ASBL NSL Infratech

ఎపిలో చంద్రబాబా...?జగనా?

ఎపిలో చంద్రబాబా...?జగనా?

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల పాపులర్‌ ఓటు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి లభిస్తుందా? లేక ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరిస్తుందా అన్న విషయమై ఎవరికివారు తమ అంచనాలను వేసుకుంటున్నారు. గతంలో జరిగిన ఎన్నికల కన్నా ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా కనిపిస్తోంది. దానికి తోడు గత ఎన్నికలకు, ప్రస్తుత ఎన్నికలకు ఎంతో తేడా ఉంది. ఈ ఎన్నికలు కచ్చితంగా నవ్యాంధ్రప్రదేశ్‌ దశ, దిశలకు మార్గనిర్దేశనం చేస్తాయి. రాష్ట్ర విభజన తర్వాత జరిగే తొలి ఎన్నికలివి. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజనతో పాటు ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆంధ్రా ఓటర్లు అనుభవానికి పట్టం కట్టారు. బీజేపీ పొత్తుతో టీడీపీ అప్పుడు వైకాపాకు అడ్డుకట్ట వేసింది. చంద్రబాబు ఆ ఎన్నికల్లో బీజేపీతో దోస్తీ లేకుండా ఎన్నికలకు వెళ్లినా లేదా వామపక్ష పార్టీలతో కలిసి పోటీచేసినా ఫలితాలు మరోలా ఉండేవి.

చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ అనుభవం, పరిపాలనా దక్షత, హైటెక్‌ సిటీ వంటి నిర్మాణాలు, అనేక ప్రాజెక్టులను తెస్తారనే నమ్మకంతో ప్రజలు అప్పుడు గెలిపించారు. అప్పుడు బాబుకు మోదీ పాపులారిటీ తోడైంది. జాతీయభావాలు కలిగిన వారు, మధ్యతరగతి వారు చంద్రబాబుకు అండగా నిలిచారు. వైకాపా దాదాపు గెలిచినట్లే గెలిచి ఓటమి చెందింది. వైకాపాకు వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇద్దామని జనం భావించడం వల్ల ఆ పార్టీ గట్టెక్కలేదు. రాష్ట్ర విభజనతో ప్రజల సెంటిమెంట్‌ను గాయపరిచిన కాంగ్రెస్‌కు చావుదెబ్బ తప్పలేదు. గత ఐదేళ్లలో మెజార్టీ ప్రజల మత విశ్వాసాలు, సున్నితమైన సెంటిమెంట్లను వైకాపా బాగా వంటబట్టించుకుని పాత ముద్రను చెరిపేసుకుంది.

నూతన రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పన చంద్రబాబు వల్ల సాధ్యమవుతుందని జనం భావించారు. రైతులకు రుణమాఫీ హామీ ఇవ్వకపోయినా బాబు గెలిచి ఉండేవారు. అంతకుముందు వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమి చెందిన టీడీపీకి 2014 ఎన్నికల్లో గెలుపు అవసరమైంది. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పార్టీకి రాబోయే ఎన్నికలు జీవన్మరణ సమస్యే. మరోవైపు అధికారం కోసం ఎదురుచూస్తున్న వైకాపాకు సైతం ఈ ఎన్నికలు చాలా ముఖ్యం. 1995 నుంచి 2004 వరకు ఉమ్మడి ఏపీ సీఎంగా బాబు తీసుకున్న నిర్ణయాలు, వేసిన అడుగులు విశ్లేషిస్తే మధ్యతరగతి, సంపన్న వర్గాలు ఆయన పాలనను ఆహ్వానించాయి.

2004 ఎన్నికల్లో ప్రజలు టీడీపీని చిత్తుగా ఓడించారు. ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభమైతే, వాటికి బీజం వేసింది చంద్రబాబు. సంక్షేమ పథకాలను ఆమడదూరం పెట్టారు. మంచో చెడో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల వల్ల హైదరాబాద్‌ ముఖ చిత్రం మారిపోయింది. చంద్రబాబు ఒక ముఖ్యమంత్రి కాదు, ఒక చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అని పారిశ్రామిక రంగం ఆకాశానికెత్తేసింది. ఈ రోజు హైదరాబాద్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రోడ్డు, శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ ప్రణాళికలు చంద్రబాబు హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ అభివద్ధిని దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్లారు. సంస్కరణలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రముఖ కన్సెల్టెన్సీ సంస్థ మెకెన్సీని చంద్రబాబు నియమించారు.

అప్పట్లో చంద్రబాబు చాలా దూకుడుగా ఉండేవారు. ఉచిత కరెంటు ఇవ్వలేమని సంక్షేమ పథకాలు అమలు చేయలేమని  కరాఖండీగా చెప్పేశారు. దీంతో చంద్రబాబుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమైంది. దానికితోడు ఆయన చుట్టూ ఉండే సంపన్న, పారిశ్రామిక వర్గాలను చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా మలుచుకున్నారు. ఉచిత కరెంటుతో పాటు సామాన్యులకు ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్‌మెంట్‌ వంటి అనేక పథకాలతో సమాజంలో అన్నివర్గాల పాపులర్‌ ఓటు 2004, 2009లో కాంగ్రెస్‌కు దక్కేలా చేసి అధికారాన్ని దక్కించుకున్నారు. 1999లో బీజేపీ పొత్తుతో డివిడెండ్లు రాబట్టి నెగ్గిన చంద్రబాబు, 2004 ఎన్నికల్లో అభివద్ధి మంత్రంతో జనంలోకి వెళ్లినా ఓటమి చెందడానికి కారణం సంక్షేమ పథకాలను అమలు చేయకపోవడమే.   ఉచిత విద్యుత్‌ అసాధ్యమని సంస్కరణలు, అభివద్ధి ప్రభావంతో ప్రకటించిన చంద్రబాబు పదేళ్ల ప్రతిపక్షనాయకుడిగా అనేక పాఠాలు నేర్చుకుని చివరకు మళ్లీ- 'ముందు సంక్షేమం.. ఆ తర్వాత అభివద్ధి' అనే నినాదాన్ని అందుకున్నారు. అధికారం కోసం ఆరాట పడుతున్న వైకాపా ఇంకా సంక్షేమ మంత్రాన్ని పఠిస్తోంది. 2004లో హైదరాబాద్‌లో పరిస్థితిని 2019లో చంద్రబాబు అమరావతిలో ఎదుర్కొంటున్నారు. అప్పటికీ, ఇప్పటికీ తేడా ఒక్కటే. అప్పుడు బీజేపీతో కలిసి ఆయన ఎన్నికలకు వెళ్లారు. ఈసారి ఒంటరిపోరుకు సిద్ధమవుతున్నారు.

మరోవైపు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ కూడా సంక్షేమ పథకాలపై అనేక వరాలను ఎన్నికలకు ముందే ప్రకటించారు. వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ వంటి సంక్షేమ కార్యక్రమాలను మరింతమందికి దక్కేలా చూస్తామని చెప్పడం, నిరుద్యోగులకు, రైతులకు ఇతరులకు అవసరమైన హామిలు ఇవ్వడం చేశారు.

ఇలా చంద్రబాబు, జగన్‌ పోటాపోటీ హామీల వల్ల ఈసారి ప్రజలు ఎవరిని గెలిపిస్తారోనని అందరూ ఎదురు చూస్తున్నారు.

 

Tags :