ASBL NSL Infratech

బీజేపీ ట్రాప్‌లో కేసీఆర్! అజెండా సెట్ చేస్తున్న కమలనాథులు!

బీజేపీ ట్రాప్‌లో కేసీఆర్! అజెండా సెట్ చేస్తున్న కమలనాథులు!

కేసీఆర్.. ఈ పేరొక సంచలనం. ప్రత్యేక తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం ఫలించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు దోహదపడింది. తెలంగాణ కల సాకారమైందంటే అది కేసీఆర్ వల్లే.! సుమారు 2 దశాబ్దాలుగా ఆయన ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం పరితపించారు. ఎన్నో పోరాటాలు చేశారు. ఆయన చేసిన ప్రతి పోరాటానికి తిరుగులేదు. ప్రత్యేక రాష్ట్ర సాధన తర్వాత కూడా ఆయనకు ఎదురే లేకుండా పోయింది. వరుసగా రెండు సార్లు ఆయన సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆధిపత్యానికి ఢోకా లేకుండా పోయింది.

అయితే ఇప్పుడు పరిస్థుతులు మారాయి. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా నిలిచింది. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అయితే ఇచ్చింది తామేనని కాంగ్రెస్ ప్రకటిస్తూ వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీకి అధికారం మాత్రం చిక్కలేదు. ప్రతిపక్ష పార్టీకే పరిమితమైంది. పైగా కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు హస్తానికి గుడ్ బై చెప్పేసి కారెక్కేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది. దీంతో తెలంగాణలో టీఆర్ఎస్ కు తిరుగే లేదని అందరూ భావించారు.

కానీ బీజేపీ రూపంలో టీఆర్ఎస్ కు ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. తొలి విడతలో బీజేపీ ప్రభావం పెద్దగా లేదు. అప్పుడు బీజేపీ తరపున రాజాసింగ్ మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆ పార్టీపై పెద్దగా ఎవరికీ హోప్స్ లేవు. అయితే 2019 పార్లమెంటు ఎన్నికలు బీజేపీకి పెద్ద బూస్ట్ అప్ ఇచ్చాయని చెప్పొచ్చు. ఆ ఎన్నికల్లో బీజేపీ 4 పార్లమెంటు స్థానాలు గెలుచుకుంది. అంతేకాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానం దక్కించుకుంది. దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో కూడా బీజేపీ అభ్యర్థులు గెలవడంతో కమలం హవా మొదలైంది. ఈ ఊపుతో బీజేపీ రెచ్చిపోవడం మొదలుపెట్టింది. టీఆర్ఎస్ ను గద్దె దించడమే లక్ష్యంగా ఆ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ప్రతి అంశాన్ని రాజకీయ కోణంలో చూస్తూ ఎత్తిచూపేందుకు ప్రయత్నిస్తోంది.

రాష్ట్ర నాయకత్వానికి కేంద్ర నాయకత్వం పూర్తి అండదండలు అందిస్తుండడంతో తెలంగాణలో బీజేపీ దూకుడుగా ముందుకెళ్తోంది. ప్రతి నెలా ఒకరిద్దరు జాతీయ స్థాయి నేతలు తెలంగాణలో పర్యటిస్తున్నారు. మరోవైపు బండి సంజయ్ విడతల వారీగా పాదయాత్ర చేపడుతున్నారు. టీఆర్ఎస్ వైఫల్యాలను ఎత్తి చూపడంలో బీజేపీ సక్సెస్ అయింది. అంతేకాక బీజేపీ అజెండా డిసైడ్ చేయడం మొదలు పెట్టింది. సెప్టెంబర్ 17 ఇందుకు అతి పెద్ద ఉదాహరణ. సెప్టెంబర్ 17ను విమోచన దినంగా ప్రకటించింది కేంద్రం. మహారాష్ట్ర, కర్నాటకతో పాటు తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలకు అధికారికంగా సమాచారమిచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ వేడుకలు నిర్వహించింది. అమిత్ షా దీనికి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే బీజేపీ ప్రతిసారి ఈ అంశాన్ని ఇష్యూగా భావించి ఉద్యమిస్తోంది. కానీ ఎన్నడూ టీఆర్ఎస్ ఖాతరు చేయలేదు.

కానీ ఈసారి కేసీఆర్ దిగిరాక తప్పలేదు. సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినంగా ప్రకటించాల్సి వచ్చింది. అంతేకాక ఆ రోజు అధికారికంగా ఈ దినోత్సవాన్ని నిర్వహించింది. నిజాంను వెనకేసుకొస్తున్నాడంటూ గతంలో కాంగ్రెస్, బీజేపీలు ఎన్నిసార్లు విమర్శించినా పట్టించుకోని కేసీఆర్.. ఈసారి మాత్రం సెప్టెంబర్ 17ను ఒక చారిత్రాత్మక దినంగా ప్రకటించాల్సి వచ్చింది. కేసీఆర్ ఈ విషయంలో దిగిరాక తప్పలేదు. ఇది కచ్చితంగా బీజేపీ స్ట్రాటజీయే. బీజేపీ వ్యూహంలో కేసీఆర్ చిక్కుకున్నారని చెప్పొచ్చు. ఇన్నాళ్లూ తాను చెప్పిందే వేదం అన్నట్టు సాగిన కేసీఆర్.. ఇప్పుడు బీజేపీ వ్యూహంలో చిక్కుకుంటున్నారేమో అనిపిస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :