ASBL NSL Infratech

రివ్యూ : ఆకట్టుకొని 'రామారావు ఆన్ డ్యూటీ'

రివ్యూ : ఆకట్టుకొని 'రామారావు ఆన్ డ్యూటీ'

తెలుగుటైమ్స్.నెట్ రేటింగ్ : 2.5/5
నిర్మాణ సంస్థలు : ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్ పి, రవితేజ టీమ్‌వర్క్స్
నటీనటులు: రవితేజ, రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్‌, వేణు తొట్టెంపూడి, నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, ‘సర్పట్ట’ఫేమ్ జాన్ విజయ్, చైతన్య కృష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, ఈరోజుల్లో ఫేమ్ శ్రీ, మధుసూదన్ రావు, సురేఖ వాణి తదితరులు.
మ్యూజిక్ డైరెక్టర్ : సామ్ సి.ఎస్., సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్, ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్.
ఆర్ట్ డైరెక్టర్ : సాహి సురేష్, నిర్మాత: సుధాకర్ చెరుకూరి
కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం : శరత్ మండవ
విడుదల తేదీ: 29.07.2022

కొత్త దర్శకులకు అవకాశం ఇచ్చే రవితేజ ఈ సారి శరత్ మండవ అనే దర్శకుడిని పరిచయం చేస్తూ రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ఈ రోజు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఒకటో రెండో తప్పించి  ఆయన కొత్తవారితో చేసే ప్రయోగాలు ఎక్కువగా బెడిసి కొడుతూనే ఉంటాయి. కొత్త దర్శకుడితో  మరి ఈ రోజు వచ్చిన సినిమా రామారావు ఆన్ డ్యూటీ లో  దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్స్ గా నటించారు. చాలా కాలం తరువాత హీరో వేణు తొట్టెంపూడి ఈ చిత్రంలో నటించారు. ఇప్పటివరకు విడుదలైన చిత్రంలోని సాంగ్స్, ట్రైలర్ బాగా ఆకట్టుకున్నాయి మరి చిత్రం  ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో సమీక్షలో చూద్దాం.

కథ:

ఈ కథ అంతా కూడా 1994 ప్రాంతంలో జరిగినట్టు చూపిస్తారు. రామారావు (రవితేజ) కొన్ని కారణాల వల్ల డిప్యూటీ కలెక్టర్ నుంచి ఎమ్మార్వోగా తన భార్య నందిని (దివ్యాంశ కౌశిక్)తో తన సొంతూరు తిమ్మ సముద్రంకు బదిలీ అవుతాడు. వెరీ సిన్సియర్ ఆఫీసర్. న్యాయం కోసం తన పరిధి దాటి ముందుకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో అనేక ఆరోపణలు సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. అప్పటికే ఆ ఏరియాలో పోలీస్ యస్ఐగా మురళి (వేణు తొట్టెంపూడి) ఉంటాడు. రామారావు ఎప్పటిలాగే అక్కడ కూడా సిన్సియర్ గా పని చేస్తాడు. పెండింగ్ లో ఉన్న అన్నీ కేసులను సాల్వ్ చేస్తాడు. అయితే, ఆ ఊర్లో ఉండే చిన్ననాటి ప్రేయసి మాలిని (రజిషా విజయన్) భర్త సురేందర్ (చైతన్య కృష్ణ) ఏడాది పాటుగా కనిపించకుండా పోతాడు. మిస్ అయింది ఒకరు కాదు.. దాదాపు 20 మంది అని తెలుసుకున్నఆ కేసును ఛేదించేందుకు రామారావు రంగంలోకి దిగుతాడు. ఇందులో ఎస్పీ దేవానంద్ (జాన్ విజయ్) పాత్ర ఏంటి?  అసలు రామారావుకి, మాలినికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి ?, ఇంతకీ మాలిని భర్త ఎలా మిస్ అయిపోయాడు ? అతన్ని వెతికే క్రమంలో రామారావుకి తెలిసిన షాకింగ్ నిజాలు ఏమిటీ ? చివరకు రామారావు సాధించింది ఏమిటి ? ఇంతకీ మాలిని భర్త మిస్ అవ్వడానికి కారణం ఎవరు ? అనేది మిగిలిన కథ.

నటి నటుల హావభావాలు:

ఈ సినిమాలో కూడా ఎప్పటిలాగే రవితేజ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో పాటు, కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. రామారావు పాత్రలో రవితేజ తన అనుభవాన్ని చూపించాడు. యాక్షన్, రొమాన్స్ ఇలా అన్ని యాంగిల్స్‌లో రవితేజ అభిమానులకు నచ్చేస్తాడు. ఓ ప్రభుత్వ అధికారి తలుచుకుంటే ఏమైనా చేయగలడని నిరూపిస్తాడు. ఓ డిప్యూటీ కలెక్టర్‌కు, ఎమ్మార్వోకు ఇన్ని అధికారులున్నాయా? అని అనిపించేలా ఈ పాత్ర తెరపై దూసుకుపోతుంది. అయితే కొన్నిచోట్ల మాత్రం రవితేజ వయసు వల్ల వచ్చిన మార్పులు స్పష్టంగా తెరపై కనిపిస్తాయి. చాలా ఏళ్ల తరువాత ఎంట్రీ ఇచ్చిన వేణుకి మాత్రం ఈ పాత్ర, ఈ సినిమా అంతగా ఉపయోగపడకపోవచ్చు. ఇదేమీ అంత గొప్ప పాత్రలా అనిపించదు. కానీ వేణు మాత్రం అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇక హీరోయిన్లు ఇద్దరికి అంత పెద్ద పాత్రలేమీ కాదు. ఓ సీన్, ఓ సాంగ్ అన్నట్టుగా ఉంటుంది. కానీ రజిష, దివ్యాన్షలు కనిపించినంత సేపు తెరపై ఆకట్టుకుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న నరేష్, పవిత్రలు స్క్రీన్‌పై కనిపిస్తే చాలు  ఈలలు, గోలలతో థియేటర్ దద్దరిల్లిపోయింది. వారి పాత్రలకు అంత ఇంపార్టెన్స్ లేకపోయినా.. థియేటర్లో మాత్రం వాళ్ళ పర్సనల్ న్యూస్ ఇంపాక్ట్ చూపించాయి. నాజర్, సమ్మెట గాంంధీ, జాన్ విజయ్, రాహుల్ రామకృష్ణ ఇలా అందరూ కూడా చక్కగా నటించేశారు.

సాంకేతికవర్గం పనితీరు:

సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా సామ్ సి.ఎస్. సంగీతం సినిమాకు బాగా ప్లస్ అయింది. అదే విధంగా సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ కూడా సినిమాకి హైలైట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన పనితనం చాలా బాగుంది. కాకపోతే  90వ దశకాన్ని చూస్తున్నట్టుగా ఎక్కడా కూడా అనిపించదు. ఇక క్యాస్టూమ్స్ విషయంలో కూడా కేర్ తీసుకోలేదు అయితే నాటి కాలంలోవేనా? అని అనుమానం కలుగుతుంది. ఎడిటర్ ప్రవీణ్ కె.ఎల్ వర్క్ సినిమాకి తగ్గట్టు ఉంది. సినిమాలో నిర్మాత సుధాకర్ చెరుకూరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఇక దర్శకుడి విషయానికొస్తే... కథలోమంచి పాయింట్ తో  మ్యాటర్ ఉన్నపటికీ.. ఆ పాయింట్ కి తగ్గట్టు స్క్రీన్ ప్లే రాసుకోవడంలో దర్శకుడు శరత్ విఫలం అయ్యాడు. ఈ కథలో ఫుల్ యాక్షన్ ఉంది. కానీ.. ఈ విషయంలోనూ సినిమా ఎఫెక్టివ్ గా లేదు అసలు ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ ర‌క్తి కట్టేలా నడిపించాలి. కానీ ఈ సినిమాలో అది మిస్ అయింది. కథలో అనేక అంశాలను జోడించి.. అనవసరమైన ట్రాక్స్ తో బోరింగ్ ప్లేతో దర్శకుడు శరత్ నిరాశ పరిచాడు.

విశ్లేషణ:

రవితేజకు ఇలాంటి కథ కొత్తదే. క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌లన్నింటిని కలిపి దర్శకరచయిత శరత్ మండవ ఈ కథను రాసుకున్నట్టు అనిపిస్తుంది. కానీ, ఇంట్రెస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో ఫేక్ ఎమోషన్స్, ల్యాగ్ సీన్స్ వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి.  మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ తీయాలన్న ఉత్సాహమే ఇందులో కనిపించినట్టు అనిపిస్తుంది. రెండో పార్ట్ ఉంటుందని చివర్లో చెప్పకనే చెప్పేశారు. రెండో పార్ట్ కోసమే అన్నట్టుగా రామారావు ఆన్ డ్యూటీని తెగ సాగదీసినట్టు అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది? ఇంకెంత తిప్పుతాడు అని థియేటర్లో కూర్చున్న జనాలు అనుకునే వరకు వస్తుంది. మొదటి పార్ట్‌లో అసలు కథ మొదలుపెట్టడానికే చాలా సమయం తీసుకున్నాడు. రామారావు డ్యూటీ, నిబద్దత, గొప్పతనం, నిజాయితీ వంటివి చూపించి ఎలివేషన్లు ఇచ్చేందుకే ఎక్కువగా వాడుకున్నట్టు అనిపిస్తుంది. అలా సీన్లు ముందుకు వెళ్తుంటే విశ్రాంతికి ఓ చిన్న పాటి ట్విస్ట్ వస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ చుట్టూ కథ తిరుగుతోందని ముందే హింట్ ఇచ్చేశారు. కానీ ఆ మాల్ కోసం ఓ గ్యాంగ్ తిరగడం, ఈ మిస్సింగ్ కేస్ గురించి రామారావు రంగంలోకి దిగడం వంటి సీన్లతో ప్రథమార్థం పర్వాలేదనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ మాత్రం మరీ సాగదీసినట్టు అనిపిస్తుంది. కావాలనే సీన్లలో ల్యాగ్స్ పెడుతూ, అక్కడే తిప్పి తిప్పి కథనాన్ని రాసుకున్నట్టు అనిపిస్తుంది. దీంతో ఉండాల్సిన థ్రిల్స్, సస్పెన్ కూడా చివరకు నీరుగారిపోయేలా అనిపిస్తుంది. ఇవి చాలవన్నట్టుగా మధ్యలో పాటలు స్పీడ్ బ్రేకర్లా అనిపిస్తాయి. ఓవరాల్ గా ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పొచ్చు.   

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :