ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఈసారి కర్నాటక కాంగ్రెస్‌దే..! ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర అంశాలు

ఈసారి కర్నాటక కాంగ్రెస్‌దే..! ఒపీనియన్ పోల్‌లో ఆసక్తికర అంశాలు

కర్నాటక ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందనేదానిపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. అధికార బీజేపీయే మళ్లీ గెలుస్తుందని.. అయితే గతంలో వచ్చినన్ని సీట్లు ఈసారి రాకపోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే బీజేపీ పనైపోయిందని.. కాంగ్రెస్ దే ఈసారి గెలుపని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. జేడీఎస్ మాత్రం ఎప్పటిలాగే తానే కింగ్ మేకర్ అని.. కాంగ్రెస్, బీజేపీలలో ఎవరికి సీట్లు తగ్గినా సీఎం పీఠం తమదేనని కాచుకుని ఉంది. అయితే ప్రీపోల్ సర్వే మాత్రం కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతోంది.

కర్నాటక ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేదానిపై ఏబీపీ – సీ ఓటర్ సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈసారి జనం బీజేపీపై విరక్తి చెందినట్లు ఒపీనియన్ పోల్ లో స్పష్టమైంది. జనం కాంగ్రెస్ పార్టీకే జై కొట్టబోతున్నట్టు తేలింది. కాంగ్రెస్ పార్టీకి 115-127 సీట్లు వస్తాయని ఏబీపీ – సీ ఓటర్ అంచనా వేసింది. ఇక ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీకి 68 నుంచి 80 స్థానాలు రావచ్చని తేల్చింది. కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్ 23 నుంచి 35 సీట్ల వరకూ సాధించే అవకాశం ఉన్నట్టు తెలిపింది.

మొత్తం 225 అసెంబ్లీ స్థానాలున్న కర్నాటకలో ప్రాంతాలవారీగా కూడా ఏబీపీ – సీ ఓటర్ ఒపీనియన్ పోల్ వివరాలను వెల్లడించింది. ముంబై కర్నాటక ఏరియాలో 50 అసెంబ్లీ సీట్లున్నాయి. ఇక్కడ బీజేపీ – కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని తేల్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 25-29 సీట్లు, బీజేపీకి 21-25 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. 21 స్థానాలున్న కోస్టల్ కర్నాటకలో బీజేపీకి కాస్త ఎడ్జ్ ఉందని తెలిపింది. ఇక్కడ బీజేపీకి 9-13 స్థానాలు, కాంగ్రెస్ కు 8-12 సీట్లు వస్తాయని తేల్చింది. ఇక సెంట్రల్ కర్నాటకను బీజేపీకి కంచుకోటగా భావిస్తారు. అయితే ఇక్కడ కూడా ఈసారి కమలం పార్టీ వెనకబడుతున్నట్టు అర్థమవుతోంది. ఇక్కడున్న 35 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 18-22 సీట్లు, బీజేపీ 12-16 సీట్లు సాధించుకుంటాయని ఒపీనియన్ పోల్ తెలిపింది.

ఓల్డ్ మైసూర్ ఏరియాలో మాత్రం జేడీఎస్ కు తిరుగులేదని తేలింది. ఇక్కడ మొత్తం 55 స్థానాలున్నాయి. ఇందులో జేడీఎస్ కు 26-27 సీట్లు, కాంగ్రెస్ కు 24-28 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక్కడ బీజేపీ ప్రభావం నామమాత్రమే. ఆ పార్టీకి 1-5 సీట్లు మాత్రమే వస్తాయని తేల్చింది. బెంగళూరు సిటీలో కాంగ్రెస్ ఈసారి అత్యధిక సీట్లు గెలుచుకోవచ్చని తేలింది. ఇక్కడ కాంగ్రెస్ కు 15-19 సీట్లు, బీజేపీకి 11-15 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

ఓవరాల్ గా బీజేపీపై 50 శాతం మంది వ్యతిరేకంగా ఉన్నట్టు ఏబీపీ సీ ఓటర్ తేల్చింది. ముఖ్యంగా సీఎం బస్వరాజ్ బొమ్మై పనితీరుపై 47 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీఎం గా సిద్ధరామయ్యకు 39 శాతం మంది మద్దతు తెలిపారు. మరి తుది ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాల్సి ఉంది. ఇక్కడ మే 10న పోలింగ్ జరగనుంది. 13న ఫలితాలు వెల్లడవుతాయి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :