తెలంగాణ కాంగ్రెస్‌ను బాగు చేసే నాథుడెవరు..? కాంగ్రెస్ అంటే ఇంతేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌ను బాగు చేసే నాథుడెవరు..? కాంగ్రెస్ అంటే ఇంతేనా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఆ పార్టీలో ఏం జరుగుతోంది.. ఎవరు ఏం మాట్లాడుతున్నారు.. ఎవరి వ్యూహం ఏంటి.. అనే అంశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరికి వారే.. యమునా తీరే అన్నట్టు తయారైంది ఆ పార్టీలో నేతల పరిస్థితి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కేర్ చేసే నాయకులే లేకుండా పోయారు. పైగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధిష్టానం ఆదేశాలను కూడా ఎవరూ ఖాతరు చేయడం లేదు. ఇదంతా కావాలనే చేస్తున్నారా.. లేకుంటే ఆధిపత్యం కోసం తాపత్రయపడుతున్నారా అనేది కూడా తెలియట్లేదు. లేదంటే కోవర్టు పాలిటిక్స్ ఏమైనా నడుపుతున్నారా.. అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి.

మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ సీటు. దీన్ని కోల్పోవడం ఆ పార్టీకి తీరని నష్టం కలిగించేదే. అయినా పార్టీలో దీని గురించి ఆలోచించేవాళ్లే లేరు. ఆ మాత్రం పోటీ ఇవ్వగలడగమే గొప్ప అన్నట్టు మాట్లాడుతున్నారు నేతలు. సిట్టింగ్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తన నియోజకవర్గంలో బైపోల్ జరుగుతున్నా ఏమాత్రం కేర్ చేయకుండా విదేశాలకు వెళ్లిపోయారు. పైగా సొంత పార్టీ అభ్యర్థిని ఓడించాలని, తన సోదరుడు రాజగోపాల్ రెడ్డిని ఓటేయాలని తన అనుచరులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ ఆడియో బయటకు వచ్చింది. పార్టీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా రిప్లై ఇచ్చారు. కానీ ఇంతవరకూ ఎలాంటి చర్యా తీసుకోలేదు.

మరోవైపు కాంగ్రె స్ పార్టీలో సీనియర్ నేతగా గుర్తింపు పొందిన మర్రి శశిధర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అంతకుముందే ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించింది అధిష్టానం. అది వేరే సంగతి. అయితే ఆయన పార్టీకి రిజైన్ చేస్తూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర విమర్శలు గప్పించారు. కాంగ్రెస్ పార్టీని ప్రైవేట్ పార్టీగా మార్చేశారని దుయ్యబట్టారు. రేవంత్ తీరు పార్టీకి తీరని నష్టం కలిగిస్తుందని సోనియా గాంధీకి లేఖ రాశారు. తనకు పీసీసీ పదవి దక్కించుకునేందుకు 25 కోట్లు ముట్టజెప్పారని ఆరోపించారు. పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేకుండా పోయిందని.. రేవంత్ రెడ్డి తన అనుచరులతో పార్టీ నేతలపైనే అసత్యాలు ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ - కాంగ్రెస్ పార్టీ కలిసి పని చేస్తున్నాయని విమర్శించారు. ఇది తీవ్ర కలకలం రేపుతోంది.

మర్రి శశిధర్ రెడ్డి రాజీనామా నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తీరు వల్లే పార్టీకి నష్టం కలుగుతోందన్నారు. తనకు పీసీసీ పగ్గాలు ఇస్తే పార్టీని గాడిలో పెడతానన్నారు. మాణిక్కం ఠాగూర్ రేవంత్ చెప్పినట్టు నడుచుకుంటున్నారని.. దీనివల్ల సీనియర్లకు అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఇదే తీరుగా పార్టీ నడిస్తే భవిష్యత్తులో మరింత నష్టం కలుగుతుందని హెచ్చరించారు. ఇలా కొంతమంది నేతలు బహిరంగంగానే పార్టీపైన, నేతలపైన విమర్శలు చేస్తున్నారు. ఇక అంతర్గత అసంతృప్తుల సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్న పీసీసీ సమావేశాలకు సీనియర్లు కూడా హాజరు కావడం లేదు. గైర్హాజరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి షోకాజ్ నోటీసులు పంపించారు. అయితే షోకాజ్ నోటీసులు పంపడానికి ఇదేమైనా కార్పొరేట్ కంపెనీనా అని ప్రశ్నిస్తున్నారు సీనియర్లు.

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేపథ్యంలో నేతలంతా ఒక్కతాటిపైకి వచ్చినట్టు కనిపించారు. అందరూ కలిసి పని చేయాలని రాహుల్ గాంధీ కూడా సూచించారు. ఆయన ముందు తలూపిన నేతలంతా ఇప్పడు మళ్లీ నోటికి పని చెప్తున్నారు. పార్టీలో ఇంత జరుగుతున్నా అధిష్టానం కూడా చూస్తూ మిన్నకుండిపోతోంది. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పార్టీ ఉందని అర్థమవుతోంది. తెలంగాణను ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి గుర్తింపు ఉంది. అంతేకాదు.. బీజేపీతో పోల్చితే కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా మంచి పట్టుంది. కానీ నేతల తీరు వల్ల పార్టీ తీవ్రంగా నష్టపోతోంది. దీన్ని ఎవరు గాడిలో పెడతారో చూడాలి మరి.

 

Tags :