ASBL NSL Infratech

తెలంగాణ ఎన్నికల్లో పోటీకీ ఎందుకు భయం...!?

తెలంగాణ ఎన్నికల్లో పోటీకీ ఎందుకు భయం...!?

అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డికి రాష్ట్రమంతటా అభిమానులు, అనుచరులు ఉన్నారు. వైఎస్‌ మరణం తరువాత కాంగ్రెస్‌ నుంచి విడిపోయి ప్రత్యేక పార్టీని పెట్టుకున్న వైఎస్‌ జగన్‌ కు మద్దతు తెలిపిన వారిలో తెలంగాణకు చెందిన ఎంతోమంది నాయకులు, అనుచురులు కూడా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ పార్టీకి చెందిన నాయకులు కూడా గెలిచారు. ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కూడా తన ఉనికిని చాటాల్సిన వైఎస్‌ఆర్‌ జగన్‌ పార్టీ తాను ఈ ఎన్నికల్లో పాల్గొనలేదని ప్రకటించింది. నాయకులు, అనుచరులు, జగన్‌ నివాసం ఉండేది కూడా హైదరాబాద్‌లోనే అయినప్పుడు ఇక్కడ పోటీకి సై అనకపోవడం కార్యకర్తలను విస్మయపరిచింది. అదే విధంగా పవన్‌ కళ్యాణ్‌ స్థాపించిన జనసేన కూడా తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచారు.

తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ తమ పార్టీల ప్రభావం అధికంగానే ఉందని గతంలో ప్రకటించిన ఈ  రెండుపార్టీలు నేడు తెలంగాణ ఎన్నికల బరిలో ఎక్కడా కనిపించడంలేదు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయి, ఇతర పార్టీలు అభ్యర్థులు ఎంపిక, నామినేషన్ల పర్వంలో హడావుడిగా ఉన్నప్పటికీ ఈ పార్టీల ఊసు కూడా తెలంగాణలో లేదు. పైగా ఈ రెండు పార్టీల కేంద్ర కార్యాలయాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయి. అయితే ఈ రెండు పార్టీలు స్వంతంగా అభ్యర్థులను తెలంగాణలో పోటీ పెట్టకపోయినప్పటికీ, కనీసం ఇతర పార్టీలలో ఏ ఒక్క ఏపార్టీకి కూడా కనీసం మద్దతు కూడా తెలిపే సాహసం చేయడం లేదు. పరోక్షంగా అయినా ఈ పార్టీలు రెండుకూడా ఎవరికీ చేయూతనిచ్చేందుకు ప్రయత్నించడం లేదు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్‌ఆర్‌సి తోపాటు ఎపిలో ఇక కీలక భూమిక నిర్వహిస్తామని చెబుతున్న జనసేన. అవి తెలంగాణలో తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు ఎందుకు ముందుకురావడంలేదో ఎవరికీ అర్థం కాలేదు. తెలంగాణలో పోటీ చేసినా..ఇతర పార్టీలక మద్దతు తెలిపినా ఎపిలో పార్టీలకు తీవ్ర నష్టం జరుగుతుందనే భయంతోనే అవి వెనుకంజ వేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. పైగా ఈ రెండు పార్టీల నేతలకు కూడా తెలంగాణలో ఉన్న ఒక పార్టీ పట్ల కొంత సాఫ్టు కార్నర్‌ఉన్నదని, ఈ పార్టీకి అండగా అవి ఉండే అవకాశాలున్నట్లగా ప్రారంభంలో గుసగుసలు వినబడినప్పటికీ తాజాగా ఈ పార్టీలు తెలంగాణ ఎన్నికలకు దూరంగానే ఉండిపోతున్నాయి. కాగా ఎపిలో అధికార పక్షంగా ఉన్న తెలుగుదేశం మాత్రం తెలంగాణలో కీలకంగానే వ్యవహరిస్తూ, మహాకూటమిలో భాగస్వామిగా ఉండి, 14 సీట్లలో పోటీపడుతున్నది.

తెలంగాణలో అటు జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ కానీ, ఇటు వపన్‌ కళ్యాణ్‌ పార్టీ కానీ టిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు అంటే ఇంతో అంతో స్నేహం ఉన్నట్లుగా చెబుతుంటారు. 2014 లో సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఫలితాలు ప్రకటించక ముందు తెలంగాణలో టిఆర్‌ఎస్‌, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సి విజయం సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయని ఆనాడు కెసిఆర్‌ ఊహించి, విలేకర్ల సమావేశంలోనే వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న పూర్తి వ్యతిరేకతతో ఆనాడు కెసిఆర్‌ చేసిన ఈ ప్రకటన వల్లనో ఇతరత్రా కారణాల వల్లనో కానీ, కెసిఆర్‌,జగన్‌ల మధ్య శత్రు భావంలేదని ప్రచారం జరిగింది. ఇక జగన్‌పై జరిగిన కోడికత్తి దాడి తర్వాత అక్కడి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్‌ను కనీసం ఫోన్‌లో కూడా పరామర్శించలేదు, కానీ కెసిఆర్‌ దాడిని ఖండించడంతోపాటు జగన్‌ యోగక్షేమాలు తెలుసుకున్నారు.

2014 ఎన్నికల తర్వాత జగన్‌, కెసిఆర్‌లు పరస్పరం ఆరోపణలు చేసుకున్న సందరాÄలుే కూడా పెద్దగాలేవు అనడంకంటే అసలు లేవనే అంటున్నారు. కెసిఆర్‌తో జగన్‌ నేరుగా దోస్తీ చేయకపోయినప్పటికీ వారి మధ్య సత్సంబంధాలే ఉన్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో జగన్‌ పార్టీ నిర్ణయం తీసుకొని తెలంగాణలో ఏదో ఒక పార్టీకి మద్దతు ఇవ్వాల్సి వస్తే, అది టిఆర్‌ఎస్‌కే అవకాశం దక్కేదని భావిస్తున్నారు. కానీ రాష్ట్ర విభజన పరిస్థితుల్లో టిఆర్‌ఎస్‌ పట్ల ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ఉన్న వ్యతిరేక భావం వల్ల జగన్‌ పార్టీ ఏదో రకంగా టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి అయితే ఎపిలో వైఎస్‌ఆర్‌సికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయనే భయంతోనే జగన్‌ కూడా తెలంగాణ ఎన్నికలను కనీసం పట్టించుకోవడం లేదని అంటున్నారు. పైగా దాడితో కొన్నాళ్లు పాదయాత్రకు విరామం ప్రకటించి,తిరిగి యాత్రను కొనసాగిస్తున్న జగన్‌కు తెలంగాణ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని భావించినా..ఆ మేరకు సమయం కూడా లేదని పరిస్థితి కనిపిస్తున్నది. పైగా తెలంగాణ పట్ల ఎపిలో నెలకొని ఉన్న అభిప్రాయాల దష్ట్యా ఏ పార్టీకి కూడా జగన్‌ పార్టీ మద్దతు తెలుపలేదు. పైగా స్వంతంగా తమ పార్టీని ఎన్నికల బరిలోకి దింపాలనే ఆలోచన కూడా చేయకపోవడంతో వైఎస్‌ఆర్‌సి తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు దూరంగా ఉండిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

పవన్‌ కళ్యాణ్‌ 2019లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తన జనసేన పార్టీని గెలిపించుకొని ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ఎపిలో పర్యటిస్తూ అనేక బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. అయితే పవన్‌ కు కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ పట్ల ప్రత్యేక అభిమానం ఉన్నట్లుగా ప్రచారం ఉంది. కెసిఆర్‌ అధికార నివాసంకు వెళ్లి, పవన్‌ ముఖ్యమంత్రిని కలిసి గతంలో మాట్లాడారు. వారిద్దరి మధ్య ఉన్న సత్సంబంధాల వల్ల పవన్‌ మద్దతు తీసుకొని తెలంగాణలో ఆయనతో టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటారని కూడా పరిశీలకులు భావించారు.ముఖ్యంగా తెలంగాణలో పవన్‌ కళ్యాణ్‌ సినీ గ్లామర్‌తో పాటు ఆయన సామాజిక వర్గంతో సమానంగా భావిస్తున్న మున్నూరు కాపు సామాజిక వర్గం ఓట్లను ఆకర్శించుకోవాలని కొంత ప్రయత్నం జరిగిందని, దీనికి పవన్‌ కూడా సుముఖత వ్యక్తం చేశారని అంటున్నారు. పవన్‌ కళ్యాణ్‌ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఉన్నందున ఆయన తెలంగాణలో ప్రచారం చేస్తే కొంత ఉపకరిస్తుందని టిఆర్‌ఎస్‌ కూడా అంచనా వేసింది. ఈ మేరకు తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు మద్దతుగా పవన్‌ ప్రచార పర్యటన దాదాపు ఖరారు అయిందని ఇందుకు తగిన కార్యాచరణ కూడా సిద్ధం చేస్తన్న సమయంలో జనసేనలో ఈ విషయమై జరిగిన చర్చ పవన్‌ను సందిగ్ధంలో పడవేసిందనే విశ్లేషణలు వస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు మద్దతు ఇస్తే ఆంధ్రప్రదేశ్‌లో తన జనసేన పార్టీకి ఎదురయ్యే పరిణామాలను చర్చించుకున్న తర్వాత పవన్‌ డోలాయమానంలో పడ్డారని తెలిసింది. టిఆర్‌ఎస్‌కు ప్రచారం చేయడంతో ఎపిలో కొత్త సమస్య పెంచుకున్నట్లు అవుతుందనే సలహాలతో పవన్‌ తన మనస్సు మార్చుకున్నారని దీంతో తెలంగాణలో పవన్‌ పర్యటనలు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

 

Tags :