ASBL NSL Infratech

అక్రమవలసలపై బ్రిటన్ అస్త్రం 'రువాండా' బిల్..

అక్రమవలసలపై బ్రిటన్ అస్త్రం 'రువాండా' బిల్..

అక్రమవలసలతో సతమతమవుతున్న బ్రిటన్.... వీటికి అడ్డుకట్ట వేసేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన వివాదాస్పద రువాండా బిల్లుకు పార్లమెంటు ఆమోదం తెలిపింది. అక్రమ వలసదారులను ఆఫ్రికా దేశానికి తరలించేందుకు ఏదీ అడ్డు కాదన్నారు ప్రధాని రిషి సునాక్. అంతర్జాతీయ వలసల నిర్వహణలో ఇదో మైలురాయని తెలిపారు. బ్రిటన్‌ రాజు చార్లెస్‌ III ఆమోదం తర్వాత ఇది చట్టరూపం దాల్చనుంది.

రువాండా బిల్లు..

బ్రిటన్‌లోకి అక్రమ వలసలు పెరుగుతున్నట్లు ప్రభుత్వ నివేదికలు చెబుతున్నాయి. 2022లోనే 45 వేల మంది వచ్చినట్లు సమాచారం. ఇంగ్లీష్‌ ఛానల్‌ ఈదుతూ, పడవల్లో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ వందల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటివారిని అడ్డుకుంటామని పేర్కొంటున్న బ్రిటన్‌.. రువాండా ప్రణాళికను సిద్ధం చేసింది. కానీ, అక్కడి సుప్రీంకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది. వలసదారులను తరలించగల సురక్షిత దేశంగా రువాండాను పరిగణించలేమని పేర్కొంటూ 2023 నవంబర్‌లో తీర్పు చెప్పింది.

ఈ క్రమంలోనే భద్రతా రువాండా బిల్లును బ్రిటన్‌ రూపొందించింది. తద్వారా ఆ ఆఫ్రికా దేశాన్ని సురక్షితంగా పేర్కొంటూ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం అక్రమంగా వచ్చేవారిని 6,400 కి.మీ. దూరంలో రువాండాకు తరలిస్తారు. రాజధాని కిగాలిలో ఏర్పాటుచేసిన శరణార్థి శిబిరాల్లో ఉంచుతారు. ఇందుకోసం ఏప్రిల్‌ 2022లోనే బ్రిటన్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. వలసదారులకు మౌలిక వసతులు ఏర్పాటుచేసేందుకు ఆ దేశానికి ఇప్పటివరకు 290 మిలియన్ల పౌండ్లను చెల్లించింది. త్వరలో మరో 50 మిలియన్‌ పౌండ్లను చెల్లించనున్నట్లు సమాచారం. అక్కడే బ్రిటన్‌లో ఆశ్రయం కోరుకునే వారి దరఖాస్తులను పరిశీలిస్తారు.

విమానాల్లో తరలింపు..

ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి కార్యాచరణ ఎలా ఉంటుందన్న విషయాన్ని ప్రధాని రిషి సునాక్‌ వివరించలేదు. అక్రమ వలసదారులను తరలించేందుకు ఛార్టర్‌ విమానాలు సిద్ధంగా ఉన్నాయి. 2,220 మంది వలసదారులు ఉండేందుకు వీలుగా అక్కడ శిబిరాలను ఏర్పాటుచేయనున్నాం. వీరితోపాటు దస్త్రాల పరిశీలనకు 200 మంది శిక్షణ పొందిన సిబ్బందిని నియమిస్తాం. ఏవైనా న్యాయపరమైన వివాదాలు తలెత్తితే.. వాటిని వేగంగా పరిష్కరించేందుకు 25 కోర్టు రూమ్‌లను ఏర్పాటుచేస్తాం. ఇందుకోసం 150 మంది న్యాయమూర్తులను గుర్తించాం అని బ్రిటన్ ప్రధాని పేర్కొన్నారు. 10, 12 వారాల్లోనే ఓ రహస్య ప్రాంతం నుంచి ఈ విమానాలు బయలుదేరుతాయన్నారు.

అక్రమ వలసదారులను ఆఫ్రికా తరలించే అంశంపై బ్రిటన్‌ విపక్షాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మరోవైపు ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఆశ్రయం కోరుకునేవారిని రువాండా తరలించేందుకు చేస్తున్న ప్రయత్నాలను బ్రిటన్‌ పునఃపరిశీలించాలని సూచించింది. ఇలా చేయడం చట్టవిరుద్ధమని ప్రపంచవ్యాప్తంగా ప్రమాదకర పరిస్థితులకు దారి తీస్తుందని హెచ్చరించింది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :