పొత్తు సంకేతాలు...

పొత్తు సంకేతాలు...

ఏపీ రాజకీయముఖచిత్రం మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 2014 తరహాలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుతో ఎన్నికల రణరంగంలో దిగే అవకాశాలు ఉన్ప్పట్లు సంకేతాలు వస్తున్నాయి. శనివారం రాత్రి అమిత్ షా, నడ్డాతో చంద్రబాబు భేటీ తర్వాత  పార్టీలు పొత్తుతో ముందుకెళ్లనున్నాయని ఊహాగానాలు వెలువడుతున్నాయి. 2024 ఎన్నికల్లో కలసికట్టుగా ముందుకెళ్థామన్న ప్రతిపాదనపై.. అమిత్ షా, నడ్డా,  చంద్రబాబుచర్చించినట్లు సమాచారం. దీనిపై ప్రాథమికంగా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.

కర్ణాటక ఎన్నికల్లో ఓటమితో.. తెలంగాణలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇవ్వడం కష్టమని ఆ పార్టీలో చేరిన నేతలే భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో తమకు టీడీపీ సహకారం అవసరమని, తెలుగుదేశంతో చేతులు కలిపితే మొత్తం దక్షిణాదిలో పార్టీకి ఊపిరి పోసినట్లవుతుందని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తోందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ఏపీలో ఓవైపు వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తి అండదండలు అందిస్తుందన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ తరుణంలో తెలంగాణలో టీడీపీ సహకారం తీసుకోవాలంటే ఏపీలో కూడా బీజేపీ స్పష్టమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని గుర్తు చేస్తున్నాయి.

రాజకీయాల్లో పరస్పర ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు.. ఇరు వర్గాలు ఆ ప్రయోజనాలను గౌరవిస్తేనే సఖ్యత ఏర్పడుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీ, టీడీపీ రెండూ ఈ విషయాన్ని గుర్తించినట్లు అర్థమవుతోందని విశ్లేషిస్తున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల్లో పరస్పర సహకారానికి చంద్రబాబు వద్ద అమిత్‌ షా ప్రతిపాదన చేసినట్లు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరిగినవి ప్రాథమిక చర్చలే అయినందున.. భేటీ ఫలితాలను నిర్ధారించలేమని, తదుపరి జరిగే చర్చల్లోపు ఇరు వర్గాల నుంచి వచ్చే సంకేతాలే ప్రధానమవుతాయని చెబుతున్నాయి.

తెలంగాణ , ఏపీ ఎన్నికలకు ఇప్పటినుంచే సమగ్ర వ్యూహం రూపొందించుకుని రంగంలోకి దిగాలని బీజేపీ నిర్ణయించిందని ఆ వర్గాలు తెలిపాయి. అందుకే చంద్రబాబుతో వివిధ విషయాలపై అమిత్‌ షా కూలంకషంగా చర్చించారని చెబుతున్నాయి. తెలంగాణలో టీడీపీకి స్నేహహస్తం అందించడంతోపాటు ఏపీలో జగన్‌ విషయంలో పైకి కనిపించిన సానుకూలత తమకేమీ లేదని బీజేపీ అగ్రనేతలు త్వరలోనే సంకేతాలు పంపవచ్చునని ఈ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల విషయం ఎలా ఉన్నా.. ఏపీ, తెలంగాణలో పరిస్థితులు వేరని, అన్నింటినీ బేరీజు వేసుకుని రంగంలోకి దిగాలని బీజేపీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.

2019 ఎన్నికల తర్వాత ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ సమయంలో ఒకసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని చంద్రబాబు కలిశారు. ఆ తర్వాత జీ 20 సన్నాహక సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీకి వెళ్లినప్పుడు మరోసారి భేటీ అయ్యారు. టచ్‌లో ఉండాలంటూ ఆ సందర్భంగా చంద్రబాబుకు ప్రధాని మోదీ సూచించారు. తాజాగా ఢిల్లీలో జేపీ నడ్డా, అమిత్ షాతో చంద్రబాబు భేటీ కావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

 

 

praneet obili-garuda AHA poulomi Png-jewelry aurobindo MUPPA
Tags :