ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

మోదీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా..?

మోదీ కూడా ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నారా..?

వచ్చే ఏడాది మేలో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. అప్పటివరకూ మోదీకి పదవీకాలం ఉంది. అయితే ఈ లోపే ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మోదీకి ఇప్పుడే ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అయినా ఆయన ఎందుకు ముందస్తు ఎన్నికలపై ఆలోచిస్తున్నారు? గతంలో జమిలి ఎన్నికలకు మొగ్గు చూపిన మోదీ.. ఇప్పుడు ముందస్తుకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది..? లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. అయితే ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ మాసాల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఏడాదే గడువుంది. ఇక జమ్ము కాశ్మీర్ లో కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడ రాష్ట్రపతి పాలన అమల్లో ఉంది. దాన్ని కూడా కలిపితే మొత్తం ఆరు రాష్ట్రాలు. ఇవన్నీ కూడా కీలకమైన రాష్ట్రాలే కావడంతో వీటితో పాటే లోక్ సభ ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుందనే ఆలోచన బీజేపీ పెద్దల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అనంతరం బీజేపీ పాలిత ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ముందస్తు ఎన్నికలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని సూచించారు. దీంతో ముందస్తు ఎన్నికలు ఊహాగానాలు మొదలయ్యాయి.

కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. పొత్తులు లేకుండానే ఏకపక్ష విజయాన్ని అందుకుంది. ఇది బీజేపీ అస్సలు ఊహించలేదు. తాము అధికారంలోకి వస్తామని, లేకుంటే హంగ్ వస్తుందని భావించింది. కానీ అలా జరగలేదు. పైగా కర్నాటక ఎన్నికల ఫలితాలు, రాహుల్ భారత్ జోడో యాత్ర, ఆయనపై అనర్హత వేటు.. లాంటి అనేక అంశాలు కాంగ్రెస్ బలోపేతానికి కారణమవుతున్నాయి. వచ్చే ఏడాది నాటికి మరింత బలపడుతుందని, విపక్షాలను కలుపుకుని తమకు సమస్యగా మారుతుందని బీజేపీ భావిస్తోంది. అందుకే కాంగ్రెస్ పార్టీకి, విపక్షాలకు అంత సమయం ఇవ్వకుండా ఈ రాష్ట్రాలతో పాటే ఈ ఏడాది చివర్లో లోక్ సభ ఎన్నికలకు కూడా వెళ్తే బాగుంటుందని బీజేపీ ఆలోచిస్తున్నట్టు సమాచారం.

6 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ తో పాటు దానితో జతకట్టే విపక్షాలను కట్టడి చేసేందుకు అవకాశం ఉంటుందని కమలం పార్టీ భావిస్తోంది. రాష్ట్రాల్లో అదికారమే పరమావధిగా కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ ను కట్టడి చేయాలంటే 6 రాష్ట్రాల ఎన్నికలతో పాటు లోక్ సభ ఎన్నికలు నిర్వహించడమే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

మరోవైపు... జమిలి ఎన్నికల ఆలోచన కూడా ముందస్తు ఎన్నికలకు మరో కారణంగా భావించవచ్చు. వచ్చే ఏడాది లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం లాంటి రాష్ట్రాల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఒక్క సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో బీజేపీ పాత్ర శూన్యం. ఈ ఏడాది 6 రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాలకు కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తే దాదాపు 10 రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. మున్ముందు ఇలాగే కాస్త ముందు వెనుక ఎన్నికలు జరిగే రాష్ట్రాలను కలుపుకుపోవచ్చు. తమ జమిలి ఎన్నికల ప్రతిపాదనను ఈసారి అమల్లోకి తీసుకురావచ్చు. అందుకోసమే ముందస్తు ఎన్నికలపై మోదీ సీరియస్ గా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :