత్నిస్తున్నానని, మీ అందరి సహకారం తో దానిని సాధించగలనన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈ దేశం లో సగటు భారతీయడి ఆదాయం సంవత్సరానికి  85000 డాలర్లు అని చెబుతూ, మీరంతా ప్రయత్నం చేస్తే దానిని 150000 డాలర్లకు పెంచవచ్చని చెప్పారు. దానికి చేయాల్సిందంతా మీరంతా ఎంట్రప్రెన్యూరర్‌గా మారడమేనంటూ, ఇందుకోసం మీ ఆఫీస్‌ లలో స్కిల్స్‌ పెంచడానికి, పెంచుకోడానికి శని-ఆది వారాలలో ప్రత్యేక కోర్సులు ప్రారంభించాలని, దానికి ప్రభుత్వం కూడా మీకు సహాయపడుతుందని చెప్పారు.

చివరగా ఎన్నారై టీడిపి, బాటా, పాఠశాల టీంలు లోకేష్‌ని సన్మానించాయి.

ఎన్నారై టీడిపి తరపున రజనీకాంత్‌ కాకర్ల, ననీన్‌ తదితరులు లోకేష్‌ను సన్మానించారు. బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) తరపున ప్రసాద్‌ మంగిన, యశ్వంత్‌ కుదరవల్లి, రమేష్‌ కొండ, శ్రీలు వెలిగేటి, కరుణ్‌ వెలిగేటి తదితరులు సత్కరించారు.

పాఠశాల తరపున చెన్నూరి సుబ్బారావు, ప్రసాద్‌ మంగిన, డా. గీతా మాధవి, టీచర్లు సత్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో పాఠశాల 25 సెంటర్‌లతో 450 మంది పిల్లలకు తెలుగు భాషను నేర్పుతోందని లోకేష్‌కు వివరించారు.

ఆకట్టుకున్న లోకేష్‌ తీరు...

ఎయిర్‌పోర్ట్‌ లో తన కోసం తెచ్చిన లిమో కార్‌ వద్దని మాములు కార్‌ ఎక్కటం, అభిమానులతో కలిసిపోయి, పేరుపేరునా వచ్చిన వారిని పలకరించటం, ప్రసంగంలో కూడా ముఖమంత్రి చంద్రబాబులాగా నవ్యాంధ్ర అభివృద్ధిని వివరించడం చూసిన వారు లోకేష్‌ లో పరిణితి చెందిన యువ నాయకుడు కనిపిస్తున్నాడని, రాష్ట్రానికి కావాలిసిన నాయకుడిగా లోకేష్‌ ఎదుగుతున్నాడని చెప్పారు.

Click here for Event Gallery

 

Tags :