విద్యార్థి వీసాలు ఇక కఠినతరం

విదేశీ విద్యార్థితో పాటు వారి కుటుంబ సభ్యులనూ దేశంలోకి అనుమతిస్తున్న వీసా విధానానికి బ్రిటన్ స్వస్తి పలికింది. కొత్త నిబంధనల ప్రకారం పరిశోధనేతర పోస్టు గ్రాడ్యుయేట్ విద్యార్థులిక తమ కుటుంబ సభ్యులను బ్రిటన్‌కు తీసుకెళ్లడానికి వీల్లేదు. ఇప్పటివరకు ఉన్న ఈ విధానాన్ని తొలగించారు. చట్టబద్ధ వలసలు ఈ ఏడాది సుమారు 7 లక్షలకు చేరుకోనున్నాయని మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన విడుదల కానున్న నేపథ్యంలో రిషి సునాక్ ప్రభుత్వం నుంచి ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఇది ఎక్కువగా భారతీయులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇక నుంచి కేవలం పరిశోధన విభాగానికి చెందిన పోస్టుగ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్న విద్యార్థులు మాత్రమే తమ కుటుంబ సభ్యులను తీసుకెళ్లొచ్చు. ఈ విషయాన్ని కామన్స్ సభలో బ్రిటన్ హోంమంత్రి సువెల్లా బ్రేవర్మన్ తెలిపారు. కొత్త విధానం ప్రకారం విదేశీ విద్యార్థి చదువు పూర్తికాకముందు ఉద్యోగం చేయడానికి ఇక నుంచి వీల్లేదు.