ASBL NSL Infratech

వినూత్న సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

వినూత్న సాంస్కృతిక  కార్యక్రమాలతో అలరించిన టాంటెక్స్ దీపావళి వేడుకలు

అమెరికా తెలుగు సాంస్కృతిక రాజధానిగా పేరొందిన డల్లాస్‌ నగరంలో,తెలుగు ప్రజల గుండె చప్పుడు, తెలుగుదనానికి మాతృక అయిన టాంటెక్స్‌ వారి దీపావళి వేడుకలు స్థానిక మార్తోమా చర్చి ఆడిటోరియంలో కన్నుల పండువగా జరిగాయి. ఈ దీపావళి సంబరాలను టెక్సాస్‌ రాష్ట్రం నుండే కాక ఎన్నో వేళ మైళ్ళు ప్రయాణించి, పక్క రాష్ట్రాల నుండి వచ్చిన తెలుగు వారు, ఆద్యంతం ఎంతో ఉల్లాసంగా, బంధుమిత్రులతో, ఆత్మీయులతో ఘనంగా జరుపుకున్నారు.

ప్రాంగణమంతా ఎపిక్‌ ఈవెంట్స్‌ వారు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అందమైన అలంకరణతో ముస్తాబై, అతిధులకు, ప్రేక్షకులకు ఆహ్వానం పలికింది. టాంటెక్స్‌ సాంస్కృతిక బృంద సమన్వయకర్త పద్మశ్రీ తోట ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా తన సహజ సిద్ధమైన సుమధుర వ్యాఖ్యానంతో, సున్నిత హాస్యంతో, ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు. స్థానిక కళాకారులు ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు, అంగళ్ళతో ఆవరణ అంతా పండుగ వాతావరణం నెలకొంది.

ప్రార్దనా గీతంలో మొదలైన కార్యక్రమాల, సంప్రదాయ కీర్తనలతో, నృత్యాలతో, మెడలీ పాటలతో, ఎంతో హుషారుగా సాగాయి. ప్రేక్షకులు, ఎప్పుడెప్డుఆ అని ఎదురుచూసిన తరుణం రానే వచ్చింది. బిగ్‌ బాస్‌ తెలుగు రియాలిటీ షో ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందిన హరితేజ,, ధనరాజ్‌ లను తెలుగు రాప్‌ పాటలతో పేరు తెచ్చుకొన్న రేపర్‌ రోల్‌ రైడ్‌లను ఒక్కసారిగా చూసిన ప్రేక్షకులు చాలా సేపటికివరకు తమ కరతాళధ్వనులతో, కేరింతలతో చిన్న పాటి సునామీ సృష్టించారు. వారు కూడా అంచనాలకు ఏమీ తగ్గకుండా చక్కని హాస్య నాటికలతో, పంచ్‌ డైలాగులతో విపరీతంగా నవ్వించారు.

అటు తరువాత, స్టేజీ మీద ఒక్కసారిగా చీకట్లు కమ్ముకొన్నాయి ఏంజరిగిందో అనుకొనే లోగా ఒక్కో దీపం వెలగడం, రంగురంగుల దీపాల కాంతులలో 50కి పైగా కళాకారులు చేసిన ప్రదర్శన డల్లాస్‌ కళాకారుల ప్రతిభకు  తార్కాణం. రేడియం కాంతులతో నిజంగానే పటాసులు కాలుస్తున్నారో అనేంత ఆహ్లాదంగా సాగిన ఈ ప్రదర్శన అశే నీరాజనాలు అందుకొంది. అందమైన భామలు వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అని చేసిన నృత్యాలు, సంప్రదాయాన్ని మరవకుండా చేసిన కూచిపూడి నృత్యాలు సమపాళ్ళలో మేళవించి చక్కటి అనుభూతిని అందించాయి.

కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కట్టి, తరాలు మారిన తెరమరుగు కాకుండా రక్షణ ఛత్రంలా నిలబడటం, తెలుగు భాషను రక్షించుకోవడం, వ్యాప్తి చేయడం, భావితరాలకు అందించడమే టాంటెక్స్‌ లక్ష్యమని వెల్లడించారు. కొత్తగా భారత దేశాన్నుంచి వచ్చే వారే కాక, అమెరికాలోని ఇతర రాష్ట్రాలనుండి వచ్చే తెలుగు వారి సంఖ్య బాగా పెరుగుతున్న నేపథ్యంలో మన టాంటెక్స్‌ సంస్థ ఎంతో అభివృద్ధి సాధించే అవకాశం ఉందని అని తెలిపారు.  ఈ దీపావళి అందరి జీవితాలలో కొత్త వెలుగులు నింపాలని, కష్టాలు తొలగించాలని ఆకాక్షించారు. వచ్చిన వారికి షడ్రషోపేత తెలుగు భోజనంతోపాటు అందుబాటు ధరలలో నాణ్యమైన ధరలకు వస్త్రాభరణాలు, ఇంకా ఎన్నో ఉపయోగ కరమైన స్టాళ్లు టాంటెక్స్‌ వాళ్లు ఏర్పరిచారు. కమ్మని విందుతో పాటు చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు, విచ్చేసిన అందరిని అలరించాయి.

ఈ దీపావళి కార్యక్రమ ప్రెజెంటింగ్‌ పోషకులు టీపీఎడీ సంస్థకు మరియు కార్యక్రమ పోషకులైన రమణారెడ్డి, క్రిష్టపాటిి, డా.రాఘవేంద్ర ప్రసాద్‌ , ఆత్మచరణ్‌ రెడ్డి, అప్పారావు యార్లగడ్డ, సతీష్‌ మండువ, రమారావు ముళ్ళపూడి లకు జ్ఞాపికలు ప్రదానం చేసి టాంటెక్స్‌ సంస్థ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, తమ కృతజ్ఞతలు తెలియచేసారు.

చివరగా కార్యక్రమ సమన్వయకర్త పార్నపల్లి ఉమామహేష్‌ వందన సమర్పణ చేస్తూ సహాయం అందించిన సంస్థలకు, స్వచ్చంద సేవలకలకు, పోషకదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అర్ధరాత్రి కావస్తున్నా, చివరివరకు ఉండి టాంటెక్స్‌ దీపావలి సంబంరాలకు ఇంత ఘన విజయం చేకూర్చిన ప్రేక్షకులకు అధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Click here for Event Gallery

 

Tags :