ASBL NSL Infratech

ఘనంగా ఆటా హెల్త్‌ సెమినార్‌

ఘనంగా ఆటా హెల్త్‌ సెమినార్‌

అమెరికా తెలుగు సంఘం (ఆటా), కాంటినెంటల్‌ హాస్పిటల్స్‌ సంయుక్తంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఆటా హెల్త్‌ సెమినార్‌ కు మంచి స్పందన వచ్చింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖ వైద్యులు ఈ సెమినార్‌ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన ఇండియన్‌ గవర్నమెంట్‌ అంబాసిడర్‌ డా. చింతపల్లి రాజశేఖర్‌ (ఐఎఫ్‌ఎస్‌) మాట్లాడుతూ అమెరికాలో తెలుగువారికోసం పోరాడుతున్న సంస్థగా ఆటా మొదటి స్థానంలో నిలుస్తుంది అని అన్నారు. ఆటా ఆధ్వర్యంలో వైద్యపరంగా ఇలాంటి సెమినార్‌ను నిర్వహించడం అభినందనీయం అన్నారు. అలాగే అమెరికాలో స్థిరపడినప్పటికీ, తమను పెంచి పెద్ద చేసిన తెలుగు రాష్ట్రాలలో సేవ కార్యక్రమాలతో తమ వంతు పాత్ర పోషించడం మంచి విషయం అన్నారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆటా పాలుపంచుకొని అమెరికాకు వెళ్ళే విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. 

ఆటా అధ్యక్షురాలు మధు బొమ్మినేని మాట్లాడుతూ పౌరుల ప్రాథమిక హక్కు వైద్యం, ఆరోగ్యమని అన్నారు.  ఆటా ప్రాధాన్యతల్లో వైద్యం, ఆరోగ్యమే ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు. మా ఆటా సేవ కార్యక్రమాల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న కార్యక్రమాల్లో వైద్యం, ఆరోగ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.

ఆటా వేడుకల చైర్‌, ఎలెక్ట్‌ ప్రెసిడెంట్‌ జయంత్‌ చల్లా మాట్లాడుతూ ఆటా వేడుకల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించామని, అలాగే హైదరాబాద్‌లో వైద్యం విషయమై ఈ సెమినార్‌ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ సెమినార్‌ ను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. 2024 జూన్‌ 7,8, 9 తేదీలలో అట్లాంటాలో జరిగే కాన్ఫరెన్స్‌ ను విజయవంతం చేయాలని కోరారు.   

కాంటిమెంటల్‌ హాస్పిటల్‌ చైర్మెన్‌ డా. గురునాథరెడ్డి మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా ఉంటేనే రాష్ట్రం, దేశం ఆరోగ్యంగా ఉంటుంది అన్నారు. ఆటాతో ఈ కార్యక్రమం చేయడం తమకు గర్వంగా ఉందన్నారు. ఈ సెమినార్‌ లో మానవుల్లో ప్రస్తుతం వస్తున్న గుండె వైద్య సమస్యలపై అమెరికా అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజిషియన్స్‌ ట్రెజరర్‌ శ్రీనీ గంగాసాని, గ్యాష్ట్రో వైద్య సమస్యలపై డా.గురు.ఎన్‌. రెడ్డి, అంకాలజి వైద్య సమస్యలపై డా. ఎవిఎస్‌ సురేష్‌, క్యాన్సర్‌ వైద్య సమస్యలపై డా.నోరి దత్తాత్రేయులు, షుగర్‌, బీపీ వైద్య సమస్యలపై డా. సునీల్‌ ఏపురి, ఆర్థోపెడిక్‌ సమస్యలపై డా. శ్రీనివాస్‌ గడ్డికొప్పుల, మానసిక వైద్య సమస్యలపై డా.బి ఆనంద్‌, ఆర్థరైటిస్‌ వైద్య సమస్యలపై డా. సునీత కళ్యాణి లు ప్రసంగించారు. ఈ సెమినార్‌కు పలువురు హాజరయ్యారు. 

ఈ  కార్యక్రమంలో ఆటా వేడుకల కో చైర్‌ వేణు సంకినేని, ఆటా ట్రెజరర్‌ సతీష్‌ రెడ్డి, ఆటా సెక్రెటరీ రామకృష్ణ రెడ్డి అల, ఆటా పాస్ట్‌ ప్రెసిడెంట్‌ పరమేష్‌ భీమ్‌ రెడ్డి, జాయింట్‌ ట్రెజరర్‌ రవీందర్‌ గూడూరు, ఆటా కన్వెన్షన్‌ కన్వీనర్‌ కిరణ్‌ రెడ్డి పాశం, ఆటా కాన్ఫరెన్స్‌ నేషనల్‌ కో ఆర్డినేటర్‌ సాయి సుదీని, మీడియా కో ఆర్డినేటర్‌ ఈశ్వర్‌ బండా, వైద్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

 

Click here for Photogallery

 

Tags :