కాలం చెల్లుతున్న విభజన చట్టం..! హామీలు హుష్ కాకేనా?

కాలం చెల్లుతున్న విభజన చట్టం..! హామీలు హుష్ కాకేనా?

విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ ఎంత నష్టపోయిందో తెలిసిన విషయమే. రాష్ట్ర విభజన వల్ల కలిగిన నష్టాన్ని పూడ్చేందుకు అప్పటి కేంద్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. వీటిని విభజన చట్టంలో కూడా పొందుపరిచింది. అయితే ఇప్పటికీ అనేక విభజన హామీలు.. హామీలుగానే మిగిలిపోయాయి. ఇంకో ఏడాదిన్నరలో విభజన చట్టం వల్ల కలిగే ప్రయోజనాలకు కూడా కాలం చెల్లుతుంది. పదేళ్లపాటు అమల్లో ఉండేలా విభజనచట్టంలో పలు అంశాలను పొందుపరిచారు. 2024 జూన్ 2 నాటికి ఈ చట్టానికి నూకలు చెల్లుతాయి. అయినా ఇప్పటికీ అవి ఆచరణలోకి రాకపోవడంతో ఇక వాటిపైన ఆశలు వదిలేసుకోవాల్సిందే అనే ఆవేదన, ఆందోళన ఏపీ వాసుల్లో కనిపిస్తోంది.

2014 జూన్ 2 నుంచి విభజన చట్టం అమల్లోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. అప్పటి నుంచి రెండు ప్రత్యేక రాష్ట్రాలు అమల్లోకి వచ్చాయి. హైదరాబాద్ ను ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు ప్రకటించింది విభజన చట్టం. అయితే అప్పటి సీఎం చంద్రబాబు మూడేళ్లకే హైదరాబాద్ వదిలేసి అమరావతిని రాజధానిగా ప్రకటించి వెళ్లిపోయారు. దీంతో హైదరాబాద్ పైన కూడా హక్కు లేకుండా పోయింది. ఇక మిగిలిన అంశాల విషయానికొస్తే ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం జాతీయ ప్రాజెక్టు, రైల్వే జోన్ లాంటి అంశాలను కూడా విభజన చట్టం వెల్లడించింది. 2014లో చంద్రబాబు, 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు. రెండు పార్టీలు మారాయి. అయినా ఈ చట్టంలోని హామీలు మాత్రం ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు తయారయ్యాయి.

విభజన చట్టం ప్రకారం ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. అయితే అప్పటి సీఎం చంద్రబాబు మొదట్లో ప్రత్యేక హోదాకు ఒప్పుకున్నారు. అయితే ఆ తర్వాత ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం హోదా ముగిసిన అధ్యాయమని తేల్చి చెప్తోంది. దాని స్థానంలో ప్యాకేజీ ఇవ్వాలని కోరితే.. ఇప్పటికే పలు మార్గాల్లో నిధులు అందించామని చెప్తోంది. ఇక రాజధాని ఏర్పాటుకు ఆర్థిక సాయం చేస్తామని విభజన చట్టం వెల్లడించింది. అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించిన తర్వాత అప్పటి ప్రధాని హోదాలో మోదీ శంకుస్థాపనకు హాజరయ్యారు. ఆ సమయంలో నిధులు ఇస్తామని ప్రకటించలేదు.. నీళ్లు - మట్టి తీసుకొచ్చారు. అయితే అమరావతి నిర్మాణానికి సుమారు 2వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కేంద్రం చెప్తోంది. అయితే అప్పటి సీఎం చంద్రబాబు అమరావతిలో కట్టిన అసెంబ్లీ, సెక్రటేరియేట్ లు తాత్కాలికం అని చెప్పడంతో నిధులన్నీ వాటికి ఖర్చయిపోయాయి. శాశ్వత నిర్మాణాలకు నిధులు లేకుండా పోయాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలును కూడా రాజధాని చేసే ఉద్దేశంతో ఉండడంతో రాజధానికి కేంద్రం నుంచి నిధులు ఆశించడం అత్యాశే అవుతుంది.

ఇక ఏపీకి పోలవరం జీవనాడి అవుతుందని అందరూ అనుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అయితే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం ప్రాజెక్టును తామే కట్టుకుంటామని, నిధులు తమకు ఇవ్వాలని కోరడంతో కేంద్రం అంగీకరించింది. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత కూడా ఇదే విధానం అమల్లో ఉంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, నిర్మాణంలో లోపాలు.. లాంటి అనేక అంశాలు ఈ ప్రాజెక్టుకు శాపాలుగా మారాయి. మరోవైపు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టును రాష్ట్ర ఖర్చులతో మూడేళ్లలో పూర్తి చేసిన కేసీఆర్.. దాని ఫలాలను ప్రజలకు అందిస్తున్నారు. కానీ ఏపీలో పోలవరం ప్రాజెక్టు మాత్రం రాజకీయాల మధ్య నలిగిపోతోంది.

ఇక విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టం పేర్కొంది. అయితే ఎన్నో పోరాటాల తర్వాత రైల్వే జోనే ను కేంద్రం ప్రకటించింది కానీ ఇప్పటి వరకూ దీనిపై ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైగా ఇప్పటికీ ఎన్నో అనుమానాలు, సందేహాలు దీనిపై లేవనెత్తుతూనే ఉన్నారు రైల్వే అధికారులు, మంత్రులు. దీంతో విశాఖకు రైల్వే జోన్ కోరిక తీరుతుందో లేదో అనుమానాస్పదంగానే ఉంది.

విభజనచట్టం లో పేర్కొన్న వాటిలో పలు విద్యాసంస్థలున్నాయి. అవి మాత్రం దాదాపు ప్రారంభమయ్యాయనే చెప్పొచ్చు. ఎయిమ్స్, ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, సెంట్రల్ యూనివర్సిటీ, పెట్రో వర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, గిరిజన యూనివర్శిటీ.. లాంటి అనేక సంస్థలు పురిటి నొప్పులు దాటి ప్రారంభమయ్యాయి. అయితే విభజన చట్టంలోని హామీలు పూర్తి కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని కేంద్రంలోని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. దీనిపై పదే పదే సమావేశాలు నిర్వహిస్తున్నా.. హామీలకు సంబంధించిన వివరాలను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు విఫలమవుతున్నారని ఆరోపిస్తున్నారు. మరి ఈ పీటముడిని ఎవరు విప్పుతారో చూడాలి.

 

 

Tags :