ASBL NSL Infratech

తానా బోర్డ్‌ ఇప్పుడేమి నిర్ణయం తీసుకుంటుంది?

తానా బోర్డ్‌ ఇప్పుడేమి నిర్ణయం తీసుకుంటుంది?

బోర్డ్ నిర్ణయాలు ఏక పక్షంగా వుంటున్నాయన్న అభిప్రాయాలలో నిజమెంత? ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో ఇటీవల జరిగిన ఎన్నికలు, ఫలితాలు, దానిపై నెలకొన్న ప్రతిష్టంభన నేపథ్యంలో తెలుగు టైమ్స్‌ ప్రచురించిన కథనాలకు అన్నీ చోట్ల మంచి స్పందన వచ్చిన సంగతి తెలిసిందే.

తాజాగా రెండు రోజుల క్రితం జరిగిన బోర్డ్‌ సమావేశం, అందులో చర్చించిన అంశాలపై బోర్డ్‌ చైర్మన్‌ హనుమయ్య బండ్ల అందరికీ ఇ-మెయిల్‌ ద్వారా తెలియజేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు చేసిన ఫిర్యాదుపై ఎలక్షన్‌ ట్రస్ట్‌ నుంచి మేము నివేదికను అడిగాము. దానిపై ఎన్నికల ట్రస్ట్‌ వారు పంపించిన నివేదికపై తాజాగా జరిగిన బోర్డ్‌ సమావేశంలో చర్చించడం జరిగింది. బోర్డ్‌లో చర్చించిన తరువాత దీనిపై మరింత వివరణ అవసరమని భావించి డాక్టర్‌ చౌదరి జంపాల ను ఈ విషయమై ఎలక్షన్‌ ట్రస్ట్‌ తో కలిసి పనిచేసి మరికొన్ని ఇవ్వమని కోరడం జరిగింది. దీనిపై వచ్చే నివేదికను ఫిబ్రవరి 28వ తేదీన జరిగే బోర్డ్‌ సమావేశంలో మరోసారి చర్చించి తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చైర్మన్‌ హనుమయ్య బండ్ల సభ్యులకు పంపిన ఇ-మెయిల్‌లో పేర్కొన్నారు.

కాగా ఈ బోర్డ్‌ సమావేశం తరువాత జరిగిన పరిణామాలను అందరికీ సవివరంగా తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో తెలుగుటైమ్స్‌ బోర్డ్‌లో జరిగిన పరిణామాలను ఈ కథనం ద్వారా వివరిస్తున్నాము.

ఈ విషయమై తెలుగు టైమ్స్‌ జంపాల చౌదరితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ఎలక్షన్‌ ట్రస్ట్‌ కు బాధ్యతలు అప్పగించే ముందు కొన్ని ప్రాథమిక సూత్రాలను తెలియజేశాము. వాటిని ఎలక్షన్‌ ట్రస్ట్‌ సరిగా అర్థం చేసుకోకపోవడం వలన కొన్ని పొరబాట్లు జరిగాయని తెలిపారు. అందుకని ఎలక్షన్‌ ట్రస్ట్‌ ఇచ్చిన వివరాలను విశ్లేషించి, మరిన్ని వివరాలు కావాలని అడిగాము. ఇందుకోసం వారికి ఒకవారం రోజులపాటు వ్యవధిని ఇచ్చాము. దీనిపై వారు నివేదిక ఇచ్చిన తరువాత ఫిబ్రవరి 28న బోర్డ్‌ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఇప్పుడు సమస్య ఏమిటి?

తానా ఎన్నికల్లో 23974 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దాదాపు 16000 ఫోన్లకు ఓటీపీలు వెళ్ళాయి. అయితే కొంత గందరగోళం నేపథ్యంలో 309 ఓట్లు అటు ఇటుగా ఉన్నట్లు ఎలక్షన్‌ ట్రస్ట్‌ గుర్తించింది. తానా లైఫ్ మెంబర్ కుటుంబానికి రెండు ఓట్లు, డోనార్ మెంబర్ కుటుంబానికి 4 ఓట్లు వుంటాయని, లైఫ్ మెంబర్ - డోనార్ మెంబర్ లను గుర్తించి వారికి OTP పంపటం లో జరిగిన స్వల్ప పొరపాటు, దాని వలన అదనంగా 309 ఓట్లు వచ్చినట్టు ఎలక్షన్ ట్రస్ట్ తన నివేదిక లో తెలిపింది. ఇందువల్ల ఈ 309 ఓట్ల విషయంలో మరిన్ని వివరణ కావాలని జయ్‌ తాళ్ళూరి వర్గం కోరుతోంది. మరోవైపు అంజయ్య చౌదరి వర్గం ఈ వివాదానికి కారణంగా ఉన్న 309 ఓట్లను తొలగించి విజేతలను ప్రకటించాలని డిమాండ్‌ చేస్తోంది.

బోర్డ్‌లో ఇప్పుడు పరిస్థితిని గమనించినప్పుడు బోర్డ్‌ రెండు వర్గాలుగా చీలిపోయి ఉన్నట్లు కనిపిస్తోంది. డాక్టర్‌ హనుమయ్యబండ్ల చైర్మన్ గా వుండగా, జంపాల చౌదరి, నిరంజన్‌ శృంగవరపు, జయ్‌ తాళ్ళూరి, సతీష్‌ వేమూరి, అశోక్‌ కొల్లా, వెంకటరమణ యార్లగడ్డ, శ్రీకాంత్‌ పోలవరపు, మురళి వెన్నం ఒకవర్గంగా ఉన్నారు. అంజయ్య చౌదరి లావు, శ్రీనివాస్‌ లావు, జాని నిమ్మలపూడి, శశికాంత్‌ వల్లేపల్లి, డా. నాగేంద్ర శ్రీనివాస్‌ ఒక వర్గంగా ఉన్నారు. లక్ష్మీ దేవినేని తటస్థంగా ఉంటారు. ఎన్నికల్లో పోటీ చేసిన సతీష్‌ వేమూరి, అశోక్‌ కొల్లా, వెంకటరమణ యార్లగడ్డకు ఎన్నికలకు సంబంధించిన విషయాలపై ఓటు వేసే హక్కు ఉండదు.

ఏదీ ఏమైనా ప్రజాస్వామ్యయుతంగా జరిగిన ఎన్నికల్లో అదీ మొదటిసారిగా ఆన్‌ లైన్‌ ద్వారా జరిగిన ఓటింగ్‌ వల్ల కొంత గందరగోళం ఏర్పడి ఉండవచ్చు. కాని వివాదం వచ్చిన ఓట్లను తొలగించమని ఎదుటివర్గం కోరినప్పుడు దానిని పరిశీలించి అవసరమైతే తొలగించి విజేతలను ప్రకటించేందుకు బోర్డ్‌ నిర్ణయం తీసుకుంటే బావుంటుందన్నట్లుగా సూచనలు వస్తున్నాయి. మొత్తం గా 24000 మంది తమ ఓటు హక్కు వినియోగించి ఓటింగ్ చేశాక, కేవలం 1.2% ( 309 ఓట్లు ) కోసం సభ్యులందరూ ఇచ్చిన తీర్పు ని 40 రోజుల పైగా ఆపటం సమంజసం కాదని అందరూ సోషల్ మీడియా లో అనుకోవటం కూడా తెలుగు టైమ్స్ గుర్తించింది.

ఈ విషయంలో బోర్డ్‌ వచ్చే సమావేశంలోనైనా గట్టి నిర్ణయం తీసుకుంటుందని ‘తెలుగుటైమ్స్‌’ భావిస్తోంది.

 

 

Tags :