లక్ష మంది రేవంత్‌లు వచ్చినా బీఆర్ఎస్‌ను ఏం చేయలేరు: కేసీఆర్
బీఆర్ఎస్ పార్టీ ఓ మహాసముద్రమని, లక్షమంది రేవంత్ రెడ్డిలు వచ్చినా తమ పార్టీని ఏం చేయలేరని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 5 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించకపోవడమే కాకుండా, కరెంటు కష్టాలు, నీటి కష్టాలను ఇచ్చి రాష్ట్ర అభివృద్ధిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఎగబెట్టాలని చూస్తోందని, అందుకే సాగు చేసిన వాళ్లకే రైతుబంధు ఇస్తామంటూ రేవంత్ రెడ్డి మెలిక పెడుతున్నారంటూ ఆరోపించారు. పంటసాగు చేస్తున్నట్లు సర్టిఫికెట్ ఏఈఓ, వీఆర్ఓ ఇవ్వాలని.. వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వడానికి లంచం అడుగుతారని అన్నారు. ఇలాంటి అవినీతిని బీఆర్ఎస్ ఎన్నడూ సహించదని, రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని నిప్పులు చెరిగారు. లక్ష మంది రేవంత్ రెడ్డిలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి వెంట్రుక మందం కూడా ఫరక్ పడదని ధ్వజమెత్తారు.