ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే టీడీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు.. చంద్రబాబు మాస్ వార్నింగ్..
ఎన్నికల నేపథ్యంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యవేక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, పోలీసు అధికారులదేనని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. తనకు నచ్చిన వారికి ఓటు వేసే స్వతంత్రం ప్రతి ఒక్క ఓటర్ కి ఉందని ఆయన అన్నారు. అలాగే తమ పార్టీ తరఫున ఏజెంట్లను పెట్టుకునే హక్కు ప్రతి పార్టీకి ఉందని.. అన్ని పార్టీల ఏజెంట్లను అనుమతించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. పుంగనూరు, మాచర్ల నియోజకవర్గాలలో వైసీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నట్లు సమాచారం వచ్చిందని.. ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసి మాట్లాడుతున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈరోజు మంగళగిరిలో ఓటు వేసిన చంద్రబాబు అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నాయని.. ఈ విషయాన్ని అందరూ గుర్తు పెట్టుకోవాలని.. ఎవరైనా ఎన్నికలను అపహస్యం చేయడానికి ప్రయత్నిస్తే తమ కార్యకర్తలు గమ్ముగా ఉండబోరని హెచ్చరించారు. అంతేకాదు లా అండ్ ఆర్డర్ ప్రకారం ఓటింగ్ ప్రక్రియ పూర్తి కావాలని తాము ఆశిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఓటమి భయంతో రౌడీయిజం.. గుండాయిజం తో తమ పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ చేస్తే ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించబోమని చంద్రబాబు మాస్ వార్నింగ్ ఇచ్చారు.