ASBL NSL Infratech

ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం

ప్రపంచ తెలుగు మహాసభలు విజయవంతం

ప్రపంచ తెలుగు మహాసభలు దేదీప్యమానంగా వెలుగొందాయి. తెలంగాణ భాష, సాహిత్యం, జానపద కళల వైభవాన్ని ఎలుగెత్తి చాటాయి. తెలుగు వెలుగులు ప్రపంచానికి పంచుకుందాం. తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటుదాం అనే స్ఫూర్తితో ప్రభుత్వం నిర్వహించిన ఐదు రోజుల పండుగ విజయవంతంగా ముగిసింది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ప్రారంభమైన మహాసభలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సందేశంతో ముగిశాయి. నగరంలోని ఏడు వేదికలపై వివిధ సాహిత్య ప్రక్రియలు, కళారూపాలు తెలుగు సౌరభాలను దశదిశలా వెదజల్లాయి.

ఎల్బీ స్టేడియం, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, రవీంద్రభారతి, తెలంగాణ సారస్వత పరిషత్తు ఇలా వేదికలన్నీ ఒకేచోట కావడంతో ఐదు రోజులూ పండుగ వాతావరణం కనిపించింది. భాషాభిమానులు ప్రవాహంలా కదలివచ్చారు. 42 దేశాల నుంచి ప్రతినిధులు, దేశంలోని 17 రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. వేలాది మంది ప్రతినిధులకు వసతి ఏర్పాట్లు చేసి ఆతిథ్యంలో అహో అనిపించారు. అన్ని వేదికల వద్ద భోజన సదుపాయం కల్పించి నోరూరించే తెలంగాణ వంటకాలను వడ్డించారు. మహాసభలకు ఐదు రోజుల్లో ఏ ఒక్క అపశృతి లేకుండా ప్రభుత్వం సజావుగా నిర్వహించింది.

Click here for Photogallery

 

Tags :