తెలంగాణ కాంగ్రెస్ లో భారీ ప్రక్షాళన..! ఇక నోరు జారితే వేటే..!!

తెలంగాణ కాంగ్రెస్ లో భారీ ప్రక్షాళన..! ఇక నోరు జారితే వేటే..!!

కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలంగాణ పెద్ద తలనొప్పిగా మారింది. తెలంగాణ కలను సాకారం చేసిన పార్టీ కాంగ్రెస్. తెలంగాణ ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ లాంటి కంచుకోటను కోల్పోయింది ఆ పార్టీ. కనీసం ఇచ్చిన కృతజ్ఞత అయినా తెలంగాణలో దక్కుతుందని ఆశించింది. కానీ అది నెరవేరలేదు. 2014లో కానీ, 2018లో కానీ ఆ పార్టీ ఇక్కడ ఓడిపోయింది. ప్రతిపక్ష స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఆ ప్రతిపక్ష స్థానమైనా దక్కుతుందా అనేది కూడా అనుమానంగా మారింది. కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి టీఆర్ఎస్ లో చేరిపోయారు. ఇక అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు బీజేపీ గూటికి చేరారు. ఇంకా ఇలాంటి వలసల పరంపర కొనసాగుతోంది. మునుగోడు సిట్టింగ్ స్థానంలో డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. మరోవైపు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై సీనియర్లు బహిరంగంగానే విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో పరిణామాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కొరకరాని కొయ్యగా మారాయి. అందుకే పూర్తిస్థాయిలా ప్రక్షాళన చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చుట్టూనే వివాదాలు చుట్టుముడుతున్న విషయాన్ని అధిష్టానం గ్రహించింది. దీంతో రేవంత్ రెడ్డికి గట్టిగా క్లాస్ పీకినట్టు సమాచారం. అందరినీ కలుపుకు పోవడంతో మీరు విఫలమవుతున్నారా.. లేకుంటే మీతో కలసి వచ్చేందుకు వాళ్లు సిద్ధంగా లేరా.. అనే అంశంపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి కాకుండా మిగిలిన నేతలెవరూ పీసీసీని నడిపించేంత స్థాయి లేదని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తంది. కాబట్టి రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ గా కంటిన్యూ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే అందరినీ కలుపుకుపోయేలా పనిచేయాలని రేవంత్ కు గట్టిగా సూచించనున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. పార్టీ గీత దాటి వ్యవహరిస్తున్నవారికి, అలాగే యాక్టివ్ గా పని చేయని వాళ్లను పదవుల నుంచి తప్పించే అవకాశం ఉంది. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్న జగ్గారెడ్డి, గీతారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్.. తదితరులను తొలగించే అవకాశం స్పష్టంగా ఉంది. జగ్గారెడ్డి నోరు జారుతుండడం, మిగిలిన వాళ్లు యాక్టివ్ గా లేకపోవడం కారణాలుగా కనిపిస్తున్నాయి. అలాగే అధికార ప్రతినిధులలో కూడా కొంతమందిని తప్పించనున్నారు. హరివర్ధన్ రెడ్డి, నేరెళ్ల శారదపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం. ఇక ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ బాధ్యతల నుంచి మహేశ్వర్ రెడ్డిని తప్పించనున్నారు. వేం నరేందర్ రెడ్డి, పటేల్ రమేశ్ రెడ్డిలకు ప్రమోషన్ దక్కుతుందని భావిస్తున్నారు. అలాగే మెజారిటీ డీసీసీ అధ్యక్షులను మార్చనున్నారు. ఇక కొరకరాని కొయ్యగా మారిన సీనియర్లకు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో చోటు దక్కించే ఛాన్స్ ఉంది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు 50 ఏళ్ల లోపు వాళ్లకు కీలక పదవులు కట్టబెట్టనున్నారు.

అంతేకాక.. ఇకపై పార్టీపై ఎవరైనా నోరు జారితే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడకూడదని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని.. ఇకపై అలాంటివి సహించబోమని క్లారిటీ ఇచ్చినట్టు సమాచారం. పార్టీ ఇన్ ఛార్జ్ లపైన కూడా ఆరోపణలు చేస్తుండడాన్ని పార్టీ అధిష్టానం సీరియస్ గా పరిగణిస్తోంది. అందుకే ఇకపై అలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని రేవంత్ రెడ్డికి కూడా సూచించినట్లు సమాచారం.

 

Tags :