ASBL NSL Infratech

కేసీఆర్ పైనే గంపెడాశలు

కేసీఆర్ పైనే గంపెడాశలు

అభ్యర్థుల ఎంపిక, ప్రచార సరళి, పొత్తులు, సీట్ల సర్దుబాటు అంశాలను పరిశీలిస్తే ముందస్తు ఎన్నికలకు సిద్ధమైన తెరాస కేసీఆర్‌ నాయకత్వంపైనే గంపెడాశలు పెట్టుకుంది. ఆయన నాయకత్వమే తమకు శ్రీరామరక్ష అంటూ ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో ఆయనే కర్త, కర్మ ,క్రియ.. అన్నీ తానై నడిపిస్తున్నారు. నాలుగేళ్లుగా తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలతో పాటు కొత్తగా ఇస్తున్న ఎన్నికల హామీలను చూసి ఆశీర్వదించాలని తెరాస ప్రజలను కోరుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రణాళికలో ప్రజలకు ఇస్తున్న హామీలపైనే ఆ పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. వీటికి తోడు ప్రభుత్వాన్ని రద్దు చేసిన రోజునే 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో వారంతా నియోజకవర్గాల్లోనే బస చేసి ఇంటింటికి, గ్రామ, గ్రామానికి తిరుగుతూ రెండు, మూడు విడతల ప్రచారాన్ని కూడా పూర్తి చేశారు. ఇది తమకు కలిసి వస్తుందన్న దీమాతో ఆ పార్టీ ఉంది.

పార్టీ నేతలు, అభ్యర్థులు రెండు మాసాలుగా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారని, ఆ పార్టీ చెబుతోంది. తెరాస అధినాయకత్వం ఖరారు చేసిన అభ్యర్థులపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత క్షేత్రస్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వంపై ఆయా వర్గాల్లో ఉన్న వ్యతిరేకత కూడా ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. అధికారంలో కొనసాగినప్పుడు ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు తెరాసకు ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కూడా వారు విశ్లేషిస్తున్నారు.

 

Tags :