ASBL NSL Infratech

అయోధ్యలో రియల్ బూమ్‌..

అయోధ్యలో రియల్ బూమ్‌..

అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ ఉత్సవం ఏర్పాట్లతో నగర రూపు రేఖలు మారిపోయాయి. ఎక్కడ చూసినా ఆ రాముడే కనిపిస్తున్నాడు. రామాయణ ఘట్టాలను కళ్లకు కట్టేలా అన్ని చోట్లా పెయింటింగ్స్‌తో అలంకరించారు. రాముని జన్మభూమిగా అయోధ్యకు ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ ఆ ప్రత్యేకత రాముడి ప్రాణప్రతిష్ఠతో మరింత పెరిగింది. అయోధ్యలో అన్ని మౌలిక వసతులూ సిద్ధమవుతున్నాయి. పలు కీలక ప్రాజెక్ట్‌లను ఇప్పటికే మొదలు పెట్టింది యోగి సర్కార్. అయోధ్య ధామ్ జంక్షన్‌, ఎయిర్‌పోర్ట్ ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ రూ.15,700 కోట్ల విలువైన ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపన చేశారు.

ఇందులో రూ.11 వేల కోట్లు కేవలం అయోధ్య రూపు రేఖలు మార్చేందుకే ఖర్చు పెట్టనుంది ప్రభుత్వం. అంటే...ఈ నగరంపై ఎంత దృష్టి పెట్టిందో అర్థం చేసుకోవచ్చు. ఎక్కడైనా సరే ఓ సిటీ డెవలప్ అవుతోందంటే...ఆ ప్రభావం వెంటనే కనిపించేది అక్కడి భూములు ధరలపైనే. అయోధ్యలోనూ అదే జరుగుతోంది. ఇన్నాళ్లూ అంతంత మాత్రంగా ఉన్న ధరలు రామ మందిర నిర్మాణంతో ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడక్కడ రియల్ ఎస్టేట్ రంగం జోరు మామూలుగా లేదు. ఈ మధ్యే బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్‌ బచ్చన్ రూ.14.5 కోట్లు పెట్టి ప్లాట్ తీసుకున్నారు. పది వేల చదరపు అడుగుల స్థలాన్ని ఆయన కొనుగోలు చేశారు. ఇది ఒక్కటి చాలు. అయోధ్యలో భూముల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పడానికి. దేశంలోనే కాదు.

విదేశాల నుంచి కొంత మంది కాల్ చేసి "అయోధ్యలో మాకో ల్యాండ్ కావాలి" అని ఎంక్వైరీ చేస్తున్నారు. ఐదేళ్ల క్రితం ఉన్న ధరలకి ఇప్పుడున్న ధరలకు అసలు పొంతనే లేదు. దాదాపు పది రెట్ల మేర ధరలు పెరిగిపోయాయి. ఓ రిపోర్ట్‌ ఆధారంగా చూస్తే...2019లో అయోధ్యలో ఓ స్క్వేర్ ఫీట్ ధర రూ.2 వేలు. ఇప్పుడు కనీసం రూ.8 వేల వరకూ ఉంటోంది. ఒకప్పుడు అసలు ఎంక్వైరీలే లేక బోసిపోయిన రియల్ ఎస్టేట్ సంస్థలకి ఇప్పుడు క్షణం తీరిక లేనంతగా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ ప్రాంతాన్ని డిమాండ్ పెరుగుతోంది. రామ మందిరానికి దగ్గర్లో ఉన్న ప్రాంతాల్లో చదరపు అడుగు ధర రూ.18 వేలకు పైగానే పలుకుతోంది. ఇది అంచనా ధరలు మాత్రమే. ఇంకా పెరిగే అవకాశాలూ ఉన్నాయి. ఇందుకు కారణం...నగరంలో పలు కంపెనీలు టౌన్‌షిప్స్‌ నిర్మించేందుకు సిద్ధమవుతుండడమే. ఈ డిమాండ్‌ని క్యాష్ చేసుకునేందుకు పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాయి.

అయోధ్య రైల్వే జంక్షన్ చుట్టూ రియల్ ఎస్టేట్‌ పుంజుకుంటోంది. అటు ఎయిర్‌ పోర్ట్‌కి దగ్గర్లోనూ డిమాండ్ బాగానే కనిపిస్తోందని డెవలపర్స్ చెబుతున్నారు. ఆతిథ్య రంగమూ జోరందుకుంటోంది. బడా కంపెనీలు ఇక్కడ తమ బ్రాంచ్‌లు సిద్ధం చేస్తున్నాయి. దాదాపు 50 బడా సంస్థలకు సంబంధించిన ప్రాజెక్ట్‌లు త్వరలోనే పూర్తవనున్నట్టు తెలుస్తోంది. చిన్న చిన్న హోటళ్లతో పాటు రిసార్ట్‌లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లలో భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి సంస్థలు. చెప్పాలంటే...ఇప్పుడు అయోధ్య హోటల్ ఇండస్ట్రీకి హాట్‌స్పాట్‌గా మారిపోయింది. ఈ మధ్యే జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌లో ఒక్క అయోధ్యలోనే రూ.18 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు జరిగాయి.

ప్రస్తుతానికి కేవలం పర్యాటక రంగానికి సంబంధించిన 126 ప్రాజెక్ట్‌లు సిద్ధమవుతున్నాయి. తాజ్‌, మారియట్, ఒబెరాయ్, ట్రిడెంట్, రాడిసన్ లాంటి బడా కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే అయోధ్యలో తమ మార్కెట్‌ని విస్తరించాలని పట్టుదలతో ఉన్నాయి. త్వరలోనే అయోధ్యకి భక్తుల తాకిడి పెరుగుతుందని, విదేశీయులూ ఇక్కడి వచ్చేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చాలా గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే అంత ధైర్యంగా ముందుకొచ్చి ఆ స్థాయిలో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. పైగా...యోగి సర్కార్‌పై ఉన్న పాజిటివిటీ కూడా ఇందుకు కారణం. ఇదేదో ఇప్పటికిప్పుడు వచ్చిన డిమాండ్ కాదు.

2020లో ఎప్పుడైతే ప్రధాని నరేంద్ర మోడీ రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేశారో అప్పటి నుంచే ఇక్కడి రియల్ ఎస్టేట్ రంగంలో మార్పు మొదలైంది. స్థానికులే కాదు. NRIలు కూడా భారీగానే ఇక్కడి ల్యాండ్స్‌పై పెట్టుబడులు పెడుతున్నారు. రామ మందిరానికి పది కిలోమీటర్ల పరిధిలోని అన్ని భూములుకూ గిరాకీ విపరీతంగా ఉంది. రిటైర్‌మెంట్ తీసుకున్న వాళ్లు అయోధ్యలో ఇల్లు కట్టుకోవాలనే సెంటిమెంట్‌ బాగా వర్కౌట్ అవుతోంది. మరికొంత మంది రామ భక్తులు అయోధ్యలో కచ్చితంగా ఓ ప్లాట్ తీసుకోవాలన్న ఆసక్తితో ఉన్నారు. రాముడి నగరంలో తమకు ఓ సొంత స్థలం ఉండాలని ఆశపడుతున్నారు. లక్షలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. వాళ్లను ఆకట్టుకునేలా నగరాన్ని తీర్చి దిద్దాలని ప్రభుత్వం మౌలిక వసతులపై దృష్టి సారించింది. మరో ఐదారేళ్లలో అయోధ్యలో జనాభా పెరిగే అవకాశాలున్నాయి. ఆ జనాభాకి తగ్గట్టుగా వసతులు ఉండాలని ఇప్పటి నుంచే యోగి సర్కార్‌ జాగ్రత్త పడుతోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :