ASBL NSL Infratech

యార్లగడ్డకు ఆటా, టాటా జీవిత సాఫల్య పురస్కారం

యార్లగడ్డకు ఆటా, టాటా జీవిత సాఫల్య పురస్కారం

కేంద్రీయ హిందీ సమితీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు అమెరికన్‌ తెలుగు సంఘం (ఆటా), తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌ (టాటా)లు కలిసి జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రకటించాయి. మే 31 నుండి జూన్‌ 2 వరకు డల్లాస్‌లో రెండు సంస్థలు ఏర్పాటు చేసిన సదస్సులో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కి ఈ పురస్కారం అందజేయనున్నట్టు ఆటా అధ్యక్షుడు డా.రుణాకర్‌ రెడ్డి, టాటా అధ్యక్షుడు డా.హరినాథ్‌ పొలిచెర్ల ప్రకటించారు.

ఉభయ భాషల్లో పీహెచ్‌డీ చేసి, పద్మభూషణ్‌, పద్మశ్రీ, కేంద్ర సాహిత్య అకాడమీతో పాటు అనేక పురస్కారాలు పొంది, 60కి పైగా పుస్తకాలు రచించిన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌కు ఈ సందర్బంగా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేయాలని నిర్ణయించినట్లు రెండు సంఘాలు తెలిపారు. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ను ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు రెండింటి సాంస్కృతిక వారధిగా, ఆదర్శంగా భావిస్తున్నట్లు ప్రకటించాయి. డల్లాస్‌లో ఉభయ సంఘాలు కలిసి నిర్వహిస్తున్న ఈ సదస్సుకు చారిత్రక ప్రాధాన్యత ఉన్నదని నిర్వాహకులు పేర్కొన్నారు.

1990లో ఏర్పడిన ఆటా, 2015లో ఏర్పడిన టాటాలు మొట్టమొదటిసారిగా సంయుక్తంగా ఈ సదస్సు నిర్వహించడం ఇదే మొదటిసారి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 4500 మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, డాక్టర్లు కళాకారులు, యువకులు ఈ సదస్సులో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.

 

Tags :