ASBL NSL Infratech

రివ్యూ : 'విరాటపర్వం' ఓ గొప్ప ప్రేమ కావ్యం

రివ్యూ : 'విరాటపర్వం'  ఓ గొప్ప ప్రేమ కావ్యం

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 3/5
నిర్మాణ సంస్థలు:శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌, సురేశ్‌ ప్రొడక్షన్స్‌
నటీనటులు : సాయి పల్లవి, రానా దగ్గుబాటి, ప్రియమణి, నందితాదాస్‌, జరీనా వాహబ్‌, ఈశ్వరీరావు, నవీన్‌ చంద్ర తదితరులు
సంగీతం : సురేశ్‌ బొబ్బిలి, సినిమాటోగ్రఫీ : దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌
ఎడిటర్‌ : శ్రీకర్‌ ప్రసాద్‌, నిర్మాతలు: సుధాకర్ చెరుకూరి, సురేశ్‌ బాబు
దర్శకత్వం : వేణు ఊడుగుల
విడుదల తేది : 17.06.2022

టాలీవుడ్‌ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘విరాటపర్వం’ ఒకటి. రానా, సాయిపల్లవి జంటగా నటించడం, చాలా కాలం తరువాత  నక్సలిజం నేపథ్యంలో ఓ ప్రేమ కథా చిత్రం వస్తుండడంతో సినీ ప్రేమికులకు ‘విరాటపర్వం’పై ఆసక్తి పెరిగింది. ఇక ఇటీవల విడుదలైన పాటలు, ట్రైలర్‌ ఆ ఆసక్తిని మరింత పెంచేశాయి. దర్శకుడు  వేణు ఊడుగుల రచన, దర్శకత్వ ప్రతిభ ఈపాటికే అందరికీ తెలుసు. మరోసారి తనదైన శైలిలో వేణు ఊడుగుల లోతైన, సున్నితమైన అంశాన్ని ఎంచుకుని విరాటపర్వం అనే సినిమాను తెరకెక్కించాడు. గతేడాదిలో విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ.. ఎట్టకేలకు ఈ రోజు  శుక్రవారం(జూన్‌ 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య థియేటర్‌లో విడుదలైన ఈ మూవీని ప్రేక్షకులు ఏమేరకు అలరించిందో రివ్యూలో చూద్దాం.

కథ:

టాలీవుడ్‌లో నక్సలిజం నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయి. వాటిల్లో మావోయిస్టులు, రాజకీయ నాయకుల గురించి చెప్పారు. కానీ నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో ఓ అందమైన లవ్‌స్టోరీని ఆవిష్కరించడం విరాటపర్వం తొలి చిత్రమౌతుంది. 1992లో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా సరళ విషాద కథ గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఆ సరళనే వెన్నెలగా మలిచి.. ప్రేమ కథను జోడించి.. తన శైలిలో ఈ కథను ఎంతో స్వచ్చంగా, నిజాయితీగా చెప్పేందుకు ప్రయత్నించారు.  విరాటపర్వం కథ 1990వ ప్రాంతంలో జరుగుతుంది. వెన్నెల (సాయి పల్లవి) కామ్రెడ్ అరణ్య అలియాస్ రవన్న (రానా) రచనలకు ప్రభావితం అవుతుంది. ప్రేమను పెంచుకుంటుంది. కృష్టుడిపై మీరాబాయ్ పెంచుకున్న ప్రేమలా అరణ్య మీద వెన్నెల ప్రేమను పెంచుకుంటుంది. అతని కోసం కన్నవారిని వదిలి వెళ్తుంది. . అయితే దళనాయకుడైన రవన్నను పట్టుకునేందుకు పోలీసులు కూడా తీవ్రంగా గాలిస్తుంటారు. అలాంటి సమయంలోనే వెన్నెల కూడా ఇళ్లు వదిలి రవన్న కోసం ఊరురా తిరుగుతుంది. రవన్న చేరుకునేందుకు పడరాని కష్టాలు పడుతుంది. చివరకు దళంలో చేరుతుంది. అయితే ఆ సమయంలోనే దళంలో కోవర్టులున్నారని తెలుస్తుంది. చివరకు వెన్నెల మీద అనుమానం వస్తుంది. వెన్నెలను దళసభ్యులే అంతం చేస్తారు. అదే విరాటపర్వం కథ..

నటీనటుల హావభావాలు:

వెన్నెల పాత్రని రాసుకున్నప్పుడే సాయి పల్లవి ఊహించుకున్నానని సినిమా ప్రమోషన్స్‌లో దర్శకుడు వేణు చెప్పాడు. ఆయన ఊహకు పదిరెట్లు ఎక్కువగానే సాయి పల్లవి నటించిందని చెప్పొచ్చు. ఎమోషనల్‌ సీన్స్‌లో కంటతడి పెట్టిస్తే.. యాక్షన్‌ సీన్స్‌లో విజిల్స్‌ వేయించింది. అచ్చం తెలంగాణ పల్లెటూరి అమ్మాయిగా సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఇక కామ్రేడ్‌ రవన్న పాత్రలో రానా ఒదిగిపోయాడు. తెరపై నిజమైన దళనాయకుడిగా కనిపించాడు. తెరపై చాలా పాత్రలు ఉన్నప్పటికీ.. వెన్నెల, రవన్న క్యారెక్టర్లకే ప్రేక్షకులు కనెక్ట్‌ అవుతారు. ఇక దళ సభ్యులు భారతక్కగా ప్రియమణి, రఘన్నగా నవీన్‌ చంద్ర  శకుంతల నందితా దాస్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు.  ప్రీక్లైమాక్స్‌లో ప్రియమణి, నవీన్‌ చంద్రల కారణంగానే కథ మలుపు తిరుగుతుంది. వెన్నెల తల్లిదండ్రులుగా సాయిచంద్‌, ఈశ్వరీరావు మరోసారి తమ అనుభవాన్ని తెరపై చూపించారు. వారి పాత్రల నిడివి తక్కువే అయినా.. గుర్తుండిపోతాయి.రాహుల్‌ రామకృష్ణ, నివేదిత పేతురాజ్‌లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతికవర్గం పనితీరు:

దర్శకుడు వేణు మాత్రం ఇక్కడ ఆ సున్నితమైన అంశాన్ని ఎంతో హృద్యంగా, గుండె బరువెక్కేలా చిత్రీకరించాడు. సరైన జస్టిఫికేషన్ ఇచ్చినట్టు అనిపిస్తుంది. ఓ అందమైన ప్రేమ కథను అల్లేశాడు. ఈ సినిమా విషయంలో ఎంతో లిబర్టీ తీసుకున్నట్టు కనిపిస్తుంది.దర్శకుడు స్వతహా రచయిత కావడంతో మాటలు తూటాల్లా పేలాయి. ‘మా ఊళ్ళల్ల ఆడవాళ్లపై అత్యాచారాలు, మానభంగాలు జరిగినప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చారు సార్.. అన్నలు వచ్చారు సార్.. నోరు లేని సమాజానికి నోరు అందించారు సార్’అని రాహుల్‌ రామకృష్ణతో చెప్పించి.. అప్పటి సామాజిక పరిస్థితులు ఎలా ఉండేవో చూపించాడు. ‘మీరాభాయి కృష్ణుడు కోసం క‌న్న‌వాళ్ల‌ను, క‌ట్టుకున్న‌వాళ్ల‌ను వ‌దిలేసి ఎలా వెళ్లిపోయిందో! అలానే నేను నీకోసం వ‌స్తున్నాను’ అంటూ వెన్నెలతో చెప్పించి రవన్నపై ఆమెకు ఎంత ప్రేమ ఉందో ప్రపంచానికి తెలియజేశాడు. ‘తుపాకీ గొట్టంలో శాంతి లేదు... ఆడపిల్ల ప్రేమలో ఉంది’, 'చిన్న ఎవడు పెద్ద ఎవడు రాజ్యమేలే రాజు ఎవ్వడు.. సామ్యవాద పాలన స్థాపించగ ఎళ్లినాడు’, ‘రక్తపాతం లేనిదెప్పుడు చెపు.. మనిషి పుట్టుకలోనే రక్తపాతం ఉంది’, నీ రాతల్లో నేను లేకపోవచ్చు కానీ నీ తల రాతల్లో కచ్చితంగా నేనే ఉన్నా’ లాంటి డైలాగ్స్‌ బాగా ఆకట్టుకుంటాయి.  ఓ స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు దర్శకుడు వేణు ఈ సినిమాకు మరో ప్రధాన బలం సురేశ్‌ బొబ్బిలి సంగీతం. పాటలు తెచ్చిపెట్టినట్లు కాకుండా.. కథతో పాటు వస్తాయి. నేపథ్య సంగీతం అయితే అద్భుతంగా ఇచ్చాడు. దివాకర్‌మణి, డానీ సాంచెజ్‌ లోపెజ్‌ సినిమాటోగ్రఫి చాలా బాగుంది.శ్రీకర్‌ ప్రసాద్‌ ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.   . 

విశ్లేషణ:

"ఒక యుద్ధం ఎన్నో ప్రాణాలు తీస్తుంది.. కానీ అదే యుద్ధం నాకు ప్రాణం పోసింది.. నేను వెన్నెల.. ఇది నా కథ" అంటూ సినిమా స్టార్టింగ్‌ నుంచే ప్రేక్షకులను వెన్నెల లవ్‌స్టోరీలోకి తీసుకెళ్లాడు. ఫస్టాఫ్‌లో ఎక్కువ భాగం వెన్నెల చుట్టే తిరుగుతుంది. వెన్నెల కుటుంబ నేపథ్యం, పెరిగిన విధానం, విప్లవ సాహిత్యానికి ముగ్థురాలై రవన్నతో ప్రేమలో పడడం..అతని కోసం కన్నవారిని వదిలి వెల్లడం.. చివరకు పోలీసుల చేతికి దొరకడంతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ప్రేమకు, విప్లవానికి సంఘర్షణ ఆకట్టుకుంటుంది. ప్రేమతో వెన్నెల విప్లవంలోకి అడుగుపెడుతుంది. అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇక చివర్లో క్లైమాక్స్ మాత్రం అందరి హృదయాలను తడుముతుంది. .  ఇక నాటి తెలంగాణ పరిస్థితులను కళ్లకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు. పోలీసుల ఝుళుం, నక్సలైట్ల ప్రభావం ఎలా ఉండేదో చూపించాడు. అన్నల పేరిట జరిగిన హత్యాకాండాలు ఎలా ఉంటాయో దర్శకుడు కళ్లకు కట్టినట్టు చూపించాడు. బూటకపు ఎన్ కౌంటర్లు ఎలా ఉంటాయో చూపించాడు. పోలీసుల నుంచి రవన్న దళాన్ని తప్పించేందుకు వెన్నెల చేసిన సాహసం ఫస్టాఫ్‌కే హైలెట్‌. ఫస్టాప్‌లో కొన్ని సీన్స్‌ రిపీటెడ్‌గా అనిపించినా.. సాయి పల్లవి తనదైన నటనతో బోర్‌ కొట్టించకుండా చేసింది. ఇంటర్వెల్‌ సీన్‌ కూడా బాగుంటుంది.మొత్తానికి దర్శకుడు తాను చెప్పినట్టుగానే.. ఓ నిజాయితీ గల కథను.. అంతే నిజాయితీగా తెరకెక్కించాడు. స్వచ్చమైన ప్రేమ కథను.. అంతే స్వచ్చంగా తెరకెక్కించాడు. విరాటపర్వం అనేది ఓ గొప్ప ప్రేమ కావ్యంగా సెల్యులాయిడ్ లో నిలుస్తుంది. 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :