ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

విప్లవాత్మకమార్పులు తెచ్చాం...జగన్

విప్లవాత్మకమార్పులు తెచ్చాం...జగన్

ఏడాది పాలనలోనే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగలిగామని ముఖ్యమంత్రి వైయస్‍ జగన్‍మోహన్‍రెడ్డి అన్నారు.  అట్టడుగు వర్గాలకు కూడా సంక్షేమ పథకాలు అందజేశాం. సంక్షేమం, వ్యవస్థలోకి మార్పులు తీసుకువచ్చే గవర్నెన్స్ దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో గొప్పగా చేయగలుగుతున్నామని చెప్పారు.

గ్రామ వలంటీర్ల విషయంలో కూడా దాదాపు 2.65 లక్షల మందిని నియమించామని, 50 ఇళ్లకు ఒక వలంటీర్‍ను నియమించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. రేషన్‍ బియ్యాన్ని ప్రతి గడపకు అందించేందుకు శ్రీకాకుళం జిల్లాలో పైలెట్‍ ప్రాజెక్టు చేపట్టాం. బియ్యం కూడా నేరుగా గడప గడపకూ చేరుస్తున్నారు. గతంలో పెన్షన్‍ రాని పరిస్థితి ఉండేది.. పెన్షన్‍ కోసం లంచాలు ఇవ్వాలి.. పడిగాపులు కాయాలి.. లీడర్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండేది. అలాంటి పరిస్థితిని రూపుమాపగలిగాం. ప్రతి నెల ఒకటవ తేదీన తెల్లవారుజామున ప్రతి అవ్వా,తాత ఇంటి దగ్గరకు వెళ్లి.. సూర్యోదయం కంటే ముందే ఇంటిదగ్గరకు వెళ్లి పెన్షన్‍ అందించేలాఏర్పాటు చేశామని చెప్పారు.

అమ్మ ఒడి పథకాన్ని తీసుకువచ్చి 43 లక్షల మంది తల్లులను గుర్తించి, 82 లక్షల మంది పిల్లలకు తద్వారా మేలు జరిగించే కార్యక్రమం చేశామని, ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంటి స్థలం ఇవ్వాలనే ఆరాటంతో అక్షరాలా దాదాపు 28 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు అర్హులను గుర్తించడం. వైయస్‍ఆర్‍ రైతు భరోసా కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మంది అన్నదాతలను గుర్తించడం.. వారికి తోడుగా ఉండే కార్యక్రమం చేయడం. చివరకు మత్స్యకార భరోసా పథకం ద్వారా వేట నిషేధ సమయంలో రూ.10 వేలు అందించేందుకు మత్స్యకారులను గుర్తించడం.. వైయస్‍ఆర్‍ వాహన మిత్ర పథకం ద్వారా స్వంతంగా ఆటోలు, ట్యాక్సీలు ఉన్నవారిని గుర్తించడం.. వారికి తోడుగా నిలబడే కార్యక్రమం దగ్గర నుంచి ఆరోగ్యశ్రీ కార్డులు, బియ్యం కార్డులు, వైయస్‍ఆర్‍ బీమా పథకం దగ్గర నుంచి మొదలుపెడితే.. ప్రతి అడుగులోనూ గ్రామ వలంటీర్‍, గ్రామ సెక్రటేరియట్‍ వ్యవస్థ నాలుగు అడుగులు ముందునిల్చిందని జగన్‍ చెప్పారు.

2 వేల జనాభా ఉన్న గ్రామంలో నాలుగు అడుగులు వేస్తే గ్రామ సెక్రటేరియట్‍, గ్రామ వలంటీర్‍ వ్యవస్థ కనిపిస్తుంది. ఇంకో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లిష్‍ మీడియం స్కూల్‍ కనిపిస్తుంది. గ్రామంలో ఒక ఇంగ్లిష్‍ మీడియం స్కూల్‍ తీసుకొచ్చే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది. నాడు-నేడు కార్యక్రమంతో స్కూళ్లలో పరిస్థితులు పూర్తిగా మార్చేస్తున్నాం. ఫర్నిచర్‍, బాత్‍రూమ్‍లు, బ్లాక్‍బోర్డులు, నీరు, ఆఖరికి పిల్లలు తినే భోజనం కూడా మెనూతో సహా పెడుతున్నాం. అదే వ్యక్తి నాలుగు అడుగులు ముందుకు వేస్తే వైయస్‍ఆర్‍ విలేజ్‍ క్లినిక్‍ రాబోతుంది. ఈ మార్చి కల్లా ప్రతి గ్రామ సచివాలయం పక్క విలేజ్‍ క్లినిక్‍ ఏర్పాటు చేయబోతున్నాం. 54 రకాల మందులు గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకువస్తున్నాం. ఏఎన్‍ఎం నర్సు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. ఆశ వర్కర్లు అక్కడే రిపోర్టు చేస్తారు. వైయస్‍ఆర్‍ విలేజ్‍ క్లినిక్‍ ఆరోగ్యశ్రీకి రెఫరల్‍ పాయింట్‍ అవుతుందన్నారు.

ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేస్తే రైతు భరోసా కేంద్రం. రైతులకు సంబంధించి సూచనలు, సలహాలు ఇచ్చే స్నేహితుడిగా ఆర్‍బీకే అక్కడే ఉంటుంది. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంటాయి. క్వాలిటీ నిర్ధారణ చేసిన తరువాతే గవర్నమెంట్‍ నేరుగా ఆర్‍బీకే ద్వారా విక్రయిస్తుంది. రైతుకు ఇంటి వద్దకు తీసుకెళ్లి ఇచ్చే పరిస్థితి ఉంటుంది. రైతు ఏ పంట వేయాలో.. ఆ పంటకు సంబంధించిన సూచనలు, సలహాలు ఆర్బీకే ఇస్తుంది. రైతు పంట వేసిన తరువాత ఈక్రాపింగ్‍ ద్వారా పంట రుణాలు ఇప్పించడం, ఇన్సూరెన్స్ రిజిస్ట్రేషన్‍ చేయించడం, కనీస గిట్టుబాటు ధర రాని పరిస్థితిలో రైతు ఉంటే.. ప్రతి రోజు మార్కెటింగ్‍ ఇంటెలిజెన్స్, దాని కోసం ఆర్బీకేలో అగ్రికల్చర్‍ అసిస్టెంట్‍, జాయింట్‍ కలెక్టర్‍ జిల్లాస్థాయిలో బాధ్యత వహిస్తాడు. మార్కెటింగ్‍ డిపార్టుమెంట్‍ బాధ్యత వహిస్తుంది. కనీస గిట్టుబాటు ధర అందకపోతే ఆర్‍బీకే కలగజేసుకొని ఆ రైతుకు తోడుగా నిలబడే కార్యక్రమం చేస్తుంది.

జనతా బజార్‍

వచ్చే సంవత్సరం చివరికల్లా జనతా బజార్‍ ఏర్పాటు చేస్తాం. రైతు పండించే ప్రతి పంట.. చేపలు, రొయ్యలు, కోడిగుడ్లు, పాలతో సహా గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రభుత్వమే ఏకంగా 30 శాతం కొనుగోలు చేసే విధంగా అడుగులు వేస్తూ జనతా బజార్లు తీసుకువస్తున్నాం.

మేనిఫెస్టో అనేది బైబిల్‍, ఖురాన్‍, భగవద్గీతగా భావిస్తానని ఇంతకు ముందే చెప్పా. ప్రతి గవర్నమెంట్‍ సెక్రటరీ దగ్గర, మంత్రుల దగ్గర, చివరకు నా చాంబర్‍లో గోడలకు మేనిఫెస్టో కనిపిస్తుంది. మొదటి సంవత్సరంలోనే 90 శాతం మేనిఫెస్టోలోని అంశాలు పూర్తి చేశాం. ఈ సంవత్సరానికి 99 శాతానికి వెళ్లిపోతాం.

మేనిఫెస్టోలోని హామీల అమలు....

08-07-2019 పెన్షన్‍ కానుక మొదలుపెట్టాం.
15-08-2019న వలంటీర్ల వ్యవస్థకు నాందిపలికాం.
02-10-2019న గ్రామ సచివాలయ వ్యవస్థకు నాంది పలికాం.
04-10-2019న వైయస్‍ఆర్‍ వాహన మిత్ర కార్యక్రమంతో ఆటో డ్రైవర్లకు, ట్యాక్సీ డ్రైవర్లకు తోడుగా నిలిచాం.
10-10-2019న వైయస్‍ఆర్‍ కంటి వెలుగుతో 69 లక్షల మంది పిల్లలకు ఉచితంగా కంటి పరీక్షలు చేయించాం. ట్రీట్‍మెంట్‍ ఇప్పించే కార్యక్రమం.
15-10-2019 వైయస్‍ఆర్‍ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మనం చెప్పింది రూ.12,500.. ఇస్తామన్నది మేనిఫెస్టోలో నాలుగు సంవత్సరాలు.. కానీ, రైతుకు ఇస్తుంది రూ.13500..  అమలు చేస్తుంది ఐదు సంవత్సరాలు. అందులో రైతు భరోసా రెండో దఫాకు శ్రీకారం చుట్టాం. దాదాపు 50 లక్షల మంది రైతులకు మేలు జరుగుతుంది.
17-10-2019న వైయస్‍ఆర్‍ నవోదయంతో ఎంఎస్‍ఎంఈ యూనిట్లకు లోన్స్ రీస్ట్రక్చరింగ్‍ చేసే కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యాం.
08-11-2019లో అగ్రిగోల్డ్ బాధితులకు దాదాపుగా రూ.264 కోట్లు ఇచ్చాం. పదివేల రూపాయలలోపు ఉన్నవారందరికీ రూ.264 కోట్లు ఇవ్వడం జరిగింది.
14-11-2019లో మన బడి నాడు-నేడుకు శ్రీకారం చుట్టాం. ఈరోజున పనులు జరుగుతున్నాయి. 45 వేల స్కూళ్లకు గానూ 15700 స్కూళ్లలో జూలై నాటికి రూపురేఖలు మారబోతున్నాయి. ప్రతి స్కూల్‍లో ఫర్నిచర్‍, బ్లాక్‍బోర్డు, బాత్‍రూమ్‍లు, పెయింటింగ్‍, కాంపౌండ్‍ వాల్‍ వస్తుంది. ప్రతి స్కూల్‍ ఇంగ్లిష్‍ మీడియంగా రూపురేఖలు మార్చుకోనుంది.

20-11-2019న వైయస్‍ఆర్‍ నవశకం సర్వేకు శ్రీకారం చుట్టాం. అర్హతను పెంచాం. ఇంతకు ముందు బియ్యం కార్డు కావాలంటే.. రూ.5 వేలు, పట్టణాల్లో రూ.6 వేలు నెలకు అర్హత ఉండేది. ఇవాళ రూ.10 వేలు గ్రామాల్లో, రూ.12 వేలు పట్టణాల్లో చేశాం. పూర్తిగా బియ్యం కార్డులు, పెన్షన్‍ కార్డులు, హౌసింగ్‍, ఆరోగ్యశ్రీ అన్నింటికి నవశకం ద్వారా గ్రామ వలంటీర్లతో సర్వే చేయించాం.

21-11-2019న మత్స్యకార భరోసాకు శ్రీకారం చుట్టాం.

1-12-2019న ఆరోగ్యశ్రీ రూపురేఖలు మార్చేశాం. గత ప్రభుత్వంలో రూ.680 కోట్ల బకాయిలు పెట్టి నెట్‍వర్క్ ఆస్పత్రులకు డబ్బులు ఇవ్వని పరిస్థితి. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవడానికి ఆస్పత్రులకు వెళ్తే ప్రభుత్వం అయితే ముట్టుకోం.. మాకు ఇవ్వాల్సిన బకాయిలు 8 నెలలు పెండింగ్‍లో ఉన్నాయని ప్రజలను వెనక్కి పంపించే పరిస్థితి ఉండేది. ఆరోగ్యశ్రీలో మే 18వ తేదీ వరకు ఎటువంటి బకాయిలు లేకుండా చెల్లించాం.

ఆరోగ్యశ్రీలో  వైయస్‍ఆర్‍ ఆరోగ్య ఆసరా అనే ఇంకో విప్లవాత్మక మార్పు తీసుకువచ్చాం.  ఎవరికైనా వైద్యం చేయించడమే కాదు.. ఇంట్లో విశ్రాంతి తీసుకునే సమయంలో నెలకు రూ. 5000 ఇచ్చి ఇంటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. దాదాపు 1.06 లక్షల మంది వైయస్‍ఆర్‍ ఆరోగ్య ఆసరా ద్వారా లబ్ధిపొందారు.

03-12-2019న వైయస్‍ఆర్‍ లా నేస్తం.
16-12-2019లో మహిళా భద్రత కోసం దిశ చట్టం తీసుకువచ్చాం. ఏకంగా రాష్ట్రంలో 18 దిశ పోలీస్‍ స్టేషన్‍లు ఏర్పాటు చేశాం. ఇద్దరు మహిళా ఉన్నతాధికారులను నియమించాం. వారిద్దరూ గొప్పగా చేస్తున్నారు.

21-12-2019న నా పుట్టిన రోజు నాడు వైయస్‍ఆర్‍ నేతన్న నేస్తం అని ప్రతి చేనేతకు తోడుగా ఉన్నాం. ఇంతకు ముందు మామూలుగా రూ.200 కోట్లు ఐదేళ్లకు అందే పరిస్థితి లేదు. కానీ, ఇవాళ సంవత్సరానికి రూ.200 కోట్లు అందజేస్తున్నాం. ఏకంగా 81 లక్షల మంది చేనేతలకు రూ.24 వేలు చేతుల్లో పెడుతున్నాం

03-01-2020న పశ్చిమగోదావరి జిల్లాలో ఆరోగ్యశ్రీ పైలెట్‍ ప్రాజెక్టు మొదలుపెట్టాం. 2000 రోగాలతో పైలెట్‍ ప్రాజెక్టు చేపట్టి.. రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ పరిధిని 1200 రోగాలకు పెంచాం. ఒక్కొక్క జిల్లా పెంచుకుంటూ పోవాలి.. కానీ కోవిడ్‍ వచ్చింది కాబట్టి ఆగాం. ప్రతి జిల్లాలో 2000 రోగాలతో ఆరోగ్యశ్రీ అమలుకు తేదీలు ఇవ్వాలని హెల్త్ సెక్రటరీ జవహర్‍రెడ్డిని అడిగాను.

09-1-2020న అమ్మఒడి ద్వారా 43 లక్షల మంది తల్లులు.. 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగింది. పిల్లలను బడికి పంపిస్తే చాలు.. బడికి పంపించినందుకు మేనమామ తోడుగా ఉంటాడని ప్రతి పిల్లాడికి భరోసా ఇస్తూ.. రూ.15 వేలు తల్లుల చేతికి ఇవ్వడం జరిగింది

18-02-2020న వైయస్‍ఆర్‍ కంటి వెలుగు అవ్వాతాతలకు మొదలుపెట్టాం. ఇంకా జరుగుతుంది. కోవిడ్‍ సమయంలో నిలిపివేశాం. మళ్లీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం.

24-2-2020న పిల్లలను పైచదువులు చదివించేందుకు ఇబ్బంది పడకూడదని జగనన్న వసతి దీవెన అని దాదాపు 15 లక్షల మంది పిల్లల తల్లులకు తల్లికి మొదటి దఫా రూ.10 వేలు ఇచ్చాం. ఇంజనీరింగ్‍ చదివే వారికి రూ.20 వేలు దాంట్లో రూ.10 వేలు ఇచ్చాం. పాలిటెక్నిక్‍ చదువుతున్నవారికి రూ.15 వేలు దాంట్లో రూ.7500 ప్రతి తల్లికి ఇవ్వడం జరిగింది.

2020-21 సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్‍ విడుదల చేశాం. ఏ నెల ఏ పథకం అమలు చేయబోతున్నాం. ఏ నెల ఎవరికి మేలు జరగబోతుందని ప్రజలకు తోడుగా ఉండేందుకు క్యాలెండర్‍ విడుదల చేశాం.
20-04-2020న పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.14 వందల కోట్లు ఇవ్వగలిగాం.

28-04-2020న విద్యా దీవెన కింద రూ.4 వేల కోట్లు విడుదల చేశాం. ఇంజనీరింగ్‍,  డిగ్రీ చదువుకునే పిల్లాడికి ఫీజురీయింబర్స్మెంట్‍ ఇవ్వకుండా గత ప్రభుత్వం పెండింగ్‍ పెడితే.. రూ.1880 కోట్ల బకాయిలు తీర్చుతూ.. మొత్తం మీద రూ.4300 కోట్లు నేరుగా వైయస్‍ఆర్‍ విద్యా దీవెన కింద మొదట సారిగా ఫీజురీయింబర్స్మెంట్‍ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదేమో.. మార్చి వరకు ఒక్క రూపాయి కూడా కాలేజీలకు బకాయిలు లేకుండా చెల్లించాం. వచ్చే త్క్రెమాసికం నుంచి తల్లుల చేతులకే డబ్బులు ఇచ్చి వారి చేతనే ఫీజులు కట్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

06-05-2020న మత్స్యకార భరోసా రెండో దఫా కంప్లీట్‍ చేశాం.
15-05-2020న రైతు భరోసా రెండో దఫా కూడా మొదలుపెట్టాం. రైతులకు రూ.7500 ఇచ్చే కార్యక్రమం అయిపోయింది.

22-05-2020న ఎంఎస్‍ఎంఈలకు సంబంధించి రీస్టార్ట్ అనే కార్యక్రమం ద్వారా గత ప్రభుత్వ బకాయిలు రూ.968 కోట్లు కూడా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గత ప్రభుత్వ బకాయిలు మన ప్రభుత్వం ఇస్తుంది. మేలో రూ.450 కోట్లతో మొదటి దఫా చెల్లించాం. ఎంఎస్‍ఎంఈ రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా కంపెనీలకు మేలు జరిగేలా మూడు నెలల పాటు ఫిక్స్డ్‍ చార్జీలను రద్దు చేశాం.

మే 26న అర్చకులు, పాస్టర్లు, మౌజమ్‍లకు రూ. 5 వేల చొప్పున సాయం. మే 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు ప్రారంభం.
జూన్‍ 4వ తేదీన వైయస్‍ఆర్‍ వాహన మిత్ర ఇస్తున్నాం. సొంత ఆటో, క్యాబ్‍ ఉన్నవారికి వాహన మిత్ర ద్వారా రూ.10 వేల సాయం.
జూన్‍ 10వ తేదీన షాపు ఉన్న నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లు రూ. 10 వేల సాయం.
జూన్‍ 17న మగ్గమున్న చేనేత కుటుంబాలకు వైయస్‍ఆర్‍ నేతన్న హస్తం. ఆప్కోకు సంబంధించిన గత ప్రభుత్వ బకాయిలను, మాస్క్ల తయారీకి మనం తీసుకున్న క్లాత్‍కు సంబంధించిన బకాయిలు కూడా జూన్‍ 17నే చెల్లిస్తాం.
జూన్‍ 24న వైయస్‍ఆర్‍ కాపు నేస్తం.
జూన్‍ 29న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించి రెండో విడత రూ.450 కోట్లు విడుదల.
జూలై 1న 1060 కొత్త 104, 108 అంబులెన్స్లు ప్రారంభం.
జూలై 8న నాన్న పుట్టిన రోజు సందర్భంగా దాదాపు 28 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ.
జూలై 29న రైతులకు వడ్డీలేని రుణాలు.
ఆగస్టు 3న వైయస్‍ఆర్‍ విద్యా కానుక. పిల్లలకు యూనిఫాం, పుస్తకాలు, బ్యాగ్‍, బెల్టు, షూ, సాక్స్లు ఇస్తాం.
ఆగస్టు 9న ఆదివాసీ దినోత్సవం రోజు గిరిజనులకు ఆర్‍ఓఎఫ్‍ఆర్‍ పట్టాల పంపిణీ.
ఆగస్టు 12న వైయస్‍ఆర్‍ చేయూత.
ఆగస్టు 19న వైయస్‍ఆర్‍ వసతి దీవెన.
ఆగస్టు 26న 15 లక్షల వైయస్‍ఆర్‍ హౌసింగ్‍ ఇళ్ల నిర్మాణం ప్రారంభం.
సెప్టెంబర్‍ 11న వైయస్‍ఆర్‍ ఆసరా.. పొదుపు సంఘాల్లో ఉన్న ప్రతి అక్కా.. ప్రతి చెల్లెమ్మకు మేలు చేయడం కోసం.. మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నాలుగు దఫాల్లో అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉంటామని చెప్పాం.
సెప్టెంబర్‍ 25న వైయస్‍ఆర్‍ విద్యా దీవెన.
అక్టోబర్‍లో రెండో విడత రైతు భరోసా, ప్రతి రైతు కుటుంబానికి రూ.4 వేలు.
అదే అక్టోబర్‍లో జగనన్న తోడు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. తోపుడుబండ్లు, ఫుట్‍పాత్‍లపై వ్యాపారం చేసుకునేవారికి గుర్తింపు కార్డు ఇచ్చి ప్రతి చిరు వ్యాపారికి సున్నా వడ్డీకే రూ. 10 వేల రుణం. 10 లక్షల మంది చిరు వ్యాపారులకు రుణాలు మంజూరు చేయనున్నాం.
నవంబర్‍లో మళ్లీ విద్యా దీవెన పథకానికి శ్రీకారం చుట్టనున్నాం.
డిసెంబర్‍లో అగ్రిగోల్డ్ బాధితులకు సాయం.
2021 జనవరి 9న రెండో విడత అమ్మ ఒడి ప్రారంభం.
2021 జనవరిలోనే చివరి విడత రైతు భరోసా, రూ. 2 వేలు.
2021 ఫిబ్రవరి విద్యా దీవెన మూడో త్రైమాసం, రెండో దఫా వసతి దీవెన.
2021 మార్చిలో పొదుపు సంఘాలకు వడ్డీలేని రుణాలు.

 

Tags :