MKOne TeluguTimes-Youtube-Channel

బీజేపీకి కన్నా గుడ్ బై? ఎల్లుండే జనసేనలో చేరిక!

బీజేపీకి కన్నా గుడ్ బై? ఎల్లుండే జనసేనలో చేరిక!

దేశవ్యాప్తంగా బీజేపీ విజయవిహారం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆ పార్టీ పరిస్థితి అధ్వాన్నంగా ఉంది. అయితే అక్కడున్న పార్టీలన్ని బీజేపీ అనుకూల పార్టీలుగా గుర్తింపు పొందడంతో మరే రాష్ట్రంలో లేనంత బలంగా బీజేపీకి అక్కడ బలం ఉందని చెప్పుకోవచ్చు. అందుకే బహుశా ఏపీలో పార్టీ బలోపేతానికి బీజేపీ అధిష్టానం పెద్దగా ప్రయత్నిస్తున్న దాఖలాలు కనిపించటం లేదు. అంతర్గత పోరుతో ఆ పార్టీ వీధికెక్కుతున్నా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కూడా లేదు. తాజాగా ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ వ్యవహారం బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే వార్తలు ఊపందుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏలూరు జిల్లా భీమవరంలో జరుగుతోంది. ఆ పార్టీ జాతీయ నేతలు సహా రాష్ట్ర కార్యవర్గం మొత్తం ఈ సమావేశానికి హాజరవుతోంది. పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు మురళీధరన్, డాక్టర భారతి ప్రవీణ్ పవార్ కూడా ఈ మీటింగ్ కు హాజరయ్యారు. జాతీయ నేతలు సునీల్ ధియోధర్, శివప్రకాశ్ తో పాటు ఎంపీ సీఎం రమేశ్, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, అంబికా కృష్ణ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 2024 ఎన్నికల కార్యాచరణతో పాటు, పొత్తులు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా కన్నా దూరంగా ఉన్నారు.

పార్టీ బలోపేతానికి ఒకవైపు రాష్ట్ర కార్యవర్గమంతా సమావేశమై చర్చిస్తుంటే ఆ పార్టీ తాజా మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణే ఆ మీటింగుకు డుమ్మా కొట్టడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. కన్నా లక్ష్మినారాయణకు కూడా ఆహ్వానం పంపినట్లు పార్టీ నేతలు చెప్తున్నారు. అయినా కన్నా పార్టీ మీటింగ్ కు హాజరు కాలేదు. ఇటీవల కొన్ని సందర్భాల్లో పార్టీ తీరుపై కన్నా లక్ష్మినారాయణ విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిని బహిరంగంగానే తప్పుబట్టారు. పార్టీ సీనియర్ నేతలైన తమకు కూడా పార్టీలో ఏం జరుగుతోందో తెలియట్లేదనన్నారు. పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం తమకు చెప్పడం లేదన్నారు. మొదటి నుంచి సోము వీర్రాజు వ్యవహార శైలిపై పార్టీలో అసంతృప్తి ఉంది. అయితే ఎవరూ కన్నా లక్ష్మినారాయణ లాగా బహిరంగంగా చెప్పలేదు. కన్నా ఆలా మాట్లాడేసరికి ఆయన పార్టీ మారడం ఖాయమనే ఊహాగానాలు ఊపందుకున్నాయి.

ఇటీవల జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్.. కన్నా లక్ష్మినారయణ నివాసానికి వెళ్లి ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో కన్నా లక్ష్మినారాయణ జనసేనలో చేరడం ఖాయమని వార్తలు వినిపించాయి. ఇప్పుడు భీమవరంలో జరుగుతున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కన్నా డుమ్మా కొట్టడంతో కన్నా పార్టీ మార్పు ఖాయమని అర్థమవుతోంది. రెండ్రోజుల్లోనే ఆయన పార్టీ మారుతారని సమాచారం. ఈ నెల 26న కన్నా లక్ష్మినారాయణ జనసేనలో చేరబోతున్నట్టు తెలుస్తోంది. రేపటి నుంచి రెండ్రోజుల పాటు పవన్ కల్యాణ్ మంగళగిరిలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మినారాయణ జనసేన పార్టీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. 

 

 

Tags :