ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టీడీపీ మాక్ అసెంబ్లీ ఎందుకు?

టీడీపీ మాక్ అసెంబ్లీ ఎందుకు?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలిసారిగా ఒక్కరోజు సమావేశమవుతోంది. చరిత్రలో ఒక్కరోజు సమావేశం కావడం ఇదే తొలిసారి. అది కూడా ఒక్కరోజులోనే బడ్జెట్ ప్రవేశపెట్టడం, దాన్ని ఆమోదించడం గతంలో ఎన్నడూ జరగలేదు. ఈ సమావేశానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ప్రతిపక్షం లేకుండా కేవలం అధికారపక్షం మాత్రమే ఈ సమావేశంలో పాల్గొంటోంది. కరోనా సమయంలో అసెంబ్లీని నిర్వహించడాన్ని.. అది కూడా ఒక్కరోజు మాత్రమే బడ్జెట్ సమావేశం పెట్టడాన్ని నిరసిస్తూ టీడీపీ ఈ అసెంబ్లీని బాయ్ కాట్ చేసింది. దీంతో అధికారపక్షం మాత్రమే సభలో మిగిలింది.

అసెంబ్లీని బాయ్ కాట్ చేసిన తెలుగుదేశం పార్టీ ఇందుకు ప్రత్యామ్నాయంగా మాక్ అసెంబ్లీ నిర్వహిస్తోంది. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షమంతా ఈ మాక్ అసెంబ్లీలో పాల్గొనబోతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు సారథ్యంలో జరుగుతున్న ఈ మాక్ అసెంబ్లీలో అధికారపార్టీ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. అయితే టీడీపీ నిర్వహిస్తున్న ఈ మాక్ అసెంబ్లీపై అధికార వైసీపీ అనేక విమర్శలు చేస్తోంది. అసెంబ్లీలో సమాధానం చెప్పలేకే సభను బాయ్ కాట్ చేసి వేరు కుంపటి పెట్టుకుంటోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. తమను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ పారిపోయిందని ఎద్దేవా చేస్తున్నారు.

అయితే వైసీపీ ఆరోపణలను టీడీపీ తీవ్రంగా ఖండిస్తోంది. మార్చిలో కరోనా కేసులు తక్కువగా ఉన్నప్పుడు బడ్జెట్ సమావేశాలను నిర్వహించకుండా అధికార వైసీపీ పారిపోయిందని రివర్స్ అటాక్ చేస్తోంది. అప్పుడు తిరుపతి పార్లమెంటు ఉపఎన్నిక మోజులో పడిన వైసీపీ.. ఇప్పుడు హడావుడిగా సభను ఒకరోజు నిర్వహించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని మండిపడుతోంది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో అసెంబ్లీ నిర్వహించడం సబబు కాదని.. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఒక్కరోజే సభను నిర్వహించడం సరికాదనేది టీడీపీ వాదన. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. బడ్జెట్ సమావేశాలు నెలరోజులపాటు జరిగిన సందర్భాలున్నాయి. అలాంటిది కేవలం ఒక్కరోజులోనే సభ నిర్వహించి బడ్జెట్ ను ఆమోదింపచేసుకోవడం సరికాదని టీడీపీ వాదిస్తోంది.

టీడీపీ బాయ్ కాట్ కు మరో కారణం కూడా. ఒకవేళ సభకు హాజరైనా కూడా తమకు ప్రాధాన్యత ఇవ్వరనేది టీడీపీ ఆలోచన. స్పీకర్ తమకు అవకాశం ఇవ్వకుండా గొంతు నొక్కేస్తున్నారని.. ఒకవేళ తాము మాట్లాడే అవకాశం వచ్చినా దాన్ని చూపించకుండా కవర్ చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. అలాంటప్పుడు సభకు వెళ్లినా, వెళ్లకపోయినా ఒక్కటేననేది వారు చెప్తున్న మాట. అందుకే మాక్ అసెంబ్లీ ద్వారా అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టాలని టీడీపీ భావించింది. టీడీపీ సభ్యులే అధికార, ప్రతిపక్ష సభ్యులుగా విడిపోయి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రతిపక్షం ఎత్తి చూపే అవకాశం ఉంటుంది. వాటికి అధికార పార్టీ బదులిచ్చే ఛాన్స్ ఉంటుంది. వాస్తవానికి అసెంబ్లీలో ఇలా జరగాలి. కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాల తీరే మారిపోయింది. అధికార పార్టీ కనుసన్నల్లోనే సమావేశాలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాల పాత్ర పెద్దగా ఉండట్లేదు. వారి గొంతు నొక్కేసేందుకే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటప్పుడు మాక్ అసెంబ్లీలు నిర్వహించుకోవడం మినహా ప్రతిపక్షాలకు మరో మార్గం లేదు.

మీడియా కూడా ప్రతిపక్షానికి పెద్ద ప్రయారిటీ ఇవ్వట్లేదనే ఆలోచనలో టీడీపీ ఉంది. మీడియా మొత్తం అధికార పార్టీ కనుసన్నల్లోనే నడుస్తోంది. ఒకట్రెండు ఛానళ్లు మినహా మిగిలినవేవీ తమను పట్టించుకోవట్లేదని టీడీపీ భావిస్తోంది. అసెంబ్లీలో తాము ప్రధాన అంశాలను లేవనెత్తుతున్నా ఆ మీడియా చూపించట్లేదని చెప్తోంది. అందుకే యూట్యూబ్ ద్వారా మాక్ అసెంబ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. సోషల్ మీడియాలో నిర్వహించడం ద్వారా మెయిన్ మీడియాపై ఆధారపడకుండా ప్రజలందరూ మాక్ అసెంబ్లీ చూసే అవకాశం ఉంటుందని టీడీపీ భావిస్తోంది. ఇలా మాక్ అసెంబ్లీలు నిర్వహించడం కొత్తేమీ కాదు. గతంలో అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్షాలు ఈ పని చేశాయి. ఇప్పుడు టీడీపీ అదేబాటలో పయనిస్తోంది.

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :