ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్.. మెమో దాఖలు చేసిన సునీత!

అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్.. మెమో దాఖలు చేసిన సునీత!

వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది ఆయనకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. దీంతో సీబీఐ ఆయన్ను అరెస్టు చేసేందుకు వీలు లేకుండా పోయింది. అయితే అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ ను వ్యతిరేకిస్తూ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసును క్లోజ్ చేయాలని ఒకవైపు సుప్రీంకోర్టు డెడ్ లైన్ పెట్టింది. కానీ ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవాళ్లు మాత్రం కోర్టుల నుంచి ఊరట పొందుతున్నారు. దీంతో సీబీఐకి ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడుతోంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో రోజుకో పరిణామం చోటు చేసుకుంటోంది.

అవినాశ్ రెడ్డిని అరెస్టు చేసేందుకు సీబీఐ ఉత్సాహం చూపిస్తుంటే కోర్టులు దాని ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాయి. ఈ కేసులో అవినాశ్ రెడ్డి కీలక వ్యక్తి అని సీబీఐ ఆరోపిస్తోంది. ఆయన్ను అరెస్టు చేస్తే కేసు ఒక కొలిక్కి వస్తుందని చెప్తోంది. ఆయన విచారణకు సహకరించట్లేదని, ఆయన్ను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందని కోర్టుకు సీబీఐ స్పష్టం చేసింది. అయితే తల్లి అనారోగ్యం, ఆయనపై ఉన్న ఆరోపణలు.. తదితర అంశాలపై కోర్టు ఆరా తీసి అవినాశ్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు.

అయితే సీబీఐ విచారణకు పిలిస్తే అవినాశ్ రెడ్డి హాజరు కావాలని హైకోర్టు ఆదేశించింది. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ అవినాశ్ రెడ్డిని విచారించుకోవచ్చని సీబీఐకి సూచించింది. ఒకవేళ అవినాశ్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసినట్లయితే రూ.5లక్షల పూచీకత్తుతో విడుదల చేయాలని ఆదేశించింది. సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని, సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్ రెడ్డికి సూచించింది. ఒకవేళ షరతులను అవినాశ్ రెడ్డి ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చని తెలిపింది.

అయితే ముందస్తు బెయిల్ మంజూరు చేయడంపై వివేకా కుమార్తె సునీత తెలంగాణ హైకోర్టులో మెమో దాఖలు చేసింది. అవినాశ్ రెడ్డి తల్లికి సర్జరీయే జరగలేదని, కాబట్టి బెయిల్ రద్దు చేయాలని కోరింది. అంతేకాక కోర్టును తప్పుదోవ పట్టించినందుకు అవినాశ్ రెడ్డి న్యాయవాదులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ మెమోపై కోర్టు ఎలాంటి ఆదేశాలిస్తుందో చూడాలి. మరోవైపు ముందస్తు బెయిల్ పై సీబీఐ పైకోర్టులో అప్పీలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ పరిణామాలు మున్ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో చూడాలి.

 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :