ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

నేషనల్ పాలిటిక్స్ కు కేసీఆర్ బ్రేక్.. అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్..!

నేషనల్ పాలిటిక్స్ కు కేసీఆర్ బ్రేక్.. అసెంబ్లీ ఎన్నికలపైనే ఫోకస్..!

వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనే పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చేశారు కేసీఆర్. ఆయన ఊపూ ఉత్సాహం చూసిన తర్వాత అందరూ కేసీఆర్ ఏదో చేయబోతున్నారని అనుకున్నారు. కచ్చితంగా జాతీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తారని.. ఆయన అనుకుంటే ఏదైనా చేస్తారని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే మొదట్లో ఉన్నంత స్పీడ్ ఇప్పుడు కనిపించడం లేదు. దీంతో కేసీఆర్ ఉత్సాహం నీరుగారిపోయిందని అందరూ ఎద్దేవా చేయడం మొదలుపెట్టారు. అయితే కేసీఆర్ వ్యూహాత్మకంగానే నేషనల్ పాలిటిక్స్ కు బ్రేక్ ఇచ్చారని సమాచారం.

తెలంగాణ నేతగా పేరొందిన కేసీఆర్.. ఇప్పుడు దేశ్ కీ నేతగా మారిపోయారు. పార్టీని కూడా జాతీయస్థాయికి తీసుకెళ్లాలని పేరు కూడా మార్చేశారు. అందులో భాగంగా ఢిల్లీలో జాతీయ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. వివిధ రాష్ట్రాల్లో పర్యటించి పార్టీ విస్తరణ కార్యక్రమాలపై చర్చించారు. మహారాష్ట్ర, కర్నాటక, ఏపీ.. లాంటి రాష్ట్రాల నేతలతో నిత్యం మంతనాలు సాగిస్తున్నారు. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన పలువురు నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అక్కడ పార్టీ నేతలు కొంత యాక్టివ్ గా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే మహారాష్ట్ర లాగా మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ కార్యక్రమాలు సాగట్లేదు.

అయితే వ్యూహాత్మకంగానే కేసీఆర్ జాతీయ రాజకీయాలను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పూర్తిగా తెలంగాణ రాజకీయాలపైనే ఆయన దృష్టి పెట్టాలని నిర్ణయించారు. గతంలో ఉన్నంత సులువుగా ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో లేదు. అందుకే విపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదనుకుంటే తెలంగాణపై పూర్తి పట్టు సాధించాలి. అందుకే తెలంగాణలో నెగ్గి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు కేసీఆర్. ఇంట గెలిచినప్పుడు రచ్చ గెలవడం ఈజీ.. అందుకే ఆ పనుల్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు కేసీఆర్.

పైగా జాతీయ రాజకీయాలన్నీ గందరగోళంగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ వెంట వెళ్లే పార్టీలేవో అర్థం కావట్లేదు. ఏ పార్టీ ఎప్పుడు ఎవరితో కలుస్తుందో అర్థంకాని పరిస్థితి ఉంది. కాంగ్రెస్, బీజేపీలకు సమానదూరం పాటించాలనే ఆలోచనతో ఉన్నారు కేసీఆర్. తెలంగాణలో గెలిస్తే అప్పుడు తన వెయిటేజ్ కూడా పెరుగుతుందని, ఆ పార్టీలో తన వెంట పడ్తాయని నమ్ముతున్నారు. అందుకే ఇప్పుడు పూర్తిగా అసెంబ్లీ ఎన్నికలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇక్కడ గెలిచి తన సత్తా ఏంటో దేశానికి చాటాలనుకుంటున్నారు. 

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :