ఆ దేశంతో ఘర్షణ పడం.. పోటీ పడతాం : బైడెన్

ఆ దేశంతో ఘర్షణ పడం.. పోటీ పడతాం :  బైడెన్

చైనాతో ఘర్షణ పడాలనే ఉద్దేశం తమకు ఎంత మాత్రం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ స్పష్టం చేశారు. తూర్పు ఆసియా సదస్సులో బైడెన్‌ మాట్లాడారు. ఆ దేశంతో పోటీ పడాలని మాత్రమే తాము కోరుకుంటున్నామని, ఉద్రికత్తలు నివారించటానికి తమవైపు నుంచి సమాచార వ్యవస్థలన్నింటిని తెరిచే ఉంచుతామని అన్నారు.  ఇండోనేసియాలో జరిగే జి-20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో బైడెన్‌ భేటీ కానున్నారు. ఈ సమావేశం కొన్ని గంటల పాటు జరగొచ్చని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ తెలిపారు. అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత జిన్‌పింగ్‌ను నేరుగా కలవడం బైడెన్‌కు ఇదే తొలిసారి. బైడెన్‌ మీడియాతో మాట్లాడుతూ జిన్‌పింగ్‌తో తాను ఎప్పుడూ సూటిగానే చర్చలు జరిపానని తెలిపారు. అతను నాకు బాగా తెలుసు. నా గురించి కూడా ఆయనకు తెలుసు. అయితే లక్ష్మణ రేఖలు ఎక్కడ ఉన్నాయో, ఇరు దేశాలకు అత్యంత ముఖ్యమైన విషయాలేమిటో గుర్తించాలి అని పేర్కొన్నారు. ఈ కీలక భేటీకి ముందు జపాన్‌ ప్రధాని పుమియో కిషిద, దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్‌  సుక్‌యోల్‌తో బైడెన్‌ వేర్వేరుగా సమావేశమయ్యారు.  ఉత్తరకొరియాతో తలెత్తుతున్న ఉద్రికత్త పరిస్థితులతో పాటు, చైనా నుంచి ఎదురవుతున్న ఇబ్బందులనూ వారితో చర్చించారు.

 

Tags :