ASBL NSL Infratech

ఎన్టీఆర్ వైద్యసేవ కింద ప్రసూతి సేవలు, అంగన్ వాడీ భవనాలకు అన్ని హంగులు

ఎన్టీఆర్ వైద్యసేవ కింద ప్రసూతి సేవలు, అంగన్ వాడీ భవనాలకు అన్ని హంగులు

ఎన్టీఆర్ వైద్యసేవలో తొలిసారి కాన్పులను చేర్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులలో కాన్పులకు కూడా ఎన్టీఆర్ వైద్య సేవను వర్తింపజేస్తున్నామన్నారు. 
ఇందువల్ల ఐఎంఆర్, ఎంఎంఆర్ ఇంకా గణనీయంగా తగ్గించగలమన్నారు. మహిళలలో రక్తహీనతను గణనీయంగా తగ్గించామని, ఇంకా పట్టణాలలో అక్కడక్కడా ఉందని చెప్పారు. బాలసంజీవని మరింతగా అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి కోరారు. అంగన్ వాడి భవనాలన్నింటిలో మరుగుదొడ్లు, విద్యుత్,తాగునీటి వసతి ఉన్న రాష్ట్రం ఒక్క ఆంధ్రప్రదేశ్ మాత్రమేనని సీఎం స్పష్టం చేశారు. ఈ ఏడాది 1456అంగన్ వాడి భవనాల నిర్మాణం పూర్తిచేశాంమని, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు వివరించారు. ఎన్టీఆర్ వైద్యసేవ,చంద్రన్న సంచార చికిత్స,ఎన్టీఆర్ బేబికిట్స్, ఉచిత వైద్యపరీక్షలు అన్నింటిలో 80%పైగా సంతృప్తి ప్రజల్లో రావాలి కోరారు. బాలామృతం,అన్న అమృతహస్తం,మధ్యా హ్నభోజనం అన్నింటిలో 90%పైగా సంతృప్తి ప్రజల్లో ఉందని, అదే విధమైన సంతృప్తి వైద్యఆరోగ్యంలో కూడా రావాలని ముఖ్యమంత్రి సూచించారు. సంక్రాంతికల్లా అన్ని అంగన్ వాడి భవనాల్లో తాగునీరు,విద్యుత్,మరుగుదొడ్ల వసతులు కల్పించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎక్కడా పోషకాహార లోపం అనేదే ఉండకూడదని, మహిళలు,శిశువులు పూర్తి ఆరోగ్యంతో ఆనందంగా ఉండాలని, కడప,అనంతపురం,చితూరు జిల్లాలలో పారిశుద్యం మెరుగుపడాలని సీఎం ఆదేశించారు. అలాగే ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించే పద్ధతి మరింత మెరుగుపడాలని సీఎం అన్నారు. 
పరిశుభ్రమైన మంచినీరు ఇద్దాం
గుంటూరు,గోదావరి జిల్లాలలో మంచినీరు పరిశుభ్రంగా లేదన్న అభిప్రాయం వస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ‘ప్రజలనుంచి ఇలాంటి ఫిర్యాదులు రాకుండా పనిచేయాలి. వాటర్ ట్యాంకర్లు రావడం లేదనే మాట ఎవరూ అనకూడదు. రాబోయే వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా ఇప్పటినుంచే తగిన చర్యలు తీసుకోవాలి., మన తొలి ప్రాధాన్యత తాగునీటి సరఫరా. ఎక్కడా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదు. జలవనరులు,గ్రామీణ,పట్టణాభివృద్ధి శాఖలు సమన్వయం చేసుకోవాలి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. పాఠశాలల ప్రహరీగోడల నిర్మాణం పూర్తిచేయాలని, డిజిటల్ తరగతి గదులు వెంటనే పూర్తిచేయాలని చంద్రబాబు కోరారు. గతంలో అంగన్ వాడీ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని, అలాంటిది ఇప్పుడు అంగన్ వాడిపైనే పూర్తి శ్రద్ధపెట్టామన్నారు. 
మౌలిక సదుపాయాలతో పాటు అంగన్ వాడి సేవల్లో మంచి పురోగతి ఉందని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. పాఠశాల విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ కూడా ఆదే స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. ఘన వ్యర్ధాల నిర్వహణలో 8,397 షెడ్ల నిర్మాణం పూర్తిచేశామని, మిగిలినవి కూడా సంక్రాంతికల్లా పూర్తిచేయాలని ఆదేశించారు. 12,626 ట్రైసైకిళ్లు అందజేశామని, ఎల్ ఈడి బల్బుల ఏర్పాటును జనవరి 31 కల్లా పూర్తిచేస్తామని అన్నారు. ఇంకుడు గుంతల తవ్వకం చాలా మందకొడిగా జరుగుతోందని, వెంటనే పూర్తిచేయాలని, సవివర నివేదికలు అందజేసిన అన్నిప్రాంతాలలో భూగర్భ డ్రైనేజీ పై కలెక్టర్లు దృష్టి పెట్టాలని, గ్రామాల్లో రోడ్ల అభివృద్ధి పనులు ముమ్మరం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.గతఏడాదికన్నా స్వైన్ ఫ్లూ 18% తగ్గిందని, అంటువ్యాధుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు. ఎన్టీఆర్ సుజల పథకం, ఆర్వో ప్లాంట్లు వచ్చాక ఉద్దానం ప్రాంతంలో కూడా కిడ్నీ వ్యాధులు నియంత్రణలోకి వచ్చాయని సీఎం తెలిపారు. మిగిలిన ప్రాంతాలలో కూడా రక్షిత తాగునీటిని అందరికీ అందుబాటులోకి తెస్తే చాలా వరకు అంటువ్యాధుల బెడద తగ్గించవచ్చన్నారు. 108 సేవలు అందించడంలో అంతర్జాతీయంగా మెరుగైన సేవలను అధ్యయనం చేసి ఇక్కడ మన రాష్ట్రానికి అన్వయించి అమలు చేయాలని కోరారు.

praneet praneet praneet obili-garuda Vertex poulomi Png-jewelry
Tags :