ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

జగన్ కూడా వరాలు కురిపిస్తారా..? విశ్వసనీయతకే ఓటేయమని కోరతారా?

జగన్ కూడా వరాలు కురిపిస్తారా..? విశ్వసనీయతకే ఓటేయమని కోరతారా?

తెలుగుదేశం పార్టీ ఎన్నికల తేనెతుట్టెను కదిపింది. ఏడాది ముందే మేనిఫెస్టో టీజర్ ను వదిలింది. అటు ప్రజల్లో, ఇటు పార్టీలో భారీ చర్చనే లేవనెత్తింది. టీజర్ ఇలా ఉంటే ఇక ట్రైలర్, సినిమా ఎలా ఉంటుందో చూడాలంటూ టీడీపీ నేతలు సవాల్ విసురుతున్నారు. దీంతో అధికార వైసీపీ ఇంకెలాంటి హామీలతో ముందుకొస్తుందోననే చర్చ సర్వత్రా మొదలైంది. టీడీపీ మేనిఫెస్టోను మించి హామీలు కురిపిస్తారా.. లేకుంటే తాను నమ్ముకున్న నవరత్నాలకు మరింత మెరుగులద్ది విశ్వసనీయతకే ఓటేయమంటారా.. అనేది ఆసక్తిగా మారింది.

ప్రతి ఎన్నికల ముందు పార్టీలు మేనిఫెస్టోలను ప్రకటించడం ఆనవాయితీ. ఎన్నికల్లో గెలిస్తే తాము ఏం చేయబోతామో మేనిఫెస్టోల్లో పార్టీలు ప్రకటిస్తాయి. దాన్ని భగవద్గీతగా భావించి అధికారంలోకి వస్తే వాటిని నెరవేర్చేందుకు ప్రయత్నిస్తుంటాయి. అయితే అధికారంలోకి వచ్చేంత వరకే మేనిఫెస్టోలు అని.. ఆ తర్వాత వాటిని బుట్టదాఖలు చేయడం కామన్ అనే పేరు పార్టీలకు ఉంది. చాలా పార్టీలు ఇలా మేనిఫెస్టోలను ఎన్నికల తర్వాత కనీసం కనపడకుండా చేస్తుంటాయి. అయితే మేనిఫెస్టోల రూపురేఖలను మార్చిన వ్యక్తి మాత్రం వైసీపీ అధినేత జగన్ అని చెప్పొచ్చు.

2019 ఎన్నికల ముందు వరకూ మేనిఫెస్టోలు అంటే పెద్ద పెద్ద బుక్ లెట్లు ఉండేవి. అసలు దాన్ని చదివే ఓపిక కూడా ఎవరికీ ఉండేది కాదు. కానీ జగన్ మాత్రం మేనిఫెస్టోను కుదించేశారు. తాను చెప్పాలనుకున్న, చేయాలనుకున్న పనులను సింపుల్ గా ఒక్క పేపర్ కు పరిమితం చేశారు. తాను అధికారంలోకి వస్తే నవరత్నాలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ తాను నెరవేర్చకపోతే మళ్లీ ఓటు అడగబోనని ముందే చెప్పేశారు. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన వెంటనే నవరత్నాలు అమలు చేయడమే పరమావధిగా జగన్ పని చేశారు. అందులో చాలావరకూ హామీలను నెరవేర్చారు. మద్యపాన నిషేధం లాంటివి మాత్రం ఇంకా పెండింగులో ఉన్నాయి.

అయితే ఇప్పుడు ఎన్నికలు వైసీపీకి చాలా కీలకం. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి మరింత జాగ్రత్తగా మేనిఫెస్టో తయారు చేయాల్సి ఉంటుంది. గత మేనిఫెస్టోను ఏమేరకు అమలు చేయాలో చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఈసారి మళ్లీ గెలిస్తే ఏం చేస్తామో కూడా వివరించాలి. ఏదైనా కొత్త హామీ ఇస్తే ఇప్పుడెందుకు అమలు చేయలేదు.. అధికారంలో ఉండేది మీరే కదా.. అనే ప్రశ్న ఎదురవుతుంది. అలాగే ప్రతిపక్ష పార్టీని మించి హామీలు లేకపోతే రేసులో వెనుకబడిపోతుంది. అయితే గతంలో ప్రతిపక్షం ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే అపవాదు ఉంది. కాబట్టి తాను అలా కాదని, అలవికాని హామీలను ఇవ్వనని జగన్ చెప్పుకునే అవకాశం ఉంది. మరి అలా తన విశ్వసనీయతకే ఓటేయమని అడుగుతారా.. లేకుంటే రేసులో వెనుకబడిపోతామని టీడీపీని మించి హామీలిస్తారా.. అనేది వేచి చూడాలి.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :