ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పార్లమెంటు వేదికగా 'పొలిటికల్' ఫైట్..

పార్లమెంటు వేదికగా 'పొలిటికల్' ఫైట్..

లోక్‌సభలో దుండగుల చొరబాటు ఘటనతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. డిసెంబరు 13 నాటి ఈ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. దీంతో ప్రతిపక్షాలపై సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. మంగళవారం మరో 49 మంది విపక్ష ఎంపీలపై స్పీకర్‌ వేటు వేశారు. ఈ సమావేశాల మొత్తానికి వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు తెలిపారు. దీంతో మొత్తంగా 141 మందిపై సస్పెన్షన్ వేటు వేసినట్లైంది. దీనికి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ.. ఓ కారణంగా కూడా చెప్పారు. ‘‘సభలోకి ప్లకార్డులు తీసుకురావొద్దనే నిబంధన ఉంది. ఇటీవల జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో వారు నిరాశ చెందారు. అందుకే వారు ఇలాంటి విపరీత చర్యలకు పాల్పడుతున్నారు’’ అని దుయ్యబట్టారు.

కానీ వాస్తవానికి ఈ వ్యవహారంలో అధికార, విపక్షాలు .... రాజకీయ క్రీడను ఆడుతున్నాయని చెప్పక తప్పదు. ఈ వ్యవహారంలో భద్రతా వైఫల్యం ఉన్న మాట వాస్తవం. అది జరిగినప్పుడు అధికార పార్టీ, కేంద్ర ప్రభుత్వాదినేత ప్రధాని మోడీ.. విపక్షాలను కలుపుకుంటూ ముందుకు సాగాలి. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఓ కమిటీ వేసి.. దీని ముగింపునకు నాంది పలకాల్సి ఉంది. దీంతో పాటు భద్రతా ఏజెన్సీలు సైతం .. తమ విచారణ కొనసాగిస్తున్నాయి. కాబట్టి.. ఎక్కడ ఏం జరిగిందన్నది తేలుతుంది. అంతేకానీ.. విపక్షాలు కేవలం దురుద్దేశంతోనే విమర్శలు, ఆందోళనలు చేస్తున్నాయని భావించడం సరైంది కాదని చెప్పాలి. సభలో బలమున్నంత మాత్రాన.. అందరినీ సస్పెండ్ చేస్తామంటే.. అది ప్రజాస్వామ్యం కాదని గతపాలకులు, రాజ నీతిజ్ఞులు చెబుతున్నారు.

సభాపెద్ద అంటే.. అందరినీ కలుపుకుంటూ సాగాలి. సమస్యల పరిష్కారంలో అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సి ఉంటుంది. పార్టీగా ఏమైనా చేసుకోవచ్చు. కానీ ప్రధానమంత్రి.. అంటే ఏఒక్క పార్టీకో కాదు.. దేశానికే ప్రధానమంత్రని గుర్తించాల్సి ఉంది. ఓ వేళ ఏపక్షమైన తప్పుచేసి ఉన్నా కూడా పెద్దమనసుతో క్షమించి, ముందుకెళ్లాలి. అంతేకానీ.... బలప్రయోగం, అధికారం వాడి.. వారిని సస్పెండ్ చేస్తామంటే.. ప్రతీ సమస్యలకు అదే మందు వాడాల్సి ఉంటుంది. ఎన్నాళ్లిలా చేయగలుగుతారు. దీంతో అధికార, విపక్షాల మధ్య రాజకీయ అగాధం మరింత ముదురుంది. అంతిమంగా దేశానికి అది నష్టం చేకూరుస్తుందని చెప్పక తప్పదు. ఇక విపక్షాలు కూడా.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కేంద్రానికి అండగా నిలబడాలి. దేశానికి సమస్య వస్తే మేమంతా పార్టీలకతీతంగా ఏకతాటిపై ఉంటామని ప్రపంచదేశాలకు చాటిచెప్పాలి.

సభలో నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి సస్పెండ్ చేసేశామంటూ పార్లమెంటరీ శాఖ మంత్రి చేతులు దులుపుకోవడం ఎలా సమంజసం కాదో.. జరిగిన ఘటనకు హోంమంత్రి రాజీనామా చేయాలనడం కూడా అలాంటిదే అని చెప్పొచ్చు. ఇదేమీ గాంధీ, నెహ్రూల కాలం కాదు. మాటకు కట్టుబడి ఉండడానికి... నేతలు ఎన్నో చెప్పి అధికారంలోకి వస్తున్నారు.. తర్వాత వాటిని మరుస్తున్నారు. విపక్ష నేతలు హోంమంత్రి రాజీనామాకు డిమాండ్ చేసే బదులు.. అసలు ఈఘటన ఎలా జరిగిందన్న దానిపై ప్రభుత్వంతో కలిసి నడిస్తే .. దేశ భవిష్యత్తుకు మంచి చేసినవారవుతారు. భద్రతా వైఫల్యం ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపట్టాల్సి ఉంది.

 

 

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :