ASBL NSL Infratech

'పన్ను'తో లింక్ పెట్టొద్దు ప్లీజ్.. భారత్ అభ్యర్థన..

'పన్ను'తో లింక్ పెట్టొద్దు ప్లీజ్.. భారత్ అభ్యర్థన..

ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత సిఖ్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు అమెరికాలో కుట్ర చేసినట్లు భారతీయులపై వచ్చిన అభియోగాల అంశాన్ని అగ్రరాజ్యం సీరియస్ గా తీసుకుంది. దీనిలో భాగంగా ఎఫ్ బీఐ హెడ్... భారత్ వచ్చి సీబీఐ చీఫ్ తో భేటీ కూడా అయ్యారు. దీనికి సంబంధించి.. ఇప్పటికే అమెరికా మంత్రులు, ఉన్నతాధికారులతో.. భారత్ పలు దపాలుగా మంతనాలు సాగించింది. అయినా కూడా వారు .. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదంటూ అమెరికా స్పష్టం చేస్తోంది. అంతేకాదు.. దీనిపై విచారణ జరపాలంటూ మోడీ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తోంది. ఈ ఒత్తిడికి భారత సర్కార్.. తలొగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.

పన్ను హత్యకు కుట్ర వ్యవహారంపై ప్రధానమంత్రి మోడీ.. తొలిసారి స్పందించారు. భారత దేశ పౌరులు ఇతర దేశాల్లో మంచి లేదా చెడు చేసినట్లు ఇతరులు మనకు సమాచారం ఇస్తే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. అదే సమయంలో భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలతో ముడిపెట్టడం భావ్యం కాదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఒక అంతర్జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ముఖాముఖిలో ఓ ప్రశ్నకు సమాధానంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.

‘‘భారత దేశ పౌరులు ఇతర దేశాల్లో ఏదైనా చేసినట్లు సమాచారం వస్తే దానిపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. చట్టానికి లోబడి పాలన చేసేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా భారత్‌కు వ్యతిరేకంగా కొన్ని ఉగ్రవాద గ్రూపులు విదేశాల్లో కార్యకలాపాలు నిర్వహించడం ఆందోళనకరం. భావప్రకటనా స్వేచ్ఛ పేరుతో వారు హింసను ప్రేరేపిస్తున్నారు. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలతో ముడిపెట్టడం భావ్యం కాదు. ఎంతోకాలంగా రెండు దేశాల మధ్య ద్వైపాక్షికంగా బలమైన సంబంధాలు ఉన్నాయి’’ అని ప్రధాని మోదీ అన్నారు.

కొద్ది రోజుల క్రితం అమెరికా గడ్డపై పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని ఇటీవల అగ్రరాజ్యం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ కుట్ర కేసులో భారత్‌కు చెందిన నిఖిల్‌ గుప్తా ప్రమేయం ఉందంటూ గత నెల అమెరికా అటార్నీ కార్యాలయం ఆరోపించింది. ఇందుకోసం అతడికి ఓ భారత ప్రభుత్వ అధికారి నుంచి ఆదేశాలు అందాయని యూఎస్‌ ఆరోపణలు చేసింది. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసులో అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరుపుతామని ప్రకటించింది. మరోవైపు, 52 ఏళ్ల నిఖిల్ గుప్తాను ఈ ఏడాది జూన్‌లో చెక్ రిపబ్లిక్ అధికారులు అరెస్టు చేశారు.

ప్రస్తుతం అతడు ప్రేగ్‌లోని ఓ జైల్లో ఉన్నాడు. అతడిని తమకు అప్పగించాలని ఆ దేశంపై అమెరికా ఒత్తిడి తెస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై భారత వర్గాలు ఇటీవల స్పందిస్తూ.. ఈ హత్య కోసం నిఖిల్‌కు భారత్‌ నుంచి ఆదేశాలు అందాయని ఆరోపించడం సరికాదని పేర్కొన్నాయి. ఈ కేసులో నిఖిల్‌ గుప్తా దోషిగా తేలితే గరిష్ఠంగా 20 ఏళ్ల జైలు శిక్ష పడనుంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :