ASBL NSL Infratech

రివ్యూ: 'శాకుంతలం' ఓ దృశ్య కావ్యం....అద్భుతంగా ఉందని చెప్పలేం!

రివ్యూ: 'శాకుంతలం' ఓ దృశ్య కావ్యం....అద్భుతంగా ఉందని చెప్పలేం!

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5

నిర్మాణ సంస్థలు: గుణా టీం వర్క్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్,

నటీనటులు: సమంత, దేవ్ మోహన్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, కబీర్ బేడీ, సుబ్బరాజు,
సచిన్ ఖేడేకర్, మధుబాల, అదితి బాలన్, అనన్య నాగళ్ల, గౌతమి, బేబీ అల్లు అర్హ తదితరులు నటించారు.

ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీత దర్శకులు: మణిశర్మ, సినిమాటోగ్రఫీ: శేఖర్ వి జోసెఫ్,
పాటలు: చైతన్య ప్రసాద్, శ్రీ మణి, మాటలు : సాయి మాధవ్ బుర్ర,
మూలకథ : కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా....
సమర్పణ : దిల్ రాజు నిర్మాత : నీలిమ గుణ, దర్శకులు : గుణశేఖర్

విడుదల తేదీ: 14.04.2023

దర్శకుడు గుణశేఖ‌ర్ లేబుల్ అంటేనే భారీ బడ్జెట్ చిత్రాలు, భారీ సెట్టింగ్స్, భారీ తారాగణం, ఇవన్నీ స్ఫూరణకు వస్తాయి. ఏ చిత్రమైనా సరే తాను అనుకున్న ఔట్‌పుట్ వ‌చ్చే వ‌ర‌కు నిద్రపోని సినిమా తపస్వి గుణశేఖర్. చేసే ప్ర‌తి సినిమాను భారీ సెట్స్ వేసి చిత్రీక‌రిస్తుంటారు. విజువ‌ల్‌గా ప్రేక్ష‌కుడికి ఓ మంచి అనుభూతినివ్వాల‌నే తాప‌త్ర‌యపడుతుంటారు గుణశేఖ‌ర్. రుద్ర‌మ‌దేవి వంటి హిస్టారిక‌ల్ మూవీ చేసిన ఎనిమిదేళ్ల త‌ర్వాత ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రం ‘శాకుంత‌లం’. ఇదొక పౌరాణిక ప్రేమ గాథ. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా తెరకెక్కించిన ‘శాకుంతలం’లో దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ‌క‌థ‌ను వెండితెర‌పై విజువ‌ల్ వండ‌ర్‌గా ఆవిష్క‌రించే ప్ర‌య‌త్నం చేశారు గుణ శేఖర్. దుష్యంతుడిగా మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహ‌న్‌, శ‌కుంత‌ల‌గా స‌మంత న‌టించారు. గుణ శేఖర్ మేకింగ్, టేకింగ్‌కి స‌మంత క్రేజ్‌తో పాటు ఈ సినిమా నిర్మాణంలో దిల్ రాజు కూడా పాలుపంచుకున్నారు. దీంతో ఈ సినిమాపై హైప్ పెరిగింది. దానికి తోడు టీజ‌ర్‌, ట్రైల‌ర్‌లోని విజువ‌ల్స్ ఈ ఆస‌క్తిని మ‌రింత‌గా పెంచేశాయి. మ‌రీ పౌరాణిక ప్రేమ కావ్యం శాకుంత‌లం ప్రేక్ష‌కుల‌ను ఏ మేరకు ఆక‌ట్టుకుందో సమీక్షలో చూద్దాం.

కథ:

దుష్యంతుడు, శ‌కుంత‌ల ప్రేమ క‌థ అంద‌రికీ సుప‌రిచిత‌మే. బ్రహ్మర్షి విశ్వామిత్రుడి త‌పోభంగం కోసం ఇంద్రుడు భూమి మీద‌కు వ‌చ్చిన అప్స రస మేన‌క (మ‌ధుబాల‌) ను పంపిస్తాడు. త‌పోభంగం అనంతరం వారి కలయికకు గుర్తుగా పుట్టిన పాపను దేవలోకం తీసుకెళ్ల‌లేక మేన‌క భూమ్మీద‌నే విడిచి పెట్టి వెళ్లిపోతుంది. శాకుంతలం పక్షులు ఆ పాప‌ను కణ్వ మ‌హ‌ర్షి (సచిన్ ఖేడేక‌ర్‌) ఆశ్ర‌మానికి చేరుస్తాయి. పాప‌ను ఆ పక్షులు సురక్షితంగా తన వద్దకు చేర్చాయి కాబట్టి ఆ పాపకు శ‌కుంత‌ల అనే పేరు పెడ‌తాడు మ‌హ‌ర్షి. ఆ ఆశ్ర‌మంలోనే ఆమె పెరిగి పెద్ద‌ద‌వుతుంది. కొన్ని సంత్స‌రాల తరువాత శ‌కుంత‌లకు యుక్త వయసు వచ్చేనాటికి, రాజ్యంలోని ప్ర‌జ‌ల‌ను క్రూర మృగాల బారి నుంచి కాపాడే ప్ర‌య‌త్నంలో దుష్యంత మ‌హారాజు (దేవ్ మోహ‌న్‌) క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్రమాన్ని సందర్శిస్తాడు. అక్క‌డ శ‌కుంత‌ల (స‌మంత‌)ను చూసి మ‌న‌సు పారేసుకుంటాడు. ఆమె కూడా మ‌హారాజు ప్రేమ‌లో ప‌డిపోతుంది. ఇద్ద‌రూ గాంధ‌ర్వ వివాహంతో ఒక్క‌ట‌వుతారు. కొన్నాళ్ల‌కు దుష్యంతుడు త‌న రాజ్యానికి వెళుతూ త్వ‌ర‌లోనే తాను తిరిగి వ‌స్తాన‌ని, ప‌ట్ట మ‌హిషిగా ప్ర‌జ‌ల‌కు ప‌రిచ‌యం చేస్తాన‌ని శ‌కుంత‌ల‌కు మాటిస్తాడు.

త‌మ ప్రేమ‌కు గుర్తుకు త‌న ఉంగ‌రాన్ని శకుంతలకి ఇస్తాడు. ఇది జ‌రిగిన కొన్ని రోజుల‌కు క‌ణ్వ మ‌హ‌ర్షి ఆశ్ర‌మానికి దుర్వాస మ‌హాముని(మోహ‌న్‌బాబు) వస్తాడు. అప్ప‌టికే గ‌ర్భ‌వ‌తి అయిన శ‌కుంత‌ల‌ భ‌ర్త రాక కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా ఎదురు చూస్తుంటుంది. ఆ పరధ్యానం లో దుర్వాస‌ మ‌హా ముని రాక‌ను గమనించదు. ముక్కోపి అయిన దుర్వాసుడికి కోపం వ‌స్తుంది. నీవు ఎవరిగుంరించి అయితే తలచుకుంటున్నావో వారిని మ‌ర‌చిపోతావని ఆమెను శపిస్తాడు. దుష్యంతుడు రాక‌పోయేస‌రికి క‌ణ్వ మ‌హ‌ర్షి ఆమెను రాజ్యానికి పంపిస్తాడు. దుర్వాసుడి శాపం కార‌ణంగా శ‌కుంత‌ల‌ను గుర్తించడు. కణ్వ మహర్షి ఆశ్రమానికి తాను వెళ్ళిన విషయం గుర్తుంది కానీ శంకుతల ఎవరో తనకు తెలియదని దుష్యంత మహారాజు చెబుతాడు. ఆమెకు కొలువులో అవ‌మానం జ‌రుగుతుంది. చివ‌ర‌కు శ‌కుంత‌లం ఏం చేస్తుంది? అస‌లు దుష్యంతుడు, శ‌కుంత‌ల క‌ల‌వ‌కూడ‌దనుకుని అసురులు ఉగ్ర‌నేమీ, కాల‌నీములు వేసిన ప‌న్నాగ‌మేంటి? దుష్యంతుడు, శ‌కుంత‌ల ఎలా కలుస్తారు? అనే విష‌యాల‌ను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల హావభావాలు:

సమంత తొలి చిత్రం 'ఏ మాయ చేసావె' ప్రేమకథే. అందులో ఆమె నటనకు దానికి తగిన వాయిస్ తో ఎంతో మంది ముగ్దులయ్యారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో సమంత అద్భుతంగా నటించి మెప్పించారు. శాకుంతలం చిత్రం లో తన పరిపక్వతమైన నటనతో ఉత్తమమైన నటనను కనబర్చారు. ముఖ్యంగా క్లిష్టమైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె తన మార్క్ నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచారు. అయితే, శకుంతల పాత్రకు సమంత సరి తూగలేదనిపిస్తుంది. ఆమె సొంత డబ్బింగ్ ఈ సినిమాకు మైనెస్. భావోద్వేగభరిత సన్నివేశాల్లో నటిగా అనుభవం చూపించారు. ఇక దుష్యంత మ‌హారాజు దేవ్ మోహన్ రూపం బావుంది కానీ పాత్రకి హావభావాలు ప్రదర్శించలేదు. అప్స రస అంటేనే రొమాంటిక్ లుక్ ఉండాలి అలాంటిది మేనకగా 54 ఏళ్ళ మధుబాలను దేవ కన్యగా ప్రేక్షకులు చూడలేకపోయారు.

గౌతమి, అనన్యా నాగళ్ళ, జిష్షుసేన్ గుప్తా, శివ బాలాజీ, కబీర్ సింగ్, సచిన్ ఖేడేకర్ సహా చాలా మంది తారాగణం తెరపై కనిపించారు. తెలుగులో ఎంతో మంది నటీనటులున్నా పరభాషా నటులను పెట్టుకోవడంతో వారు ఎవరో? ఏ పాత్రలో నటిస్తున్నారో అర్ధం కాదు. వీళ్ళెవ్వరూ గుర్తుంచుకునేంత రీతిలో నటన కనబరచలేదు. దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబు కాసేపు కనిపించారు. కంచు కంఠంతో డైలాగులు చెబుతూ సన్నివేశాలకు ప్రాణం పోశారు. పతాక సన్నివేశాల్లో శకుంతల, దుష్యంతుల కుమారుడు భరతుడిగా అల్లు అర్హ కనిపించారు. ఆ చిన్నారి నటన ముద్దొస్తుంది. తెలుగు డైలాగులను అర్హ చక్కగా చెప్పింది.

సాంకేతిక వర్గం పనితీరు:

అందరికీ తెలిసిన కథను మళ్ళీ చెప్పడం అనేది దర్శకుడికి కత్తి మీద సాము లాంటి వ్యవహారం. అందులోనూ ఎటువంటి ట్విస్టులు, కొత్తదనం, కధలో మలుపులు, లాంటివి లేని అభిజ్ఞాన శాకుంతలం కథను యథాతథంగా తీయాలనుకున్నప్పుడు... ప్రతి సన్నివేశం ఓ దృశ్యకావ్యం అన్నట్లు ఉంటే తప్ప ప్రేక్షకుడ్ని థియేటర్లో కూర్చోబెట్టడం కష్టం. అయితే గుణశేఖర్ వంటి దర్శకుడు ఈ విషయంలో ఎంతో శ్రద్ధ వహిస్తాడు, పైగా అవుట్ ఫుట్ వచ్చేవరకు శ్రమిస్తాడు అయితే... ఈ సారి ఆయన లెక్క తప్పింది. 'శాకుంతలం' సినిమా మొదలైన కాసేపటి ప్రేక్షకుడి మదిలో కలిగే మొదటి సందేహం...ఈ సినిమా 'త్రీడీలో అవసరమా? 'శాకుంతలం' థియేటర్లలో అడుగుపెట్టిన ప్రేక్షకులపై పడిన మొదటి దెబ్బ విజువల్ ఎఫెక్ట్స్ & త్రీడీ వర్క్!. టూడీలో చూపిస్తేనే బావుండేది ఏమో? కథ, కథనం, సన్నివేశాల్లో ఎంత బలం ఉంది? వంటి సంగతులు పూర్తిగా విస్మరించారనిపిస్తుంది. గుణశేఖర్ ఊహలో తప్పు లేదు. కానీ, ఆయన ఊహ విజువలైజేషన్ రూపంలోకి రాలేదనేది ముమ్మాటికీ నిజం! గ్రీన్ మ్యాట్ మీద సినిమా తీసి విజువల్ ఎఫెక్ట్స్ చేయించడం అందరికి కుదరదని ఈ సినిమా నిరూపించింది.

పాత్రల పరంగా నటీనటుల ఎంపిక కూడా ప్రేక్షకుడికి రుచించలేదు. దేవ్ మోహన్ బదులు తెలుగు హీరో ఎవరినైనా తీసుకుని ఉంటే బావుండేది. సమంత కంటే ఆయనకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. సమంతను చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ఇదీ మింగుడుపడని అంశమే. ఒక్క మోహన్ బాబు తప్పా మిగతా వారందరు మనకు కానీ వారు అనిపిస్తుంది. మణిశర్మ స్వరాలు మధ్య మధ్యలో మనసుకు ఊరట కలిగించాయి. ఆయన సంగీతం కాస్త స్వాంతన చేకూర్చింది. వరస్ట్ త్రీడీ వర్క్ కారణమో? లేక మరొకటో? సినిమాటోగ్రఫీ బాలేదు. నిర్మాతలు ఖర్చు పెట్టినట్టు తెరపై సన్నివేశాలు చూస్తే అర్థం అవుతూ ఉంటుంది. అయితే, వాళ్ళ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని చెప్పొచ్చు.

విశ్లేషణ:

శకుంతలను కాళిదాసు శృంగార నాయికిగా అభిజ్ఞాన శాకుంతలంలో వర్ణించారు. సమంతను ఆ విధంగా చూపించడంలో గుణశేఖర్ ఫెయిల్ అయ్యారు. నటీనటుల ఎంపికలోనూ ఆయన ఫెయిలే. సినిమాలో ప్రేమా లేదు, గీమా లేదు. ఏ దశలోనూ ఆకట్టుకోదు. సన్నివేశాల్లో సాగదీత, వరస్ట్ త్రీడీ వర్క్ వెరసి ప్రేక్షకుల కళ్ళను కష్టపెడతాయి. ఈ శాకుంతలం ప్రేమ కథలో బలమైన సంఘర్షణ లేదు. దేవ్ మోహన్, సమంత మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. ఓ మాట లో చెప్పాలంటే...ఈ ప్రేమ కావ్యమనే మాలలో దారంతెగిందనే చెప్పాలి. విడి పూలు మాత్రం కనిపిస్తాయి.

ప్రేమకథలో, సన్నివేశాల్లో విజువల్ బలం కంటే హీరో హీరోయిన్స్ మధ్య కెమిస్ట్రీ కుదిరితే సినిమా పాస్ అయిపోయినట్టే! ఇక్కడ అది కూడా లేదు. దాంతో సీరియల్ సాగినట్లు సన్నివేశాలు సాగాయి. థియేటర్లలో చివరి వరకూ కూర్చోవాలంటే చాలా ఓపిక కావాలి. శాకుంతలం... ప్రేక్షకుడి సహనానికి పరీక్ష! పతాక సన్నివేశాల్లో అర్హ నటన అల్లు అభిమానులకు, ప్రేక్షకులకు నచ్చుతుంది. రణభూమిలో యుద్ధ సన్నివేశాలు సైతం పేలవంగా సాగాయి. ఎప్పుడు అయిపోతుందా? అన్నట్లు ఉందీ సినిమా.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :