ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

చైనాలో కరోనా కల్లోలం..! ఎక్కడ బెడిసికొట్టింది..?

చైనాలో కరోనా కల్లోలం..! ఎక్కడ బెడిసికొట్టింది..?

కరోనా విలయంలో చిక్కుకుని చైనా విలవిలలాడిపోతోంది. రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. వచ్చే మూడు నెలల్లో దారుణమైన పరిస్థితులు చూడబోతున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. చైనాలోనే పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన బీభత్సం అంతాఇంతా కాదు. ఇప్పుడు మరోసారి చైనాలోనే మరణమృదంగం మోగిస్తోంది కరోనా. దీంతో ఈసారి ఇంకెలాంటి భయానక పరిస్థుతులను చూడాల్సి వస్తుందోనని ప్రపంచమంతా వణికిపోతోంది.

చైనాలో కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి అక్కడి ప్రభుత్వం ప్రజలపై దారుణమైన ఆంక్షలు విధించింది. జీరో కోవిడ్ పాలసీ పేరుతో కఠినమైన నిబంధనలు పెట్టింది. దీంతో ఇల్లు దాటి బయటకు వచ్చే వీలు లేకుండా పోయింది. కోటి జనాభా ఉన్న నగరాలు సైతం నెలల తరబడి లాక్ డౌన్ లో మగ్గిపోయాయి. దీంతో అప్పట్లో చైనాలో కరోనా కేసులు భారీగా తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుంటే చైనాలో మాత్రం తక్కువగా నమోదవడం అప్పట్లో ఆశ్చర్యం కలిగించింది. చైనా ప్రపంచంపై కరోనా వైరస్ ను వదిలి తాను మాత్రం చోద్యం చూస్తోందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. అయితే అప్పడు చైనా ప్రభుత్వం విధించిన కఠిన ఆంక్షల వల్ల జనం బయటకు రాలేకపోయారు. దీంతో కరోనా కేసులు తక్కువగా నమోదయ్యాయి.

ఇప్పుడు చైనా జీరో కోవిడ్ పాలసీని ఎత్తేస్తూ వస్తోంది. దీంతో ఇప్పుడు కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. చైనా కోవిడ్ నిబంధనలు ఎత్తివేస్తే కేసులు భారీగా నమోదవుతాయని ముందు నుంచి అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతోంది. సుమారు మూడేళ్లపాటు చైనాలో జీరో కోవిడ్ పాలసీ అమల్లో ఉంది. అయితే ఈ నెల 7 తర్వాత జీరో కోవిడ్ పాలసీని పాక్షికంగా ఎత్తేసింది చైనా ప్రభుత్వం. ఆ వెంటనే కోవిడ్ కేసులు ఒక్కసారిగా పెరగడం మొదలయ్యాయి. నెల రోజులు కూడా కాకముందే రోజూ లక్షల్లో కేసులు నమోదవుతున్నాయి. వందల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నెలలోనే ఇప్పటివరకూ 25 కోట్ల మంది కరోనా బారిన పడి ఉంటారని అంచనా వేస్తున్నారు. మున్ముందు మరింత మంది కరోనా బారిన పడతారని చెప్తున్నారు. ఇప్పటికే ఆసుపత్రుల్లో బెడ్లు ఖాళీలు లేవు. ఆక్సిజన్ కొరత ఏర్పడుతోంది. ఆసుపత్రుల్లో దృశ్యాలు దారుణంగా ఉన్నాయి. ఇక శ్మశానవాటికలు కూడా నిండిపోయాయి.

కోవిడ్ వెలుగులోకి రాగానే చైనా వ్యాక్సిన్ పై దృష్టి పెట్టింది. తాము వ్యాక్సిన్ అభివృద్ధి చేసామని చెప్పుకుని ప్రజలందరికీ వేయడం మొదలు పెట్టింది. అయితే ఒమిక్రాన్ తరహా వేరియంట్లను తట్టుకునే సామర్త్యం ఆ వ్యాక్సిన్ కు లేదని ఇప్పుడు అర్థమవుతోంది. పైగా నిర్బంధంగా ప్రజలను ఇళ్లకే పరిమితం చేయడంతో ప్రజల్లో ఇమ్యూనిటీ లేకుండా పోయింది. ఇప్పుడు ఒక్కసారిగా జనం బయటకు రావడంతో కరోనా విలయ తాండవం చేస్తోంది. ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాలవల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రజలు ఆరోపిస్తున్నారు.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :