ASBL NSL Infratech

రివ్యూ: రొటీన్ మూవీ 'ది వారియర్'

రివ్యూ: రొటీన్ మూవీ 'ది వారియర్'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థ: శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్,
నటీనటులు: రామ్ పోతినేని, ఆది పినిశెట్టి, కృతీశెట్టి, నదియా, అక్షరా గౌడ, బ్రహ్మాజీ  తదితరులు
సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయి మాధవ్ బుర్ర
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎన్ లింగుస్వామి
విడుదల తేది: 14.07.2022

ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ పోతినేని హీరోగా ఆది పినిశెట్టి విలన్గా తెరకెక్కిన తాజా చిత్రం 'ది వారియర్'. కృతీశెట్టి హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి ప్రముఖ తమిళ డైరెక్టర్‌ లింగుసామి దర్శకత్వం వహించారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో శ్రీనివాస్ చిట్టూరి నిర్మించిన ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ  భాషల్లో ఈ రోజు  గురువారం (జులై 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్కు మంచి రెస్పాన్స్ రాగా మొదటిసారిగా రామ్ పోతినేని తమిళ డైరెక్టర్తో సినిమా చేస్తుండటంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ అంచనాల మధ్య రిలీజైన 'ది వారియర్' ప్రేక్షకులను ఏ మేర మెప్పించాడో రివ్యూలో చూద్దాం.

కథ:

కర్నూలులో గురు (ఆది పినిశెట్టి) తన ఆదిపత్యాన్ని ప్రదర్శిస్తుంటాడు. ఎదురన్నది లేకుండా రౌడీయిజం చేస్తుంటాడు.అక్కడి జనాలు గురు భయంతోనే బతుకుతుంటారు. అలాంటి ఊర్లోకి డాక్టర్ సత్య (రామ్ పోతినేని) వస్తాడు. ఎంబీబీఎస్ పూర్తయ్యాక హౌస్ సర్జన్గా వైద్య వృత్తిని ప్రారంభించేందుకు కర్నూలు వెళతాడు. ఒకరి ప్రాణం కాపాడితే తాను మళ్లీ జన్మించినట్లుగా భావించే వ్యక్తితం సత్యది. అలాంటి సత్య ఎదుటే గురు  మనుషులు తను కాపాడిన వారి ప్రాణం తీయడాన్ని తట్టుకోలేకపోతాడు. పోలీస్లకు కంప్లైంట్ చేసిన లాభం ఉండదు. ఇలాంటి సంఘటనలే ఎదురై గురు చేతిలో సత్య చావు దెబ్బలు తింటాడు. గురు నుంచి తప్పించుకున్న సత్య రెండేళ్ల తర్వాత కర్నూల్కు డీఎస్పీగా వస్తాడు. ఆ తర్వాత సత్య ఏం చేశాడు ? గురును ఎలా ఎదుర్కొన్నాడు ? పోలీసులను ఎలా మార్చాడు ? డాక్టర్గా చేయలేని ఆపరేషన్ పోలీస్గా ఎలా చేశాడు ? ఈ కథలో విజిల్ మహాలక్ష్మీ (కృతి శెట్టి) పాత్ర ఏంటి? అనే తదితర విషయాలు తెలియాలంటే 'ది వారియర్' సినిమా చూడాల్సిందే.

నటి, నటుల హావభావాలు:

రామ్ పోతినేని ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు!  డాక్టర్‌గా, పోలీస్‌గా విభిన్నమైన పాత్రలో రామ్ అదరగొట్టేశాడు. ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌తో అందరినీ మరోసారి మెప్పించాడు. యాక్షన్ సీక్వెన్స్‌లో మరింత స్టైలీష్‌గా కనిపించాడు. డాక్టర్ గెటప్ కంటే.. పోలీస్ లుక్కులోనే రామ్ కొత్తగా కనిపిస్తాడు. ఆ పాత్ర ఎక్కువగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక విలన్గా ఆది పినిశెట్టి యాక్టింగ్ ఇరగదీశాడు. రామ్, ఆది పినిశెట్టి పోటాపోటీగా నటించి అబ్బురపరిచారు. మాస్ లుక్లో మాస్ పెర్ఫామెన్స్తో ఆది చక్కగా నటించాడు. విజిల్ మహాలక్ష్మీ పాత్రలో కృతి శెట్టి ఎంతో క్యూట్‌గా, బబ్లీగా కనిపించింది. మరోసారి ఆడియెన్స్‌ను తన లుక్స్‌తో కట్టిపడేస్తుంది. సత్య తల్లిగా నదియా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. చెడ్డవారిని శిక్షించాలని కొడుక్కి చెప్పే తల్లి పాత్రలో ఒదిగిపోయారు. ఇతర నటీనటులు కూడా వారి పాత్రల పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

సాంకేతిక వర్గం పనితీరు:

ది వారియర్ సినిమాలో ఒకే ఒక్క కొత్త పాయింట్ కనిపిస్తుంది. డాక్టర్ పోలీస్.. పోలీస్ డాక్టర్ అనే కాన్సెప్ట్ చెప్పి హీరోని ఒప్పించి ఉంటాడు దర్శకుడు లింగు స్వామి . నిజ జీవితంలో ఎంతో మంది డాక్టర్‌గా, పోలీసుగా సేవలందించిన వారున్నారని, వారి జీవితాలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్టు చెప్పారు. కానీ కథనంలో మాత్రం ఎక్కడా కొత్తదనం కనిపించదు. సినిమా మొత్తం ఊహించిన విధంగా, రొటీన్గా సాగుతుంది. దీంతో కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. లింగుసామీ టేకింగ్ స్టైలీష్‌గా అనిపిస్తుంది. కానీ ఒక డాక్టర్.. పోలీస్గా మారి రౌడీయిజాన్ని రూపు మాపడం అనే కొత్త కథను తెరకెక్కించారు దర్శకుడు ఎన్ లింగుస్వామి.  తెర అంతా ఎంతో ఫ్రెష్‌గా కనిపిస్తుంది. చెప్పుకోదగ్గ డైలాగ్లు సినిమాకు పడలేదు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. విలన్ గురు పాత్రకు వచ్చే బీజీఎం ఆకట్టుకునేలా ఉంది. అయితే సినిమా నేపథ్యానికి తగినట్లుగా ఉన్న సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమా నిర్మాణ విలువలు, సినిమాటోగ్రఫీ చక్కగా ఉన్నాయి.

విశ్లేషణ:

'ది వారియర్' పాయింట్ కొత్తదైనా...కథనం మాత్రం మరీ పేలవంగా అనిపిస్తుంది. రొటీన్ కమర్షియల్ సినిమాను చూసినట్టుగా అనిపిస్తుంది. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ఓ ఊర్లో రౌడీ, జనాలంతా కూడా భయపడుతుంటారు.. రౌడీ ఆటను కట్టించేందుకు హీరో దిగుతాడు.. మధ్యలో హీరోకు హీరోయిన్ కావాలి అన్నట్లుగా... ఇక హీరో హీరోయిన్ల్నాక.. ఆటలు, పాటలు కూడా ఉండాలి కదా అన్నట్లు పాటలు . ఇది కూడా అంతే. పక్కా పాత  ఫార్మూలానే పాటిస్తూ వెళ్లారు. దీంతో కొంచెం బోర్ కొట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే...పాత్రల్లో ఆర్టిస్టులను మార్చి  చూసిన  సినిమానే మళ్ళీ చుస్తున్నామా? అనే ఫీలింగ్ కలుగక మానదు.  

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :